భూం..ఫట్‌

ABN , First Publish Date - 2020-09-27T08:06:46+05:30 IST

అంగుళం భూమిని వదులుకోవడానికీ ఏ ఒక్కరూ ఇష్టపడరు. భూమినే ప్రాణంగా భావిస్తారు. అలాంటిది ఒక్క గ్రామంలోనే భూవిస్తీర్ణాల్లో భారీ తేడాలు తెరపైకి వచ్చాయి...

భూం..ఫట్‌

  • రీసర్వే తర్వాత విస్తీర్ణాల్లో భారీ తేడాలు
  • ఎకరాలకు ఎకరాల భూములు మాయం

  • కృష్ణాజిల్లా తక్కెళ్లపాడులో తలనొప్పులు
  • భూ వివాదాల పరిష్కారానికే రీసర్వే
  • భిన్నంగా మరిన్ని వివాదాలు తెరపైకి
  • 182 సర్వేనంబర్లలో పక్కాగా 11 మాత్రమే
  • స్వాధీనం, అనుభవంలో ఉన్న భూముల్ని
  • కూడా కలిపేసి సర్వే చేసిన అధికారులు
  • అడంగల్‌ రికార్డుతో సరిపోలని ఫలితం
  • ఊళ్లలో కక్షలు, కార్పణ్యాలకు మళ్లీ ఆజ్యం!

అంగుళం భూమిని వదులుకోవడానికీ ఏ ఒక్కరూ ఇష్టపడరు. భూమినే ప్రాణంగా భావిస్తారు. అలాంటిది ఒక్క గ్రామంలోనే భూవిస్తీర్ణాల్లో భారీ తేడాలు తెరపైకి వచ్చాయి. భూవివాదాలను పరిష్కరించేందుకు చేపట్టిన తాజా రీ సర్వే తర్వాత ఇవి బయటపడ్డాయి. ఎకరాలకు ఎకరాలే ఈ సర్వేలో మాయం కావడం రైతాంగాన్ని కలవరపెడుతోంది!


(అమరావ తి-ఆంధ్రజ్యోతి)

అది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ఓ చిన్న గ్రామం. పేరు తక్కెళ్లపాడు. 182 సర్వే నంబర్లలో 1573 ఎకరాల భూమి ఉంది. అందులో 1156.11 ఎకరాలు ప్రైవేటు భూమి. ఇందులో 11 సర్వే నంబర్లలో ఎలాంటి వివాదమూ లేదు. మిగిలిన 171 సర్వేనంబర్లలోని భూమి విస్తీర్ణం, సరిహద్దులు, ఇతర అంశాల్లో మాత్రం వివాదాలు వెలుగుచూశాయి. సర్వేశాఖ చేపట్టిన రీ సర్వే పైలెట్‌ ప్రాజెక్టుతో ఆ వివాదాలు మరింత పతాకస్థాయికి చేరాయి. ఒకరి ఖాతాలో ఎక్కువ భూమి, మరొకరి ఖాతాలో తక్కువ భూమి ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఒరిజినల్‌ అడంగల్‌ ప్రకారం సర్వేచేస్తే ఓ లెక్క. దానితోపాటు స్వాధీనం, రికార్డులేకుండా అనుభవంలో ఉన్న భూమిని కూడా సర్వేచేయడంతో అడంగల్‌తో ఏమాత్రం సరిపోలని విస్తీర్ణం బయటకొచ్చింది. ఎక్కువ భూమి వచ్చిన వారిలో ఆనందం...ఉన్నభూమిని కోల్పోయిన వారిలో తీవ్రమైన ఆందోళన, ఆవేదన. ఇదీ తక్కెళ్లపాడు గ్రామంలోని తాజా పరిస్థితి. సర్వేచేయడం వరకే తమ  పని అని, సరిహద్దులు, సబ్‌డివిజన్‌లు, కొలతలు మార్చే పనులు తాము చేయమని అధికారులు చెబుతుండటంతో రైతుల్లో తీవ్రమైన అలజడి రాజుకుంటోంది.


రాష్ట్రంలో భూముల సమగ్ర పున:సర్వే చేపట్టాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తక్కెళ్లపాడు గ్రామంలో కార్స్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభించారు. గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత అనేక ఆటంకాలు, సమస్యల మధ్య రీసర్వే కొన సాగింది. క్షేత్రస్థాయి పరిశీలన ముగిసినా ఇంకా డాక్యుమెంటేషన్‌ వర్క్‌ పూర్తికాలేదు. రీ సర్వే ఫలితాలను ప్రభుత్వం దృష్టికి రెవెన్యూశాఖ నివేదిక రూపంలో తీసుకెళ్లింది. ఈ నివేదికను పరిశీలిస్తే మొత్తం సర్వే నంబర్లలో కేవలం 11 మాత్రమే పక్కాగా ఉన్నాయి. మొత్తం సర్వేనంబర్లలో ఇది 6.04 శాతం. వీటిలో భూమి విస్తీర్ణం, సరిహద్దులు, ఇతర అంశాల్లో ఎలాంటి తేడాలు లేవు. ఒరిజినల్‌ రికార్డులతో సరిపోలాయి. మిగిలిన 171 సర్వే నంబర్లలోని భూమిపైనే సకల సమస్యలు తెరమీదకొచ్చాయి. అయితే, ఇవేవి అంతకుముందున్న వివాదాలు కావని, రీ సర్వే తర్వాతే వెలుగుచూశాయని రైతులు చెబుతున్నారు. 


