Advertisement
Advertisement
Abn logo
Advertisement

కష్టకాలంలో... భారత్ ఫోర్జ్ స్టాక్‌

ముంబై : భారత్ ఫోర్జప్ స్టాక్‌ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. నవంబరులోని అత్యధిక స్థాయి నుంచి దాదాపు 16 శాతం క్షీణించింది. నియర్‌టర్మ్‌లో, కంపెనీ అమ్మకాలు బలహీనంగా కనిపించడమే ఇందుకు కారణం. ట్రక్ సెగ్మెంట్‌, ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) సెగ్మెంట్‌లో సరఫరా గొలుసులో ఇబ్బందులు, ముడి చమురు ధరల్లో తగ్గుదల తదితర కారణాలు మరికొంత కాలం పాటు ఈ స్టాక్‌పై ఒత్తిడిని పెట్టే సూచనలున్నాయని మార్కెట్ విశ్లేషఫకులు భావిస్తున్నారు.


ఉత్తర అమెరికా మార్కెట్‌లో తగ్గిన భారీ ట్రక్కుల అమ్మకాలు కూడా ఒక ప్రతికూలాంశమే. సంవత్సరం ప్రాతిపదికన పోలిస్తే... వరుసగా మూడో నెలలోనూ క్లాస్‌-8 ట్రక్కుల ఆర్డర్లు క్షీణించాయి. నవంబరులో, ట్రక్ ఆర్డర్లు 9,500 యూనిట్లు కాగా, ఇది వార్షిక ప్రాతిపదికన 82 శాతం, నెలవారీగా చూస్తే... అక్టోబరు కంటే 41 శాతం తగ్గుదల. గత ఏడేళ్ల నవంబరు నెలల్లో... ఈ నెలలో వచ్చినవే అత్యల్ప ఆర్డర్లు. సరఫరాల్లో ఇబ్బందులు, ప్రత్యేకించి... సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఆర్డర్లు తగ్గాయి తప్ప... డిమాండ్‌ లేక కాదని విశ్లేషకులు పేర్కొంటుండడం గమనార్హం. ఉత్తర అమెరికా, యూరప్‌లలోని పలు ప్రాంతాల్లో... వచ్చే ఏడాదిలో హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ 16 శాతం పెరగవచ్చని ఎంకే రీసెర్చ్ భావిస్తోంది. పెండింగ్‌ ఆర్డర్లు తగ్గడంతోపాటు, సరకు రవాణాలో లాభాలు సెగ్మెంట్‌ వృద్ధికి దారి తీస్తాయని భావిస్తోంది. ఎగుమతుల మార్కెట్లలో ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ, దేశీయ మార్కెట్‌లో పునరుద్ధరణ కనిపిస్తోందని నొమురా రీసెర్చ్ చెబుతోంది. టాటా మోటార్స్‌ రేట్ల పెంపు, ట్రక్ ఆపరేటర్ ప్రాఫిటబిలిటీ ఇండికేటర్‌లో గణనీయమైన మెరుగుదల, పెరిగిన రవాణా ఛార్జీలను తమ నివేదికకు ప్రాతిపదికగా చూపిస్తోంది. భారత్ ఫోర్జ్‌కు ఈ పరిస్థితి అనుకూలమని పేర్కొంది.


అలాగే... లోయర్‌ ఛానెల్ ఇన్వెంటరీ, హెల్దీ ఆర్డర్ బుక్, ఆర్థిక పునరుద్ధరణ అంచనాల మధ్య ప్రయాణికుల వాహనాల అమ్మకాలు కూడా పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఇండస్ట్రియల్‌ సెగ్మెంట్‌లో.. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే తక్కువకు పడిపోయినప్పటికీ, ఇప్పటికీ మంచి పొజిషన్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం బ్రెంట్‌ ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి, బ్యారెల్‌కు 75 డాలర్ల వద్ద ఉన్నాయి. ఇది, కంపెనీ ఇండస్ట్రియల్‌ సెగ్మెంట్‌కు సానుకూలాంశం. ఈ క్రమంలో... పెరుగుదలకు అవకాశం కనిపిస్తోంది.


గత నెల రోజులుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ స్టాక్... ఈ రోజు పచ్చరంగులో కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 2.24 శాతం పెరిగి, రూ. 712.25 వద్ద ఉంది. భారత్ ఫోర్జ్‌లో షార్ట్‌టర్మ్‌ స్టోరీ బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, మీడియం టర్మ్‌ బలంగానే ఉంది. ఈ స్టాక్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, రికవరీ కనిపించేంత వరకు ఎదురు చూడడం సముచితమని   విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Advertisement
Advertisement