స్వల్ప ఊరట

ABN , First Publish Date - 2021-12-11T06:01:25+05:30 IST

ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ మూడేళ్ళ తరువాత జైలునుంచి బయటకు వచ్చారు. భీమా కోరేగావ్ కేసులో బాంబే హైకోర్టు ఆమెకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే...

స్వల్ప ఊరట

ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ మూడేళ్ళ తరువాత జైలునుంచి బయటకు వచ్చారు. భీమా కోరేగావ్ కేసులో బాంబే హైకోర్టు ఆమెకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. డిఫాల్ట్ బెయిల్‌కు తాను అర్హురాలినంటూ దాఖలు చేసిన ఆమె పిటిషన్‌ను హైకోర్టు సమర్థించి, ఎన్ఐఏ ప్రత్యేకకోర్టును మిగతా అంశాలు నిర్థారించి ప్రక్రియ పూర్తిచేయాల్సిందిగా ఆదేశించడంతో ఆమె ముంబై జైలునుంచి గురువారం మధ్యాహ్నం బయటకు వచ్చారు. గతంలో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లు పలుమార్లు విచారణకు వచ్చినా అంగీకరించని న్యాయస్థానాలు ఇప్పుడు ప్రధానంగా సాంకేతిక కారణాల రీత్యా ఈ అవకాశం ఇచ్చాయి.


సుధా భరద్వాజ్‌కు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదంటూ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బలంగానే పోరాడింది. బాంబే హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. కేసు నమోదైన తొంభైరోజుల్లోగా కోర్టులో దర్యాప్తు సంస్థ చార్జిషీటు దాఖలు చేయాలనీ, అలా చేయనిపక్షంలో మూడునెలలకు మించి నిందితుడిని అదుపులో ఉంచుకోవడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. ఇది జరగని పక్షంలో నిందితులకు డిఫాల్ట్ బెయిల్ పొందే అర్హత దానంతటదే లభిస్తుంది. బాంబే హైకోర్టు సుధాభరద్వాజ్‌కు ఈ అర్హత ఉన్నదని తేల్చి, వరవరరావు సహా మరో ఏడుగురికి మాత్రం ఇదే సాంకేతిక కారణాన్ని వర్తింపచేసేందుకు నిరాకరించింది.


ఏవో సాంకేతిక కారణాలు ఆమెను బయటకు తెచ్చాయి కానీ, ఏ ఏల్గార్ పరిషత్ కేసులోనైతే ఆమె అరెస్టయిందో దాని విచారణ ఇంకా ఆరంభం కాకుండానే ఆమె జీవితంలో మూడేళ్ళు జైల్లోనే గడిచిపోయింది. ఈ కేసులో మిగతావారు కూడా విచారణ ఆరంభమయ్యే సూచనలు ఇంకా కనిపించకముందే రెండునుంచి మూడేళ్ళ జైలుజీవితాన్ని పూర్తిచేసేశారు. కానీ, బెయిల్‌ను అడ్డుకొనే విషయంలో మాత్రం ఎన్ ఐఏ వేగం ఆశ్చర్యం కలిగిస్తుంది. బాంబే హైకోర్టు సుధాభరద్వాజ్ డిఫాల్ట్ బెయల్ అర్హతను సమర్థించిన మర్నాడే ఈ దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టుకు పరుగుతీసింది. ‘బెయిల్ సాధారణం, జైలు అసాధారణం’ అనే న్యాయసూత్రాన్ని తిరగరాసేందుకు ఎంత ఉత్సాహమో. 


ఇక, ఆమె కస్టడీ పెంపు ఆదేశాలు జారీచేసిన న్యాయస్థానానికి ఈ కేసులో జోక్యం చేసుకొనే అర్హతలేదని బాంబే హైకోర్టు సైతం గుర్తించింది. తనకు సంబంధించిన చార్జిషీటును చట్టం నిర్దేశించిన 90రోజుల గడువుదాటించి 2019 ఫిబ్రవరి 21న దాఖలు చేశారన్నది సుధాభరద్వాజ్ వాదన. ఇది మిగతావారికి కూడా వర్తించేదే. సరైన గడువు, అర్హతలున్న న్యాయస్థానం అన్నది వాదనలకు ప్రాతిపదిక. పూణే హైకోర్టుకు చార్జిషీటు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా అధికారం లేదని వీరంతా అంటున్నారు. కానీ, ఒకే కేసులో అవే ఆరోపణలు, అవే వాదనలు సాగినప్పటికీ ఒకరికి మాత్రమే న్యాయస్థానం బెయిల్ ఇచ్చి మిగతావారిని అర్హులు కాదన్నది. డిఫాల్ట్ బెయిల్ దరఖాస్తు పెట్టుకోవడంలో జరిగిన జాప్యం ఇందుకు ఏకైక కారణం.


ఎల్గార్ పరిషత్ కేసులో నిందితులను ఎంత కాలమైనా జైల్లోనే ఉంచి, ఏ విచారణా లేకుండానే శిక్షించాలని ప్రభుత్వం అనుకుంటున్నది. నిందితుల తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య కూడా వారికి బెయిల్ దక్కనివ్వకుండా ఎన్ఐఏ తీవ్రపోరాటం చేస్తున్నది. ఈ కరోనాకాలంలో జైళ్ళలో హెచ్చిన కేసులు కూడా మనసు కరిగించడం లేదు. ఎనిమిదిపదులు దాటిన వయసులో జైలు నిర్బంధంలో ఉండగా కరోనా బారిన పడి స్టాన్ స్వామి మొన్న జులైలో మరణించిన విషయం తెలిసిందే. ఇదే బాంబే హైకోర్టులో  ఆయన బెయిల్ పై వాదనలు సాగుతున్నదశలో ఈ మరణవార్తను ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలియచేశారు. న్యాయమూర్తులు తీవ్ర దిగ్భ్రాంతిని వెలిబుచ్చి, ఆత్మశాంతి కాంక్షించారు. ఊపా ఎంతటి అమానవీయమైనదో న్యాయస్థానాలకు తెలియనిదేమీ కాదు. ఎల్గార్ పరిషత్ కేసులో ఇప్పటికైనా న్యాయస్థానాలు నిందితులపట్ల సానుకూల వైఖరి తీసుకొని అందరికీ తక్షణమే బెయిల్ మంజూరు చేయడం ఉత్తమం.

Updated Date - 2021-12-11T06:01:25+05:30 IST