భాగవత్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-05-21T06:16:21+05:30 IST

ఆర్ఎస్ఎస్ అధినాయకుడు మోహన్ భాగవత్ ఇటీవల ఒక ప్రసంగ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ప్రజలు అందరూ అలక్ష్యంగా...

భాగవత్ వ్యాఖ్యలు

ఆర్ఎస్ఎస్ అధినాయకుడు మోహన్ భాగవత్ ఇటీవల ఒక ప్రసంగ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ప్రజలు అందరూ అలక్ష్యంగా ఉండడం వల్లనే ప్రస్తుత కొవిడ్ సంక్షోభం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ సమయంలో అందరూ ఐక్యంగా ఉండి పరిస్థితిని ఎదుర్కొనాలని, ఒకరినొకరు నిందించుకోవడం వల్ల ప్రయోజనం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ అధినేత తమ కనుసన్నలలో నడిచే ప్రభుత్వం మీదనే అసంతృప్తిని వ్యక్తం చేశారని, దీనికి రాజకీయ పర్యవసానాలుంటాయని సహజంగానే రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఆ వ్యాఖ్యల ద్వారా భాగవత్ సంఘ్ పరివార్ అసంతృప్తిని రాజకీయ నాయకత్వానికి తెలియజేస్తున్నారా? లేక, నిష్పాక్షిక విమర్శ చేయడం ద్వారా తమను కేంద్రప్రభుత్వం మంచిచెడ్డల నుంచి ఎడం జరుపుకుంటున్నారా? ఇటీవల బెంగాల్ లోనూ, దక్షిణాదిలోనూ ఎదురయిన అపజయం, జాతీయంగా అంతర్జాతీయంగా నరేంద్రమోదీ ప్రభుత్వం పై పెరుగుతున్న విమర్శల వల్ల కూడా భాగవత్ చేసింది యథాలాపపువ్యాఖ్యలు కావు అనే అభిప్రాయం ఏర్పడింది. 


భారతీయ జనతాపార్టీకి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు ఉన్న సంబంధం విచిత్రమైనది. ఒక రాజకీయపార్టీ, ఒక సైద్ధాంతిక సంస్థల ద్వంద్వం ఈ తరహాలో ప్రపంచంలో ఎక్కడా లేదనుకోవచ్చు. కమ్యూనిస్టు పార్టీలకు అనేక ప్రజాసంస్థలు, వేదికలు, మేధావి బృందాలు వెన్నుదన్నుగా ఉంటాయి. కానీ, రాజకీయ విభాగానిదే ప్రాథమ్యం. పార్టీకి వెనుక చాలా ఉండవచ్చు, ముందు ఎవరూ ఉండరు. బిజెపి, ఆర్ఎస్ఎస్‌లో ఎవరు ముందు, ఎవరు వెనుక? బిజెపికి ఆర్ఎస్‌ఎస్ అనుబంధ సంస్థా? లేక, ఆర్ఎస్ఎస్‌కు బిజెపి రాజకీయ విభాగమా? ఈ విషయాలను చర్చించేటప్పుడు గమనించవలసిన కొన్ని అంశాలున్నాయి. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ, దాని పనితీరు, వ్యూహరచన మొదలైన విషయాలలో కొంత నిగూఢత ఉన్నది. పూర్తి పారదర్శకత లేకపోవడం వల్ల కొంత మార్మికత కూడా నెలకొని ఉన్నది. ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు ఒక రాజకీయపార్టీకి సాధారణంగా ఉండే లక్ష్యాల కంటె మించినవని తెలుసును. ఆ లక్ష్యాల సాధనకు ఒక రాజకీయపక్షం నిబద్ధంగా ఉండడం అవసరమే అయినప్పటికీ, ఇతర పక్షాలను కూడా తమ సిద్ధాంత పరిధిలోకి తెచ్చి లక్ష్యాన్ని శీఘ్రతరం చేయడానికి ఆ సంస్థ పనిచేస్తుంది. ఒకనాడు భారతీయ జనసంఘ్‌ను కానీ, ఇప్పుడు భారతీయ జనతాపార్టీని కానీ ఆర్ ఎస్ఎస్ నియంత్రిస్తుందని, ఆర్ఎస్ఎస్ ఆమోదం సమృద్ధిగా ఉండడం రాజకీయపార్టీ నాయకత్వానికి అవసరమని ప్రజలలో ఒక అభిప్రాయం బలంగా ఉన్నది. 


