ఆళ్లగడ్డలో ఉన్నది రౌడీయిజం

ABN , First Publish Date - 2020-02-07T17:29:18+05:30 IST

‘‘శోభ నాకు భార్య, స్నేహితురాలి కన్నా ఎక్కువ. ఆమె లేని లోటు భయంకరంగా ఉంది. వికలాంగుణ్ణి అయిపోయాను. బాధ్యతలు ఇంకా..

ఆళ్లగడ్డలో ఉన్నది రౌడీయిజం

గ్రామాల్లోనే ఫ్యాక్షనిజం

శోభ నాకు స్నేహితురాలి కన్నా ఎక్కువ

ఆమె లేకుంటే పరిటాల రవికీ, చంద్రబాబుకు మాటలుండేవి కావు

ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కేలో భూమా నాగిరెడ్డి


‘‘శోభ నాకు భార్య, స్నేహితురాలి కన్నా ఎక్కువ. ఆమె లేని లోటు భయంకరంగా ఉంది. వికలాంగుణ్ణి అయిపోయాను. బాధ్యతలు ఇంకా పెరిగాయి. ఆళ్లగడ్డలో ఫ్యాక్షనిజం కన్నా రౌడీయిజం ఎక్కువగా ఉంది. ఫ్యాక్షనిజం ఎక్కువగా గ్రామాల్లోనే ఉండేది. వైఎస్‌ చనిపోయే దాకా జగన్‌ను కలవనే లేదు’’ అంటున్న భూమా నాగిరెడ్డి.. ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన అంతరంగాన్ని పంచుకున్నారు. 25-8-14న ఏబీఎన్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..


శోభగారి జ్ఞాపకాలనుంచి బయటపడ్డారా?

ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉన్నాను. ఎందుకంటే ఆమె స్నేహితురాలి కన్నా ఎక్కువ.


మీది ప్రేమ పెళ్లా? మీకు మేనత్త కూతురే కదా? ఇంట్లో చెప్పకుండా చేసుకున్నట్లున్నారు?

బాధ్యతలతో కూడిన ప్రేమ వివాహం. మా నాన్నకు మామకు మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. చదువుకునే రోజుల్లో ఫ్యాక్షన్‌ ప్రభావం నా పైన పడింది. అప్పుడే ఓ మంచి నిర్ణయం తీసుకున్నాం. మాది జాయింట్‌ ఫ్యామిలీ. దానికనువుగా ఉండే అయి అయితే బాగుంటుందని భావించాను. ఇద్దరం ఆలోచించుకుని ఎవరు కాదన్నా ఒక్కటయ్యాం.


మీకు అన్నీ విషాదాలే కదా! మీ నాన్నగారిని చంపేశారు. గుండెపోటుతో వీరశేఖరరెడ్డి చనిపోయారు. ఆ తర్వాత శోభమ్మ.. ఇదంతా ఎలా అనిపించింది?

ఫ్యాక్షనిజం తనతోనే అంతరించి పోవాలనేది మా నాన్న అభిలాష. గ్రామల్లో వర్గాలు ఏర్పడేవి. ఒక పంచాయితీకి సంబంధించిన తీర్పు వారు ఒకలా ఇస్తే.. ఇది ఇలా ఉంటే బాగుంటుందని మరో వర్గం చెప్పేది. ‘నీకు ఆస్తులే కాదు.. వర్గాలు కూడా ఇచ్చిపోతున్నా.. వాటిని కూడా బాగా చూసుకోవాలి’ అని మా నాన్న చెప్పేవారు. వాళ్లకేం వచ్చినా మేం దగ్గర ఉండి చూసుకోవాలి. ఈ వర్గాల్లో కులం ఉండదు. మా అన్న ఉన్నప్పుడు.. గడ్డం చేసుకుంటూ పంచాయితీలు చేసేవారు. బెడ్‌రూంలో కూర్చుని పంచాయితీలు చేసేవారు. అక్కడ భయం కాదు ప్రేమాభిమానాలుండేవి. అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఆళ్లగడ్డ నియోకవర్గం చాలా బెటర్‌ అని చెప్పొచ్చు.


