భీమాకోరేగావ్‌.. ఓ ప్రహసనం?

ABN , First Publish Date - 2020-09-17T06:34:09+05:30 IST

బరామత్‌ కోసం పోలీసులు వెళ్లారు. ‘దొంగ’ అని తాము అనేసుకొన్న వ్యక్తి ఇంటి తలుపు తట్టారు. ఆయన ఇంట్లోని వస్తువులను కొట్టుకుపోయి...

భీమాకోరేగావ్‌.. ఓ ప్రహసనం?

బరామత్‌ కోసం పోలీసులు వెళ్లారు. ‘దొంగ’ అని తాము అనేసుకొన్న వ్యక్తి ఇంటి తలుపు తట్టారు. ఆయన ఇంట్లోని వస్తువులను కొట్టుకుపోయి (బరామత్‌ చేసి) కేసు కట్టారు. ఆ వస్తువులను ఈఎంఐలో తీసుకొని కిస్తీలు కడుతున్న ఆయన కుటుంబం.. పోలీసుల చర్యతో హాహాకారాలు చేసింది. ప్రజాస్వామ్య ప్రభువును ఖూని చేయ కుతంత్రీంచారంటూ పెట్టిన భీమాకోరేగావ్‌ కేసులో కూడా పోలీసులు ఇలాగే వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ఈ కేసు కట్టిన రెండేళ్ల తర్వాతా తొలగిపోవడం లేదు. ఒక ఇంటి నుంచి నల్లకోటు, మరో ఇంటి నుంచి డ్రాయింగ్‌ షీట్లు, ఇంకో ఇంటికెళ్లి పత్రికలకు పంపడానికి సిద్ధం చేసిన వ్యాసం, మరింకొక ఫ్లాట్‌కెళ్లి పిల్లలు ఆడుకొంటూ పీకేసిన ముసలి తాత మీసపు వెంట్రుకలను బరామత్‌ చేసి.. వారందరినీ అరెస్టులు చేశారు. కేసు కట్టినవాళ్లు.. చార్జిషీట్‌ వేసి, సాక్షులను పిలిపించి, కేసును నడిపించాలి కదా! తాము 300కుపైగా సీట్లు ఇచ్చి ఈ దేశమంత విశాలమైన వేదిక కట్టి, దానిపై సీటేసి కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య ప్రభువును చంపాలనుకొన్నవారి ఉద్దేశ్యాలను తెలుసుకోవాలని జనానికీ ఉంటుంది కదా! అది తెలియాలంటే కేసు తేలాలి కదా! కానీ, ఈ రెండేళ్లలో పోలీసులు ఒకేమాటపై కట్టుగా ఉన్నారు. బరామత్‌ చేసిన వస్తువులను పరిశీలిస్తున్నాం.. విశ్లేషిస్తున్నాం.. డీకోడ్‌ చేస్తున్నాం.! నిందితులు అడిగినా, జనం అభ్యర్థించినా, చివరకు బాబ్బాబూ అంటూ కోర్టే గడ్డం పుచ్చుకొన్నా అదే జవాబు! కట్టిన కేసును ఎటునుంచి కొట్టుకురావాలనే కంక్లూజన్‌కు పోలీసులు ఇంకా రాలేదులా ఉంది. ఒక్కొక్క ఇంట రెండు, మూడు సార్లు బరామత్‌ చేశారు గానీ  లాజిక్‌కు అందే ఒక్క పనిముట్టూ దొరకలేదు. బరామత్‌ చేసిన సరుకులో దమ్మే లేదని ప్రజాస్వామ్య ప్రభువర్గాలే అనుకొంటున్నాయట! అందులో రష్యా రైఫిళ్లు లేవు.. అమెరికా ఫాల్కన్‌లు లేవు.. ఫ్రాన్స్‌ రాఫెల్స్‌ లేవని పెదవి విరుస్తున్నాయట! అప్పటికీ పోలీసులు తమ దర్యాప్తులో ‘కదలిక’ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. డీకోడింగ్‌లో అమెరికా ఎఫ్‌బీఐ సహకారం తీసుకొంటున్నాం..ఫేస్‌బుక్‌ను కాంటాక్టు చేస్తున్నామంటూ.. అంటూనే రెండేళ్లు గడిపేశారు. ఇక ముందు ఎలా నెట్టుకొస్తారో! 


భీమాకోరేగావ్‌ కేసులో జాప్యంపై ఇదొక వాదనగా కనిపిస్తుండగా, మరో వాదన కూడా వినవస్తోంది. ఈ కేసులో అరెస్టుచేసిన వాళ్లు చిన్నాచితక మనుషులు కాదు. ఉస్కో అంటే జడుచుకోడానికి వాళ్లేమీ జర్మనీ ప్రభువు ఫ్రాంజ్‌ వాన్‌ పాపేన్‌లు కాదు. చడ్డీలేసుకొని హిట్లర్‌ మరో పదిమంది వెళ్లగానే పారుబోతు పాపేన్‌ అధికార దండం ఇచ్చేశాడు. మొదటి ప్రపంచయుద్ధంలో చితికిపోయి, కనిపిస్తే ప్రభువును చితగ్గొట్టేద్దాం అన్నట్టు జనం కసి మీద అప్పుడు ఉన్నారు. ఆ సమయంలో చడ్డీల్లేకుండా వెళ్లినా పాపేన్‌ సగంవంగి పూర్తిగా అధికారం వదిలేసుకొనేవాడే! వీళ్లు అలాంటివాళ్లు కాదు. సమాజంలో ప్రతిష్ఠ ఉన్నవాళ్లు! జనం కష్టాలు ఆర్చి, తీర్చలేకపోయినా వారి వెంటే ఉన్నవాళ్లు. కుట్రలకు, ఖూనీలకు భీమాకోరేగావ్‌లో ప్లాన్‌ చేసింది ఈ మనుషులంటే నమ్మడం, నమ్మించడం రెండూ కష్టమే! అయినా, ఈ కష్టమయిన పనినే పోలీసుల నెత్తికి ఎత్తారు. ఈ విషయంలో వారి ‘కష్టం’ ఫలిస్తేనే కేసూ కదులుతుంది. ఇది ముందుగా బోధపడింది కోర్టులకే కాబోలు. అందుకనే బెయిల్‌ అడిగితే గీతసూక్తి, పెరోల్‌ కోరితే వేదాంత గుళిక, కేసు తేల్చమంటే ద ఖర్మ థీరీ వల్లె వేస్తుంటాయి. ప్రజాస్వామ్య ప్రభువుకు ఎంత అసహ్యమైనా చైనావాడి సామెతే ఈ సిట్యూయేషన్‌కు సరిపోతుంది! ‘చంపేముందు అది పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి’ అని చైనావాళ్లు నమ్ముతారు. లేకపోతే చచ్చిన ‘కుక్క’కు సానుభూతి పెరిగిపోతుంది. దాన్ని చంపినా కలిగే ప్రయోజనమూ, వచ్చే నష్టమూ ఏమీ ఉండవు! ఆయాసం, నీరసం, పైగా ప్రజాస్వామ్య ప్రభువు ఆగ్రహం తప్ప!

రివేరా

Updated Date - 2020-09-17T06:34:09+05:30 IST