Abn logo
Oct 21 2020 @ 03:24AM

భారత్ దర్పణం బిహార్!

నేర చరితులు రాజకీయ నాయకులతో మిలాఖత్ కావడం, కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టడం, అభివృద్ధి ప్రాజెక్టులు అవినీతికి ఆలవాలం కావడం బిహార్‌లో సర్వ సాధారణం. ఈ విషమ పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో లేకపోవచ్చు కానీ అవి ఏదో ఒక రూపంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయనేది ఒక వాస్తవం. దేశ రాజకీయాలలో నేరగాళ్ళకు ప్రమేయం లేకుండా చేయడం, అవినీతి వ్యవస్థలో వేళ్లూనుకోకుండా చేయగలగడం అంత సులభమేనా? కాదని చెప్పేందుకు బిహార్ పరిస్థితులే నిదర్శనం.


ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు అత్యంత ముఖ్యమైన సాధనం ఎన్నికలు. అయితే ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయాన్ని నిజంగా ప్రతిబింబిస్తున్నాయా? ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే శక్తులేవైనా ఉన్నాయా? ఈ అంశాలపై ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శించుకోవడం పరిపాటి. ఎన్నికలు జరుగుతాయి. అధికార మార్పిడి చోటు చేసుకుంటుంది. మరి ప్రజల జీవన స్థితిగతులో? మారవు. 


2005 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వరదలకు శాశ్వత పరిష్కారాన్ని సాధిస్తానని నితీశ్ కుమార్ అన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 15 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ పాలనతో తన 15 ఏళ్ల పాలనను పోల్చి చూడాలని నితీశ్ పదే పదే అంటున్నారు. అయితే రెండు నెలల క్రితమే బిహార్‌లో అత్యధిక భాగం వరదల్లో మునిగిపోయిందన్న విషయాన్ని ఆయన మరిచిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో దాదాపు 1333 పంచాయతీలు నీటమునిగాయి. అనేక ప్రాంతాల్లో గంగానది ప్రమాద సూచిక దాటి ప్రవహించడంతో దాదాపు కోటిన్నర మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. పాట్నా నగరమూ సగం నీట మునిగింది. బిహార్‌లో వానలతో పాటు వరదలు ప్రతి ఏడాదీ సంభవిస్తూనే ఉంటాయి. దేశంలో వరదలకు గురయ్యే జనాభాలో 22 శాతం బిహార్‌లో ఉన్నారు. అలాగే దేశంలో వరదలకు గురయ్యే ప్రాంతాల్లో 17 శాతం బిహార్‌లోనే ఉన్నాయి. ప్రతి ఏటా వందల సంఖ్యలో జనం, పశు గణం మృత్యువాత పడుతుండగా భారీఎత్తున పంటనష్టం జరుగుతూనే ఉంటుంది. బిహార్ ఆర్థిక పరిస్థితిపై ఈ వరదల ప్రభావం ప్రతి ఏటా తీవ్రంగా ఉంటుంది. అయినా బిహార్ పాలకులు నదులకు అడ్డంగా కొత్త కరకట్టల్ని నిర్మించడం, పాత కరకట్టలకు మరమ్మతులు చేయడం తప్ప మరేమీ చేయలేదు.


వరదలు ప్రకృతి వైపరీత్యాలే. కాని వరద నివారణ, సహాయక చర్యలు మాత్రం మనిషి చేతుల్లో ఉంటాయి. విచిత్రమేమంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కరకట్టల వల్ల నదులు తమ సహజ మార్గాన్ని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయి. ఫలితంగా బిహార్‌లో వరదలకు గురయ్యే ప్రాంతాలు దాదాపు మూడు రెట్లు పెరుగుతున్నాయని అనేక అధ్యయనాలు ధ్రువీకరించాయి. అయినప్పటికీ 1950లనుంచీ అంతర్జాతీయంగా ఆచరిస్తున్న ఉత్తమ పద్దతుల గురించి అధ్యయనం చేయకుండా కరకట్టల పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ కరకట్టల నిర్మాణం రాజకీయనాయకులు- నేరచరితులు కుమ్మక్కు కావడానికి తోడ్పడుతుంది మరి. వరద నివారణ కోసం కేటాయించిన భారీ మొత్తాలు నేతలు, నేరస్థుల పాలు కావడం, కరకట్టలకు ఉపయోగించాల్సిన ఇటుకలుసైతం వారి ఇళ్ల నిర్మాణానికి అక్రమంగా తరలించడం జరుగుతోంది. కనీసం వంద సంవత్సరాలుగా భాగల్పూర్- పాట్నాల మధ్య కొనసాగుతున్న అరటి తోటల సాగును నిలిపివేసి వెదురు చెట్లను పెంచాలని నిపుణులు చేసిన సూచనను నేతలు పెడచెవిన పెట్టారు. అదేమంటే వరదలను అరికట్టేందుకు నేపాల్ సహకరించడం లేదని ఆరోపిస్తుంటారు! 


ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరదలకు గురైన ప్రాంతాల్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు ప్రత్యేక విమానం నుంచి సందర్శించారు. రాష్ట్రానికి రూ. 500 కోట్ల సహాయాన్ని, మరణించిన వారికి నష్టపరిహారాన్ని ప్రకటించారు. బిహార్ వరదలను శాశ్వతంగా నియంత్రించేందుకు మోదీ సైతం ఎలాంటి వినూత్న చర్యల్ని ప్రతిపాదించలేదు. ఇలా ప్రతి ఏడాదీ కేంద్రం ఎన్ని కోట్లు బీహార్కు సహాయంగా ప్రకటించిందో, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ఎంత ఖర్చు పెట్టిందో, వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు ప్రపంచ బ్యాంకు అందించిన రూ.2500 కోట్లతో సహా లెక్క తీస్తే ఆ వేలాది కోట్లలో ఎంత జనానికి చేరుతుందో, ఎంత నేతలు, అధికారులు స్వాహా చేశారో, కరకట్టల నిర్మాణంలో ఎంత అవినీతి జరిగిందో ఒక అంచనాకు రావచ్చు. ప్రజలు నష్టపరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతుండగానే మరోసారి వరదలు వస్తూంటాయి. ఇలా ఏటా సంభవించే వరదలు రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు, నేరచరితుల బొక్కసాలను ఎలా నింపుతాయో, ఆందులో ఎంత డబ్బు ఎన్నికల్లో ప్రవహిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. 


‘సహాయ, సంక్షేమ చర్యలు అనేవి ఒక పరిశ్రమ లాంటివ’ని గ్రామీణ వ్యవహారాల నిపుణుడు, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ‘ఈ దేశంలో కరువు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు రావడం కొందరికి పండగ లాంటిద’ని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. బిహార్ వరద నివారణ చర్యలకు సంబంధించి విధానాలను రూపొందించే అధికారులు రాజకీయనాయకుల అభీష్టాలకు అనుగుణంగా తమ ప్రతిపాదనలు చేస్తుంటారు. ఉదాహరణకు 2005లో పాట్నా జిల్లా కలెక్టర్ గౌతమ్ గోస్వామితో సహా 11 మంది ప్రభుత్వ, బ్యాంకు అధికారులు కొన్ని వందల కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలకు గురయ్యారు. అంతకు ముందు సంవత్సరమే ఈ గోస్వామి మహాశయుడు, ఒక ఎన్నికల సభలో మాట్లాడుతున్న బీజేపీ నేత ఆడ్వాణీకి సమయం ముగిసిపోయిందని గుర్తు చేసి నిబంధనలకు కట్టుబడే అధికారిగా వార్తలకు ఎక్కారు. 2006లో ఈ అధికారే వరద నిధులను మళ్లిస్తూ దొరికిపోయారు! బిహార్‌లో అవినీతి గురించి కాగ్, పబ్లిక్ అకౌంట్ కమిటీలు వేలెత్తి చూపుతూనే ఉంటాయి. అవి పత్రికల్లో ఒక రోజు వార్తలకు తప్ప ఎందుకూ పనికిరావు.


