భక్త జనసంద్రం.. యాదాద్రి క్షేత్రం!

ABN , First Publish Date - 2021-12-06T08:03:15+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తజనుల కోలాహలం నెలకొంది.

భక్త జనసంద్రం.. యాదాద్రి క్షేత్రం!

  • ధర్మ దర్శనాలకు 3,  ప్రత్యేక దర్శనాలకు 2 గంటలు 
  • కార్తికంలో పెరిగిన భక్తుల తాకిడి.. 
  • గతం కంటే పెరిగిన ఆదాయం.. ఈసారి 7.35 కోట్లు 

యాదాద్రి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. సెలవు రోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దేవదేవుడి ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు 2గంటల పాటు నిరీక్షించామని భక్తులు తెలిపారు. కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు, నిత్యపూజా కైంకర్యాలు ఆగమశాస్త్రరీతిలో వైభవంగా జరిగాయి. వేకువజామున స్వామివారికి అభిషేకం, అర్చనలు, ఉత్సవ మండపంలో హోమ పూజలు, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం అలంకార సేవలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. అదేవిధంగా పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామికి భక్తుల నుంచి ఆదివారం రూ. 22,69,332 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.కాగా, ఈ ఏడాది కార్తిక మాసంలో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. 2019లో కార్తిక మాసంలో స్వామివారికి రూ.5,49,51,571 ఆదాయం సమకూరగా, 2020లో రూ.5,74,44,817లు, ఈ ఏడాది 7,35,10,307లు వచ్చాయి. స్వామివారి ఆదాయం గతం కంటే ఈసారి రూ.1.60కోట్లు పెరిగింది. స్వామివారి సన్నిధిలో కార్తిక మాసంలో 2019లో 18,277 మంది దంపతులు సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించగా, 2020లో 15,788 వ్రతాలు, ప్రస్తుత ఏడాది 19,204 వ్రతాలు జరిగాయి.

Updated Date - 2021-12-06T08:03:15+05:30 IST