కర్నూలు, కడప, అనంతపురం ఈ మూడు జిల్లాల్లో ఫ్యాక్షనిజం ఉండేది. అది లేకుండా రాజకీయంగా ఎదగడానికి వీలుండేది కాదా?

అది ఎక్కువగా గ్రామాల్లో ఉండేది. ఏ రాజకీయ నాయకుడు కూడా ఫ్యాక్షన్‌ నేపథ్యం నుంచి రాలేదు. నాన్న చనిపోవడం.. అన్నలు చిన్న వయసులోనే చనిపోవడం.. రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయి.


ఓ దశలో మీపై రౌడీషీటు తెరిచారు కదా?

అలాంటిదేమీ లేదు. నేను కాలేజీ నుంచి ఎదుగుతున్న దశలో.. ప్రత్యర్థులు తప్పుడు కేసులు పెట్టారు. 


ఇన్నేళ్ల ఈ ఫ్యాక్షన్‌ ప్రయాణంలో ఎప్పు డూ భయమనిపించలేదా?

భయమంటే తెలియని వయసు నుంచే దీంట్లోకి వచ్చాను. శోభ ఎప్పుడూ అడుగుతూ ఉం డేది. ‘నువ్వు ఎలా ఇంత ధైర్యంగా ఉంటున్నావు’ అని.


రాజకీయాల్లో లాలూచీలు ఎక్కువయ్యాయి! మరి మీ కుటుంబం..గంగుల కుటుంబం కూ ర్చుని మాట్లాడుకోవచ్చు కదా?

మాది వేరు.ఇప్పుడు మీరు నాకు నచ్చారనుకోండి.. మీ ప్రత్యర్థులను కూడా నా ప్రత్యర్థులుగా భావిస్తాను. అప్పట్లో టీడీపీలో ఉన్నాను. చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో వైఎస్‌ని పలకరించేవాణ్ణే కాదు.


మరి పీఆర్పీలోకి మారారు కదా?

చంద్రబాబుకి చాలా లాయల్‌గా ఉండేవాణ్ణి. విపరీతంగా నమ్మేవారిని ఆయనఎందుకు నమ్మరో అర్థం కాదు. ‘నేను బయటికి వెళ్లిపోతే నీలాంటి నాయకుణ్ణి నేను తయారుచేసుకోగలను అని చెప్పాను. నాలాంటి శిష్యుణ్ని మాత్రం నువ్వెప్పుడూ తయారుచేసుకోలేవన్నా’



చివరిలో శోభకు ప్రాధాన్యం ఎక్కువిచ్చారు?

ఆయన ఎందుకో సిన్సియర్‌గా, కాస్త కఠినంగా ఉండే నాయకత్వాన్ని నమ్మరు. పరిటాల రవి విషయంలో కూడా అలాగే వ్యవహరించేవారు. అప్పుడు చంద్రబాబుకి,రవికి చాలా గ్యాప్‌ వచ్చింది. అప్పుడు. పరిటాల ‘అన్నా శోభమ్మ లేకపోయుంటే ఇవ్వాళ.. నాకు చంద్రబాబుకి ఇంకా మాటలుండేవి కాదు’ అని నాతో అనేవారు. చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం. టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ , చంద్రబాబు, దగ్గుబాటి ఈ ముగ్గురే మాకు హీరోలు.

