పని బారెడు.. జీతం బెత్తెడు!

ABN , First Publish Date - 2021-05-17T06:01:53+05:30 IST

కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికుల జీవితాలకు భద్రత అంతంత మాత్రమేనని చెప్పాలి.

పని బారెడు.. జీతం బెత్తెడు!

కరోనా కష్టకాలంలో పెరిగిన పని 

ప్రతిరోజూ డ్రెయినేజీ పూడిక, బ్లీచింగ్‌, ద్రావణం పిచికారీ వంటి పనులు 

మైలవరం నియోజకవర్గంలో600 మందికిపైగా పారిశుధ్య కార్మికులు 

బీమా కింద రూ.50 లక్షలివ్వాలని కార్మిక సంఘాల డిమాండ్‌  

జి.కొండూరు, మే 16: కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికుల జీవితాలకు భద్రత అంతంత మాత్రమేనని చెప్పాలి. ఒకపక్క కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న వేళ పట్టణం, గ్రామ అని తేడా లేకుండా పారిశుధ్య మెరుగుదల పనులు పెరిగాయి. అందుకనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్య మాత్రం పెరగలేదు. ఉన్న కార్మికులపైనే రెట్టింపు పని భారం పడింది. కానీ జీతాలు మాత్రం పెరగలేదు. కరోనా బారిన పడే ప్రమాదం కార్మికులకు పొంచి ఉంది. కరోనా పాజిటివ్‌ సోకిన వ్యక్తులు ఉన్న వీధుల్లో మరణించిన వారి ఇళ్లకు వెళ్లి శానిటేషన్‌ చేయాల్సి వస్తున్నా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. సరైన జాగ్రత్త చర్యలు తీసుకొని వీధుల్లో బ్లీచింగ్‌ చల్లడం, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయడంతో పాటు డ్రెయినేజీలు శుభ్రం చేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రమాదకరమైన కరోనా వైరస్‌ మురుగులో జీవించే ఉంటుందని, ముగురు నుంచి కూడా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కార్మికుల భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి సారించి వారికి అవసరమైన గ్లౌజులు, మాస్క్‌లు, బూట్లు, శానిటైజర్లు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  చాటా చోట్ల అవి అరకొరగానే లభిస్తున్నాయి.  మైలవరం నియోజకవర్గంలో మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌ మండలాలు ఉన్నాయి. కొండపల్లి గ్రేడ్‌ - 3 మున్సిపాలిటీ కూడా ఉంది. నియోజకవర్గం మొత్తం మీద సుమారు 600 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా నిత్యం పారిశుధ్య కార్యక్రమాల్లో ఉన్నారు.  కరోనా కష్టకాలంలో ప్రజలంతా సురక్షితంగా ఇళ్లలో ఉంటే వీరు మాత్రం బయటకు వచ్చి అనునిత్యం వీధులను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. చెత్త సేకరణ చేస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే కరోనా ప్రబలే అవకాశాలు ఎక్కువుగానే ఉంటాయి. కనుక ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని, వారికి బీమా వర్తింపజేసి కుటుంబాలకు ఆధారం చూపాలని పలువురు కార్మికులు కోరుతున్నారు.         

 జీవిత బీమా రూ.50 లక్షలివ్వాలి 

 పారిశుధ్య కార్మికులకు రూ.50 లక్షల బీమా వర్తింపజేయాలి. కరోనా కష్టకాలంలో వారికి ప్రత్యేక అలవెన్సులు కల్పించాలి. ఎప్పటికప్పుడు మాస్క్‌లు, హ్యాండ్‌ గ్లౌజులు, శానిటైజర్లు అందించాలి. కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబంలోని వ్యక్తులను వారి స్థానంలో పనిలోకి తీసుకోవాలి. ఒకవేళ పాజిటివ్‌ వచ్చి క్వారంటైన్‌లో ఉంటే ఒక నెల జీతం కట్‌ చేయకుండా ఇవ్వాలి. 

- కొంక బాలకృష్ణ,

సీఐటీయు జి.కొండూరు మండల కార్యదర్శి 



Updated Date - 2021-05-17T06:01:53+05:30 IST