26 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చేరిన సీఎం భూపేష్ బఘెల్

ABN , First Publish Date - 2021-08-27T17:51:11+05:30 IST

ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తనకు విధేయులైన 26 మంది ఎమ్మెల్యేలతో..

26 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చేరిన సీఎం భూపేష్ బఘెల్

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభం ముదురుతోంది. ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తనకు విధేయులైన 26 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శుక్రవారం ఆయన సమావేశం కానున్నారు. ఈ వారంలో రాహుల్‌ను ఆయన కలుసుకోవడం ఇది రెండోసారి కానుంది. నాయకత్వం విషయంలో ముఖ్యమంత్రి భూపేష్‌కు, ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియోకు మధ్య జగడం మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీఎంను ఢిల్లీకి పిలిచింది. తనకు అసెంబ్లీలో తగినంత బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగానే 26 మంది ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు, ఎంపీలతో కలిసి సీఎం ఢిల్లీకి వచ్చినట్టు చెబుతున్నారు.


ఛత్తీస్‌గఢ్‌లో ఐదేళ్ల అధికారం రొటేషన పద్ధతిలో పంచుకునే అంశం చుట్టూనే అసలు వివాదం నడుస్తోంది. దీనికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని అధిష్ఠానం ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలతో కలిసి భూపేష్ బఘెల్ ఢిల్లీకి రావడంపై ఏఐసీసీ ఛత్తీస్‌గఢ్ ఇన్‌చార్జి పీఎల్ పునియా స్పందించారు. వారికి వారుగా వచ్చేరే కానీ, అధిష్ఠానం ఎవరినీ పిలవలేదని చెప్పారు. మంత్రులు శివ దహరాయ్, అమర్‌జీత్ భగత్, అనిల్ భేడియా, ఎంపీ ఛాయావర్మ, మరో 12 మందికి పైగా ఎమ్మెల్యేలు రాయపూర్‌ విమానాశ్రయం నుంచి ఛార్టెర్డ్ విమానంలో ఢిల్లీకి వచ్చారు. పార్టీ ఐక్యంగా ఉందని, పార్టీ వైఖరిలో (సీఎం మార్పు విషయం) ఎలాంటి మార్పూ లేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మోహన్ మార్కం చెప్పారు.

Updated Date - 2021-08-27T17:51:11+05:30 IST