 

అంతేకాదు, చివరిదాకా బాబు నాకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఓ ఘటన జరిగింది. అందరూ బి.వి. మోహనరెడ్డి అని సలహా ఇవ్వడంతో మేమూ ఆయ న పేరునే ప్రతిపాదించాం. కానీ, చంద్రబా బు..శోభను, తమ్మినేని సీతారాంను పిలిపించి ‘నాగిరెడ్డిని ఒప్పించం’డని చెప్పారు. శోభ చెప్పడంతో ఒప్పుకున్నాను. కానీ, అక్కడ కూర్చున్నానో లేదో.. ఆయన..కె.ఇ.కృష్ణమూర్తి ఒప్పుకోవడం లేదన్నారు. ‘ఇదేంటన్నా నేను అసలు కావాలని కూడా కోరుకోలేదు. ఇప్పుడు కె.ఇ.కృష్ణమూర్తి ఒప్పుకోవడం లేదం టూ చెప్పడం దారుణ’మన్నాను. అదే టైంలో చిరంజీవి ఫోన్‌ చేయడంతో పీఆర్‌పీలోకి వెళ్లాం.


ఆయనా మీరు కోవర్టులని అన్నారెందుకు?

చిరంజీవికి రాజకీయాలేమీ తెలియదు. అది మేం వెళ్లాక తెలిసింది. ఆయనకు సీరియస్‌నెస్‌ లేకపోవడంతో కాంగ్రెస్‌తో విలీనం అయితే బాగుంటుందని చెప్పాను. అంతదాకా వైఎస్‌తో మాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన చనిపోయిన తర్వాతే జగన్‌ని చూశాను. ఆ తర్వాత మెల్లగా జగన్‌ వెంట నడిచాం.


వైసీపీకి విపరీతమైన హైప్‌ వచ్చింది. కానీ చివరి మూడు నెలల్లో పోయింది. ఎందుకు?

హామీలపై జగన్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ‘రుణమాఫీని లక్ష వరకైనా ప్రకటించండి’ అని నేను, శోభ చెప్పాం. చివరి నిమిషం వరకూ ఫోన్లో శోభ చెప్పింది. ‘అది సాధ్యం కాదు.ఒక్కసారి హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే భవిష్యత్తులో దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది’ అని జగన్‌ అన్నారు.


డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారని ప్రచారం జరిగింది?

అలా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. డబ్బు విషయం ఎప్పుడూ జగన్‌ దగ్గర ప్రస్తావన రాలేదు. నేను దగ్గర్నుంచి చూశాను. ఆయన ఓ డిఫరెంట్‌ రాజకీయ నాయకుడు.


మనుషులకు గౌరవం ఇవ్వడని, ఓ అపరిచితుడని, చాలా మంది అన్నారు?

అది మీడియా ప్రచారమే. ఎవర్నైనా అన్నా అని పలకరిస్తారు. నేను రోజూ వెళ్తాను. మరి పలకరించాల్సిన అవసరమేంటి?


అయితే ఇపుడు వైసీపీలో ఉన్న 60 మం దిలో ఎంతమంది మిగులుతారో ఎవరికీ తెలియని సందిగ్ధత ఉంది కదా?

వైఎస్‌ ఉన్నప్పుడు..టీఆర్‌ఎస్‌, పీఆర్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతారని వార్తలొచ్చాయి. ఎవరి పరిధిలో వారు దారి చూసుకుంటున్నారు.


వైసీపీకి భవిష్యత్‌ ఉంటుందని నమ్మకం ఉందా?ఆయనపై కేసులు ఉన్నాయి కదా?

ఆ కేసులు ఎంతమంది కలిస్తే వచ్చాయో మనకు తెలిసిందే. ఏ స్థాయికి తీసుకువచ్చారో క్లియర్‌గా ఉంది. చంద్రబాబుపైనా కేసులున్నాయి. అది జనాని కి తెలియదు. స్టే తెచ్చుకుని విచారణ నిలిపివేయించుకున్నాడు. భగవంతుడూ అన్యాయమే చేశాడు.


ఉప ఎన్నికలను యునానిమస్‌ చేసుకుంటే పోతుంది కదా?

రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. విలువలు పోతున్నాయి కాబట్టే.. డిమాండ్‌ పెరుగుతోందనిపిస్తోంది. దానివల్లే ఇదంతా. నాకు రాజకీయ పదవుల మీద అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఆశ ఉండబోదు. చేసే పనిలో దైవత్వం చూస్తాను.

Updated Date - 2020-02-07T17:29:18+05:30 IST