87 ఏళ్ల తరువాత...

1932లో దేశం అంతా రీసర్వే జరిగింది. కృష్ణాజిల్లా తక్కెళ్లపాడు గ్రామంలోనూ అప్పట్లో ఈ ప్రక్రియ చేపట్టారు. అప్పటి ఆర్‌ఎ్‌సఆర్‌ ప్రకారం ఈ గ్రామంలో భూ విస్తీర్ణం 1539 ఎకరాలు. అడంగల్‌ ప్రకారం 1573 ఎకరాలని తాజాగా గత డిసెంబరులో జరిపిన రీసర్వేలో తేలినట్టు చెబుతున్నారు. భూమి చిత్రపటాల ( ఎఫ్‌ఎమ్‌బీ) ఆధారంగా 182 సర్వేనంబర్లలో ఈ విస్తీర్ణం ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 272.52 ఎకరాలు, అటవీ భూమి 144.63 ఎకరాలు కాగా, మిగిలిన 1156.11 ఎకరాలు ప్రైవేటు భూమి. సర్వే అధికారులు ఈ భూములపై రీ సర్వే చేపట్టగా కొత్త అంశాలు వెలుగుచూశాయి. వివాదంగా గుర్తించిన 171 సర్వే నంబర్ల పరిధిలో పరిశీలించగా, ఒరిజినల్‌ అడంగల్‌ ప్రకారం 43 సర్వేనంబర్లలో ఉండాల్సిన భూమి కన్నా తక్కువగా చూపించారు. మరో 128 సర్వే నంబర్లలో ఉండాల్సిన దానికన్నా అదనపు భూమిని  చూపించారు. 


ఎకరాలకు ఎకరాలు మాయం

రీ సర్వే ఫలితాలను విశ్లేషించగా, పలు సర్వే నంబర్లలో ఎకరాలకు ఎకరాల భూమి మాయం అయింది. ఒకే సర్వేనంబర్‌లో ఒకరి పేరిట ఉన్న భూమిని మరొకరి పేరిట ఉన్నట్లు చూపించారు. ఇలా 120కిపైగా సర్వేనంబర్లలోని భూమి విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయి. కొందరికి ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా, మరి కొందరికి ఉన్న భూమిని తగ్గించి చూపించారన్న ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రెవెన్యూశాఖ రూపొందించిన నివేదిక కూడా ఈ తేడాలను ప్రస్ఫుటంగా చూపిస్తోంది. గరిష్ఠంగా తేడా వచ్చిన భూమి విస్తీర్ణం 2.10 ఎకరాలు. ఇది కూడా ఆ నివేదికలోనే ఉంది.  


మొత్తం సర్వే నంబర్లు : 182

విస్తీర్ణంలో వివాదం  లేనివి : 11 

2 శాతం కన్నా తక్కువ వివాదం ఉన్నవి : 118

2-5 శాతం వివాదం ఉన్నవి : 33

5 శాతంపైనే వివాదం ఉన్నవి : 20


లోపం ఎక్కడ? 

భూ వివాదాలను పరిష్కరించడం రీ సర్వే ముఖ్య ఉద్దేశం. అయితే తాజాగా జరిగిన రీ సర్వే ఉన్న సమస్యలను తీర్చకపోగా, మరిన్ని వివాదాలను తెరపైకి తెచ్చింది. అనేక కొత్త కోణాలు, అధికారుల స్థాయిలో తీవ్రమైన తప్పిదాలు, నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం పాత ఆర్‌ఎ్‌సఆర్‌ రికార్డు, ఒరిజినల్‌ అడంగల్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ రీ సర్వేలో అధికారులు సొంత భాష్యాలు పాటించారని తెలిసింది. వ్యక్తుల ఆధీనం, కబ్జాలో ఉన్న భూమిని కూడా కలిపి రీ సర్వే చేశారని తెలిసింది. ఎలాంటి రికార్డు లేకున్నా అనుభవంలో ఉన్న భూమిని కూడా కలిపి రీ సర్వేచేసి.. వారి సర్వే నంబర్‌లోనే దానిని కలపడం వల్ల భూ విస్తీర్ణంలో భారీ తేడాలు వచ్చినట్లుగా ఉన్నతాఽధికార వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల కొందరి ఖాతాలో అధిక భూమి వస్తే, మరి కొందరికి ఉన్నభూమినీ తగ్గించేశారని తెలిసింది. ఇది తెలిసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. రీసర్వేలో భాగంగా వివాదాలు వస్తే సమస్యను పరిష్కరించేందుకు అప్పీల్‌ విధానం ఏర్పాటు చేశారు. సర్వే, సరిహద్దు చట్టంలోని సెక్షన్‌ 9(2) కింద పలువురికి నోటీసులు జారీ చేశారు. ఉన్న భూమిని కోల్పోయిన రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రీ సర్వే పుణ్యమా అని ఉ న్నదానికంటే ఎక్కువ భూమిని పొందిన కొందరు తెగ ఆనందపడిపోతున్నారు. నోటీసులకు కూడా వారు స్పందించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నదానిపైనే రీ సర్వే భవితవ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-09-27T08:06:46+05:30 IST