Abn logo
Oct 15 2021 @ 01:27AM

మహాగౌరిగా భ్రమరాంబ

కర్నూలు(అర్బన్‌), అక్టోబరు 14: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైలంలో భ్రమరాంబదేవి మహాగౌరిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. నవదుర్గలలో ఎనిమిదో రూపమైన మహాగౌరికి గురువారం ఉదయం ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టానాలు, పారాయణాలు, చండీహోమం, పంచాక్షరీ, చండీపారాయణం, కుమారి పూజలు నిర్వహించారు. స్వామికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, రుద్రపారాయణాలు చేశారు. రాత్రి 9 గంటల నుంచి కాళరాత్రి పూజ, అమ్మవారి అస్థాన సేవ జరిపించారు. మహాగౌరిని పూజించడం వల్ల సకల పాపాలు నశిస్తాయని, కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఉత్సవమూర్తులను నందివాహనంపై ఆశీనులను చేసి ఊరేగించారు. 


శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌


  1.  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
  2.  ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ 


శ్రీశైలం ఆలయం అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేశామని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆలయాల ఆస్తులను అక్రమించాలని చూసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మతం, ఆలయాలను అడ్డుపెట్టుకుని నారా లోకేష్‌ రాజకీయాలు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


మహానందిలో..


  1.  రావణవాహనంపై మహాగౌరిదుర్గ


మహానంది, అక్టోబరు 14: మహానందిలో గురువారం మహాగౌరి దుర్గ అలంకారంతో కామేశ్వరిదేవిని అర్చకులు అలంకరించారు. రాత్రి 7గంటల నుంచి అమ్మవారికి సహాస్రదీపాలంకరణ సేవ జరిపారు. రాత్రి 9 నుంచి మహాగౌరిదుర్గను రావణవాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో మల్లికార్జునప్రసాద్‌, భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయదశమి పురస్కరించుకుని శుక్రవారం శమీపూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్ళపల్లి అర్జునశర్మ తెలిపారు.