మన దేశంలో అవినీతి, నేరతత్వం ఎంత దట్టంగా రాజకీయ వ్యవస్థలో భాగమయ్యాయో చెప్పడానికి బిహార్‌లో ప్రతి ఏడాది జరిగే వరదలే నిదర్శనం. ప్రధాని మోదీ సైతం బిహార్ వరకు వచ్చే సరికి అవినీతి గురించి పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే బిహార్‌లో భారతీయ జనతా పార్టీ అయినా, మరే పార్టీ అయినా నేరచరితులను, అవినీతిపరులను ప్రోత్సహించకపోతే ఎన్నికల్లో విజయం సాధించలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు అనేకమంది నేరచరితులకు, మాఫియా డాన్ లకు టిక్కెట్లు ఇచ్చాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రకటించింది. ప్రస్తుత అసెంబ్లీలో సగానికి పైగా ఎమ్మెల్యేలు నేరచరితులేనని తేల్చింది. నేరచరితుల వివరాలను బహిరంగంగా మీడియాలో ప్రకటించాలని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను, తమ అభ్యర్థుల నేర నేపథ్యాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నీరుకార్చే పథకంలో భాగంగా నేరచరితులకు బదులు వారి భార్యలకు టిక్కెట్లు ఇచ్చే సంస్కృతికి భారతీయ జనతా పార్టీ కూడా తెర లేపింది. భార్యలు గెలిస్తే అసలు అధికారం నేరచరితులే చలాయిస్తారన్న విషయం ఎవరికీ తెలియనిది కాదు. ఉదాహరణకు 2004 జూలైలో నవాడాలో పదిమందిని ఊచకోత కోసిన అఖిలేశ్ సింగ్ భార్య అరుణా దేవికి అదే నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి టిక్కెట్ ఇచ్చింది. అఖిలేశ్ సింగ్పై హత్య, దోపిడీకి సంబంధించి 27 కేసులున్నాయి. అగ్రవర్ణాల వారికే బీజేపీ ఎక్కువ సీట్లు కేటాయించింది. ఈ జాతీయ పార్టీకి, రణబీర్ సేనకూ మధ్య సంబంధాల గురించి గతంలో అరోపణలు వచ్చాయి. హత్యకు గురైన రణబీర్ సేన నేత, అనేకమంది దళితులను ఊచకోత కోసిన బ్రహ్మేశ్వర్ సింగ్ ను అమరవీరుడని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్వయంగా అభివర్ణించడం విస్మరించదగిన పరిణామం కాదు. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకునే నితీశ్ కుమార్ పార్టీ జనతాదళ్ (యు) కూడా అనేకమంది నేర చరితులకు టిక్కెట్లు ఇచ్చింది. ఉదాహరణకు ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ లో 34 మంది మైనర్ బాలికలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులో నిందితురాలైన మంజు వర్మకు జనతాదళ్ (యు) సీటు ఇచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి నితీశ్ కుమార్ కు అధికారం మారినా బీహార్‌లో నేరాలు ఆగిపోలేదని, పాట్నాలో పట్టపగలే బ్యాంకులు, వ్యాపార సంస్థల దోపిడీలు జరుగుతున్నాయని రికార్డులు చెబుతున్నాయి. దేశంలో జరిగిన హత్యల సంఖ్యను బట్టి చూస్తే ఉత్తర ప్రదేశ్, బీహార్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. బీహార్ లో మద్య నిషేధం అమలు చేసిన తర్వాత అక్కడ నేరాల శాతం మరింత పెరిగిందని సర్వేలు ప్రకటించాయి. 


నేర చరితులు రాజకీయ నాయకులతో మిలాఖత్ కావడం, కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టడం,  అభివృద్ధి ప్రాజెక్టులు అవినీతికి ఆలవాలం కావడం బిహార్‌లో సర్వ సాధారణం. ఈ విషమ పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో లేకపోవచ్చు కానీ అవి ఏదో ఒక రూపంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయనేది ఒక వాస్తవం. నేరచరితులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడమే కాదు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు కూడా కాగలుగుతున్నారు. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సమర్పించిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా దాదాపు 4500 మంది ప్రజాప్రతినిధులపై క్రింది కోర్టుల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏడాదిలోపు ఈ కేసులను విచారించి తేల్చాలని సుప్రీంకోర్టు భావించడం మంచి పరిణామమే. అయితే కాని దేశ రాజకీయాలలో నేరగాళ్ళకు ప్రమేయం లేకుండా చేయడం, అవినీతి వ్యవస్థలో వేళ్లూనుకోకుండా చేయగలగడం అంత సులభమేనా? కాదని చెప్పేందుకు బిహార్ పరిస్థితులే నిదర్శనం. 

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)