మా టార్గెట్ అదే.. దాన్ని సాధించాం: బైడెన్

ABN , First Publish Date - 2021-08-19T00:23:06+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ నుంచి తమ సేనల ఉపసంహరణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్థించుకున్నారు. అమెరికా నిర్ణయం సరైందికాదంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం ఆయన అమెరికా జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘అఫ్ఘాన్‌ నుంచి మా సైన్యాన్ని రప్పించడానికి సరైన సమయం అంటూ లేదు. రెండు దశాబ్దాల తర్వాత ఈ విషయాన్ని గ్రహించాం. ప్రస్తుతం మా ముందు రెండే మార్గాలుండేవి.

మా టార్గెట్ అదే.. దాన్ని సాధించాం: బైడెన్

అల్‌-ఖాయిదా అంతమే మా లక్ష్యం

దాన్ని సాధించాం.. సేనల్ని వెనక్కి రప్పించాం..

అఫ్ఘాన్‌ పునర్నిర్మాణం మా ధ్యేయం కాదు: బైడెన్‌

వాషింగ్టన్‌/ఐరాస/ఇస్లామాబాద్‌/మాస్కో: అఫ్ఘానిస్థాన్‌ నుంచి తమ సేనల ఉపసంహరణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్థించుకున్నారు. అమెరికా నిర్ణయం సరైందికాదంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం ఆయన అమెరికా జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘అఫ్ఘాన్‌ నుంచి మా సైన్యాన్ని రప్పించడానికి సరైన సమయం అంటూ లేదు. రెండు దశాబ్దాల తర్వాత ఈ విషయాన్ని గ్రహించాం. ప్రస్తుతం మా ముందు రెండే మార్గాలుండేవి. ఒకటి మరో దశాబ్దం పాటు మా సేనలను అక్కడే ఉంచి.. యుద్ధాన్ని కొనసాగించడం. రెండోది మా దళాలను వెనక్కి రప్పించుకోవడం. యుద్ధాన్ని కొనసాగిస్తూ పోతే.. ఎన్ని తరాలను భరించాలి? ఎన్ని తరాలను అఫ్ఘాన్‌కు పంపాలి. అందుకే.. సైనిక బలగాల ఉపసంహరన నిర్ణయం తీసుకున్నాం’’ అని వివరించారు.


ఉగ్రవాదులను నిర్మూలించడమే తమ లక్ష్యమని, 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత అల్‌-ఖాయిదానే టార్గెట్‌ అని చెప్పారు. అఫ్ఘాన్‌ జాతి నిర్మాణం కాదని తేల్చిచెప్పారు. తమ లక్ష్యం పూర్తయిందన్నారు. ‘‘అఫ్ఘాన్‌ సైనికులకు ఎంతో శిక్షణ ఇచ్చాం. 3 లక్షల మంది సైనికులకు ఆయుధాలు సమకూర్చాం. అయినా.. వారే తమ సొంత దేశంలో అంతర్యుద్ధంలో విఫలమయ్యారు. అలాంటి యుద్ధంలో పోరాడటానికి ఎన్ని తరాల పాటు అమెరికన్లను పంపమంటారు?’’ అని ప్రశ్నించారు. 


అదే సమయంలో.. అమెరికా పౌరులపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఘాటుగా హెచ్చరించారు. అఫ్ఘాన్‌ పౌరులు విమానం టైర్లపైకెక్కి దేశం వీడాలనుకునే ఆతృతతో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. అఫ్ఘాన్‌ పౌరులకు అమెరికా ఎప్పటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా.. అమెరికా నిర్ణయం పట్ల చైనా మండిపడింది. కీలక సమయంలో భయంకరమైన గజిబిజిని సృష్టించిన అమెరికా.. తనదారిన తాను వెళ్లిపోయిందని ఆరోపించింది. అఫ్ఘాన్‌ అభివృద్ధికి తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చిన్‌యింగ్‌ వెల్లడించారు. కాగా, అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని పాకిస్థాన్‌ సమర్థించింది. అఫ్ఘాన్‌ పరిణామాల నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలో జాతీయ భద్రత సంఘం(ఎన్‌ఎ్‌ససీ) సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా బైడెన్‌ నిర్ణ యం సరైనదేనని పేర్కొం ది. తాలిబన్లతో చర్చిస్తామని రష్యా తెలిపింది.  అఫ్ఘాన్‌లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా సర్కారు ఏర్పాటవ్వాలని, మహి ళలకు పెద్దపీట వేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆకాంక్షించింది. 


ప్రపంచం చొరవ చూపాలి: భారత్‌

అఫ్ఘాన్‌లో హింసను ఆపడానికి అంతర్జాతీ య సమాజం చొరవ తీసుకోవాలని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి కోరారు. మహిళలు, చిన్నారులు, మైనారిటీల అ భిప్రాయాలను గౌరవించేలా అఫ్ఘాన్‌ ప్రభుత్వం ఒక సమ్మిళిత విధానాన్ని అవలంబించాలని కోరారు. అఫ్ఘాన్‌ మళ్లీ ఉగ్రవాద సంస్థల స్వర్గధామంగా మారకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాజం కృషిచేయాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు. 



Updated Date - 2021-08-19T00:23:06+05:30 IST