ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి అఖిలప్రియ

ABN , First Publish Date - 2020-06-05T20:09:21+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్తతో కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నారని...

ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి అఖిలప్రియ

కర్నూలు: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్తతో కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి చేసిన ఆరోపణలపై అఖిలప్రియ స్పందించారు. అఖిల ప్రియను అరెస్టు చేయాలన్న ఏవీ సుబ్బారెడ్డి మాటల వెనుక ఉన్న ఉద్దేశం 

ఏంటో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.


ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణల వెనక ఆళ్లగడ్డ అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండొచ్చని కానీ వైసీపీ ప్రమేయం ఉండక పోవచ్చని అఖిలప్రియ చెప్పారు. అఖిల ప్రియ భర్త భార్గవరామ్ తనను బెదిరిస్తున్నాడని గతేడాది అక్టోబర్‌లో ఓ క్రషర్ ఇండస్ట్రీ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తన భర్తకు బెయిల్ కోసం అప్లై చేశామని, పక్కదారి పట్టించేందుకు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అఖిలప్రియ చెప్పారు. ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ 4 ముద్దాయిగా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, ఇంకా విచారణ పూర్తి కాలేదని.. తమ హస్తం ఉన్నట్లు బయటకు రాలేదని ఆమె తెలిపారు. విచారణ కొనసాగుతున్న తరుణంలో అఖిల ప్రియను అరెస్టు చేయాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 


భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు ఏవీ సుబ్బారెడ్డి పేరుతో ఉంటే అవి ఏవీ కుటుంబానికే చెందుతాయని.. ఆస్తి గొడవలు లేవని ఏవీ సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్పాడని అఖిలప్రియ గుర్తుచేశారు. ఏవీ సుబ్బారెడ్డికి పదవులు ఇస్తే తాను అడ్డుకోలేదని ఆమె చెప్పారు. ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డలో రాజకీయాలు చేయొద్దని చెప్పలేదని, ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో రాజకీయాలు చేస్తానంటే స్వాగతిస్తానని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు ఎలా పనులు చేయిస్తాడో చూడాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు.


అసలేం జరిగింది..?

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నుతుండగా కడప పోలీసులు భగ్నం చేశారు. సుపారీ తీసుకున్న ముగ్గురిని కడపలో చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు. కడప డీఎస్పీ కార్యాలయంలో శనివారం డీఎస్పీ సూర్యనారాయణ, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు రోషన్‌, సత్యనారాయణతో కలిసి వివరాలను వెళ్లడించారు. కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోమల గ్రామానికి చెందిన సూడో నక్సలైట్‌ సంధ్యపాకుల ఫక్కీర్‌ అలియాస్‌ సంజురెడ్డి అలియాస్‌ మున్నా అలియాస్‌ ప్రతాప్‌ ప్రస్తుతం తాడిపత్రి టౌన్‌లో నివాసం ఉంటున్నాడు.


కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లె  శివాలయం వీధికి చెందిన గంగాదాసరి రవిచంద్రారెడ్డి, ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంటకు చెందిన కొందూరు రామిరెడ్డి ఆలియాస్‌ రాముడు పలు నేరాల్లో నిందితులు. హైదరాబాద్‌లో నివాసముంటున్న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు ఫక్కీర్‌ కొందరు ప్రముఖ రాజకీయ నేతల వద్ద రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదట రూ.15లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. సుబ్బారెడ్డిని చంపేందుకు మార్చి 12న తెల్లవారుజామున 3గంటలకు ఫక్కీర్‌ ఒంటరిగా వెళ్లాడు. అదే సమయంలో హైదరాబాద్‌ నైట్‌ పెట్రోలింగ్‌ పోలీసులు తిరుగుతుండడంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాడు.


ఒంటరిగా హత్య చేయలేనని భావించి గంగాదాసరి రవిచంద్రారెడ్డి, కుందూరు రామిరెడ్డిలను కడప అశోక్‌నగర్‌ పాతబైపాస్‌ వద్దకు పిలిపించుకున్నాడు. వీరు ముగ్గురూ కలిసి సుబ్బారెడ్డిని 21వతేదీ రాత్రి హైదరాబాద్‌లో హత్య చేయాలని పథకం రచించారు. ఈ క్రమంలో నిందితులను చిన్నచౌకు పోలీసులు అదుపులోకి తనిఖీ చేయగా వారివద్ద కంట్రీమేడ్‌ పిస్టల్‌, ఒక మ్యాగజైన్‌, ఆరు తూటాలు దొరికాయి. వీటితో పాటు రూ.3.20 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఫక్కీర్‌ తప్పుడు ఆధార్‌కార్డు, పాన్‌కార్డులను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ హత్యకు ఎవరు కుట్ర పన్నారన్నదీ పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం.


ఏవీ సుబ్బారెడ్డి తాజా ఆరోపణలేంటి..?

మాజీమంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ నేత ఏవీ.సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భర్త భార్గవ రాముడితో కలిసి భూమా అఖిలప్రియ తనను చంపేందుకు కుట్ర పన్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. గురువారం నాడు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు.


కడప పోలీసులకు కృతజ్ఞతలు..

‘రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్ సంజోరెడ్డితో అఖిలప్రియ 50లక్షలకు సుఫారీ కుదుర్చుకున్నారు. మహిళ ముసుగులో అఖిలప్రియ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారు. కుట్రను భగ్నం చేసి నన్ను కాపాడిన కడప పోలీసులకు కృతజ్ఞతలు. భూమా అఖిలప్రియ అనుచరుడు మాదా శ్రీను డబ్బులు ఇచ్చాడని నిందితులు చెప్పారు. నా ముగ్గురు కూతుళ్లతో సమానంగా అఖిలప్రియను ప్రేమగా చూసుకున్నాను. రాజకీయ కుట్రతోనే అఖిలప్రియ నా హత్యకు ప్రణాళిక రచించారు. మా పార్టీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాను.తక్షణమే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడిని అరెస్ట్ చేయాలి’ అని ఏవీ సుబ్బారెడ్డి ఏబీఎన్ చానెల్ ద్వారా డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-05T20:09:21+05:30 IST