Abn logo
Oct 22 2020 @ 00:51AM

గింజలపై గీత రాసింది

Kaakateeya

బియ్యపు గింజలపై తాజ్‌మహల్‌, చార్మినార్‌ వంటి ఎన్నో కళాకృతులను చిత్రించడం మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్‌ రామగిరి సారిక ఏకంగా భగవద్గీతనే బియ్యపు గింజలపై రాసి రికార్డు సృష్టించింది. దీని కోసం వేల సంఖ్యలో బియ్యపు గింజలను వినియోగించింది. ఇంతవరకు ఎవరూ సృష్టించని కళాఖండాన్ని రూపొందించి తన ప్రతిభను ఘనంగా చాటుకుంది. 


న్యాయ విద్య విద్యార్థిని అయిన సారికకు చిన్నప్పటి నుంచి కళలంటే ఎంతో ఇష్టం. పాటలు పాడడం, వివిధ కళాకృతులు తయారు చేయడంలో ఎంతో మక్కువ చూపించేది. చిన్న చిన్న వస్తువులపై బొమ్మలు వేస్తుండేది. అది చూసి ఆమె తల్లితండ్రులు మురిసిపోయేవారు. కూతురిని ప్రోత్సహించారు. అంతేకాదు... సారిక రాగయుక్తంగా పాటలు కూడా పాడుతుంది. 2009లో లక్షమందితో కలిసి ఒకేసారి కీర్తనలు ఆలపించినందుకు గాను ఆమెకు ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కింది. మైక్రో ఆర్ట్‌పై దృష్టి... 

అయితే గత నాలుగేళ్లుగా సారిక మైక్రో ఆర్ట్‌పై అధికంగా దృష్టి సారించింది. మొదట బియ్యపు గింజలపై ఇంగ్లిషు అక్షరాలు రాసి ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది. ఆ తరువాత మరికొన్ని కళాకృతులు గీయడం నేర్చుకుంది. గత ఏడాది ‘నార్త్‌ ఢిల్లీ కల్చరల్‌ అకాడమీ’ నుంచి జాతీయ అవార్డు కూడా అందుకుంది సారిక. అయినా ఆమెకు ఏదో వెలితి. ఇంకా గొప్పగా ఏదైనా చేయాలనే తపన. ఆ తపనలో నుంచి పుట్టిన ఆలోచనే బియ్యపు గింజలపై భగవద్గీత. అనుకున్నదే తడవుగా బియ్యంపై అక్షరాలు చెక్కడం మొదలుపెట్టింది.ఎన్నో రోజుల పరిశ్రమ... 

బియ్యపు గింజలపై భగవద్గీత... వినడానికి అద్భుతంగా ఉంది. కానీ వాటిపై అక్షరాలు రాయడమంటే సామాన్యం కాదు. మనసు లగ్నం చేసి పూర్తి ఏకాగ్రతతో పనిచేయాలి. రోజుల తరబడి శ్రమించాలి. ఒక్కో గింజపై అక్షరాలు రాసుకొంటూ పోవాలి. అయితే సారిక ఆ కష్టాన్ని ఎంతో ఇష్టంగా భావించింది. తన ఆశయం ముందు మిగతా ఇబ్బందులన్నీ ఆమెకు చిన్నవిగా కనిపించాయి. అన్నింటినీ అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగింది సారిక. 


150 గంటలు... 4042 గింజలు... 

మైక్రో ఆర్టిస్టులకు నైపుణ్యం ఒక్కటే సరిపోదు. దానికి మించిన ఓర్పు కూడా ఉండాలి. ‘‘బియ్యపు గింజలపై భగవద్గీత రాయడానికి 150 గంటల సమయం పట్టింది. దీని కోసం 4042 బియ్యపు గింజలు ఉపయోగించాను. ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేసినందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. నా కళకు మరింత పదును పెట్టి, మరిన్ని విభిన్నమైన కళాఖండాలు రూపొందించాలనుకొంటున్నాను. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తా’’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది సారిక. 


రెండు వేలకు పైగా... 

మైక్రో ఆర్టిస్ట్‌గా సారిక ఇప్పటి వరకు రెండు వేలకు పైగా కళాకృతులను బియ్యపు గింజలపై చిత్రించింది. దేశంలోనే తొలి మహిళా మైక్రో ఆర్టిస్ట్‌ను తానే అని చెబుతున్న సారిక... నువ్వు గింజలపైౖనా కళాకృతులు చెక్కింది. పేపర్‌ కార్వింగ్‌, మిల్క్‌ ఆర్ట్‌ వంటి కళల్లో కూడా ఆమెకు పట్టుంది. అంతేకాదు... భారత రాజ్యాంగ పీఠికను వెంట్రుకలపై చిత్రించి చరిత్ర సృష్టించింది. ఇందుకు గాను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అభినందనలు అందుకుంది. బియ్యపు గింజలపై వినాయకుడి బొమ్మతో మైక్రో ఆర్ట్‌కు శ్రీకారం చుట్టిన సారిక... ఇలాంటి కళాఖండాలెన్నింటినో చెక్కి యువ కళాకారుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Advertisement
Advertisement