ప్రకటనల్లో పక్షపాతం

ABN , First Publish Date - 2020-08-28T09:23:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల పేరిట భారీస్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని,

ప్రకటనల్లో  పక్షపాతం

సాక్షి పత్రిక, సాక్షి టీవీకే సింహభాగం

అర్హతలేని కొన్నిసంస్థలకు అగ్రాసనం

సర్కారు తీరుతో అర్హత సంస్థలకు నష్టం

జనం సొమ్ముతో సీఎంకు బ్రాండ్‌ ఇమేజ్‌

స్తుతిస్తున్నట్టుగా భారీ ఫొటోలతో జారీ

వైసీపీ రంగులు కనిపించేలా రూపకల్పన

హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు


అమరావతి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల పేరిట భారీస్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని, వాటి జారీలో పక్షపాత ధోరణి చూపుతోందని గురువారం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వ ప్రకటనల్లో సింహభాగం జగతి పబ్లికేషన్‌ నడుపుతున్న సాక్షి దినపత్రిక, ఇందిరా టెలివిజన్‌కి చెందిన సాక్షి టీవీకి మాత్రమే ఇస్తున్నట్టు పిటిషనర్‌ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ప్రభుత్వ చర్యలతో అర్హత ఉన్న సంస్థలు నష్టపోతుండగా, అర్హత లేని కొన్ని మీడియా సంస్థలకు భారీ లబ్ధి కలుగుతోందంటూ విజయవాడకు చెందిన కిలారు నాగశ్రవణ్‌ ఈ పిటిషన్‌ దాఖలుచేశారు.


సాక్షి పత్రికను, ఇందిరాటీవీ ద్వారా సాక్షి టీవీని నిర్వహిస్తున్న జగతి పబ్లికేషన్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత సంస్థ అనేది అందరికీ తెలిసిందే. ప్రజల సొమ్ముతో విపరీత ధోరణితో ప్రకటనలు ఇవ్వడం ద్వారా సీఎం బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  తన పిటిషన్‌లో నాగశ్రవణ్‌ పేర్కొన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి ఫొటో నిర్ణీత పరిమాణం కంటే పెద్ద పరిమాణంలో ప్రచురిస్తున్నారని, అధికార పార్టీ వైసీపీ జెండా రంగులను ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగిస్తూ ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్నారు. దీనిద్వారా రాజకీయ అబ్ధి పొందేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని  తెలిపారు. ప్రభుత్వం చూపిస్తున్న ఈ పక్షపాత వైఖరి సుప్రీకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు.


అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను ప్రభు త్వం ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ఏదైనా తప్పనిసరి ప్రభావవంతమైన సందేశం ఇవ్వదలచిన సందర్భంలోనే రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, గవర్నర్ల ఫొటోలు ప్రకటనల్లో వాడుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ గతంలో చెప్పిందని పిటిషనర్‌ తన పిటిషన్‌లో ఉటంకించారు.


ఒకే సంస్థకు జై..

అన్ని వార్తాపత్రికలకు సర్క్యులేషన్‌ ప్రకారం ప్రకటనలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ నియమాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషనర్‌ తెలిపారు. ‘‘ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ ప్రకారం జనవరి 2019 నుంచి డిసెంబరు 2019 వరకు సర్కులేషన్‌లో మొదటిస్థానంలో ఈనాడు, రెండో స్థానంలో సాక్షి, మూడో స్థానంలో ఆంధ్రజ్యోతి ఉన్నాయి. 2019 మే 23 నుంచి 2020 మే 30 వరకు వివిధ మీడియా సంస్థలకు ఇచ్చి న ప్రకటనలు, వాటి ఖర్చుల వివరాలను ఆర్‌టీఐ ద్వారా పౌరసంబంధాలు, సమాచార శాఖ నుంచి జూలై ఏడున నేను పొందాను.


అందులో 2019 మే 23 నుంచి మార్చి 2020 వరకు ఇచ్చిన ప్రకటనల ఖర్చుల వివరాలు మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో సమాచార శాఖ ఇచ్చి ప్రకటనల ఖర్చు రూ.17.5 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో సర్క్యులేషన్‌లో రెండోస్థానంలో ఉన్న సాక్షి దినపత్రికకు అర్హత లేకపోయినప్పటికీ సింహభాగం, అంటే రూ.6.5 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. అసలు సర్క్యులేషన్‌తో సంబంధం లేకుండా కొన్ని వార్తాపత్రికలకు కూడా అగ్రప్రాధాన్యం ఇచ్చారు.


ఇతర శాఖలకు సంబంధించి క్లాసిఫైడ్‌ ప్రకటనలకు మే 2019 నుంచి మార్చి 2020 వరకు రూ.82.11 కోట్లు ఖర్చుచేశారు. అందులోనూ రూ.34.92 కోట్లు కేవలం సాక్షి దినపత్రికకు ఇచ్చారు. సర్క్యులేషన్‌ పెద్దగా లేని మరికొన్ని పత్రికలకు కూడా ప్రాధాన్యం కల్పించారు. సమాచార శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్‌, మే నెలల్లో రూ.13.56 కోట్లు ప్రకటనలో కోసం ఖర్చు చే శారు.


ఇందులో అత్యధికంగా రూ.6.27 కోట్లు సాక్షి దినపత్రికకు ఇచ్చారు. ఈ సారి కూడా సర్క్యులేషన్‌ పెద్ద గా లేని పేపర్లకు ప్రాధాన్యం కల్పించారు. మిగతా ప్ర భుత్వ శాఖలు ఈ రెండు నెలల్లో రూ.13.43 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చాయి. ఇందులో రూ.4.77 కోట్ల విలువైన ప్రకటనలు సాక్షి దినపత్రికకు ఇచ్చారు’’ అని వివరించారు. 


రెండు నెలల్లో ఒక్కటీ ఇవ్వలేదు..

2020 ఏప్రిల్‌, మే నెలల్లో ప్రభుత్వానికి సంబంధించి ఒక్క ప్రకటన కూడా ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదని, సర్క్యులేషన్‌లో మూడోస్థానంలో ఉన్నప్పటికీ ఆ దినపత్రిక పట్ల ప్రభుత్వం పక్షపాత ధోరణి కనబరిచిందని పిటిషనర్‌ పేర్కొన్నా రు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం 2019 మే 23 నుంచి 2020 మే 30వ తేదీ వరకు ప్రకటనల కోసం రూ. 100.80 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రకటనల విలువ రూ.25 లక్షలు మాత్రమే. మరో వైపు సాక్షి దినపత్రికకు రూ. 52.03 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనల్లో ముఖ్యంగా సీఎం స్తుతి కనిపిస్తోంది. ఎంపిక చేసిన మీడియాకు మాత్రమే ప్రకటనలు ఇవ్వడం ద్వారా ప్రజల సొమ్ముతో సీఎంని ఒక ‘రాజకీయనాయకుడి’ స్థానం నుంచి ఒక ’బ్రాండ్‌’గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది’’ అని పిటిషనర్‌ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-08-28T09:23:09+05:30 IST