తనను తాను సాంస్కృతిక సామాజిక సంస్థగా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ తన రాజకీయ విభాగంగా పరిగణించే బిజెపికి ఎంత స్వయంప్రతిపత్తి ఇస్తుందనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. 1977 జనతాప్రయోగం, 1989 నేషనల్ ఫ్రంట్‌కు మద్దతు చెప్పిన సందర్భం, 1999 నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) మొదటి దఫా ప్రభుత్వం- ఈ సమయాల్లో భారతీయ జనతాపార్టీ లేదా జనసంఘ్, కూటమి ప్రయోజనాలకు లోబడి వ్యవహరించవలసిన అగత్యంలో ఉండింది. భాగస్వామ్యపార్టీల నుంచి వచ్చే ఒత్తిడులు, ఆర్ఎస్ఎస్ ఒత్తిడులను పూర్వపక్షం చేసేవి. ప్రభుత్వం కొనసాగడం ముఖ్యమైన సందర్భాలలో సంఘ్ పరివార్ తాము కీలకంగా పరిగణించే అనేక అంశాలను వాయిదా వేయడానికి సిద్ధపడింది. 2014లో నరేంద్రమోదీ నాయకత్వాన బిజెపి కేంద్రంలో సాధించిన విజయం అసాధారణమైనది. నామమాత్రంగా దాన్నికూడా ఎన్‌డిఎ–-2 ప్రభుత్వం అన్నారు కానీ, భాగస్వామ్య పక్షాలను ఖాతరు చేయనక్కర లేని ఘనమైన మెజారిటీతో మోదీ ఉన్నారు. ఆ తరువాత 2019 విజయం కూడా గొప్పదే. ఈ రెండు విజయాలు నరేంద్రమోదీని ఒక ప్రత్యేక శక్తిగా మలచాయి. కూటమి భాగస్వామ్యపక్షాలు ఏ ఒత్తిడులూ పెట్టలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ, పరిపాలనా అవసరాలు, వ్యక్తిగత ప్రతిష్ఠను నిలుపుకోవడానికి పెంపొందించుకోవడానికి అనుసరించే మార్గాలు- కొన్ని పరిమితులను పెడతాయి. తిరుగులేని ఆధిక్యం అన్నది ప్రజాస్వామికమయిన ఒత్తిడులను కూడా సహించలేనంత అతిశయాన్ని ఇస్తుంది. ఆర్ఎస్ఎస్ అండదండలతోనే ఈ స్థాయికి ఎదిగినప్పటికీ, ఇకపై ఆ మద్దతు లేకుండా కూడా నిలబడగలననే వాస్తవం తెలిసివచ్చి, సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. అత్యంత బలశాలి ప్రభుత్వానికి ప్రతిపక్షం నుంచి ఎటువంటి నిరసనా వ్యక్తం కానటువంటి దశలో లోపలి నుంచే చిచ్చు పుట్టడం సహజం. అందులో భాగంగా, నేనా, నువ్వా- ఏది ప్రాథమికమైనది అన్న చర్చ కూడా మొదలవుతుంది. 


తల్లి సంస్థ, బిడ్డ సంస్థ సంబంధాలు ఏమిటో వారిని తేల్చుకోనివ్వవచ్చు. కానీ, ఇప్పడు నరేంద్రమోదీకి, ఆయన ప్రభుత్వానికీ అప్రదిష్ఠ కలిగించిన అంశాలు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్తిగా ఉన్న సమయంలో రూపొందినవే. మోదీ వ్యక్తిపూజకు, అసాధారణ అధికార కేంద్రంగా ఆయన రూపొందడానికి సహకరించింది మాతృసంస్థయే. తాను నిలబెట్టిన వ్యక్తి, తన నిర్దేశాలను అమలుపరచే క్రమంలో, ప్రతిష్ఠ కోల్పోయేసరికి అతన్ని ‘వేడి బంగాళాదుంప’ లాగా జారవిడవడం న్యాయమేనా? నిజానికి ఒక జనాకర్షక నాయకుడిగా తన కాళ్ల మీద తాను నిలబడగలిగే నాయకుడైతే, ప్రజలకు అప్రియమైన పనులు చేయవలసిన అవసరం మోదీకి ఉండేది కాదు. స్వయంశక్తిని పొందాక కూడా మునుపటి వలె విధేయుడిగా ఉండాలనడం సబబు కాదు. ఈ ఊహాజనిత ప్రశ్నలను పక్కన పెడితే, ఇప్పుడున్న స్థితిలో, మోదీని, ఆర్ఎస్ఎస్‌ను విడదీసి ఆలోచించడం ఉచితమేనా? సంఘపరివార్‌ను ఎంతో తీవ్రంగా వ్యతిరేకించే రచయిత్రి అరుంధతీరాయ్, మోదీ దిగిపోయి, అదే పార్టీనుంచి మరెవరైనా, సంఘ్ ఎంపిక చేసిన వ్యక్తి అయినా సరే, అధికారాన్ని చేపట్టాలని కోరడం ఆశ్చర్యం కలిగించింది. సంఘ్ కటాక్షం లేని మోదీ మెరుగుగా ఉంటారా? సంఘ్ ఇష్టపడే మరొక వ్యక్తి మెరుగుగా ఉంటారా?


తిరుగులేని శక్తిగా పరిగణిస్తున్న వ్యక్తికి సొంత శిబిరం నుంచే విమర్శ వచ్చినప్పుడు, ఇక ఆ వ్యక్తి అవరోహణం మొదలైందన్న కృత్రిమ సంతృప్తి కలుగుతుంది. అతన్నొకడిని తొలగిస్తే చాలు అని జాతీయప్రతిపక్ష పార్టీ కూడా భావిస్తుంది. అతన్ని ప్రధానిని చేసిన సంస్థే తమను కూడా ప్రధానిని చేయవచ్చును కదా అన్న ఆశ కూడా ప్రతిపక్ష నేతలకు కలిగినా ఆశ్చర్యం లేదు.

Updated Date - 2021-05-21T06:16:21+05:30 IST