మళ్లీ తప్పులో కాలేసిన జో బైడెన్..!

ABN , First Publish Date - 2020-09-21T20:42:50+05:30 IST

డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తప్పులో కాలేశారు. అధ్యక్ష పదవికి ఎన్నిక

మళ్లీ తప్పులో కాలేసిన జో బైడెన్..!

వాషింగ్టన్: డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తప్పులో కాలేశారు. అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో.. అమెరికాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య విషయంలో ఆయన పొరపాటుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వేనియా రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో.. ఆదివారం రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరోనా బారినపడి ఇప్పటి వరకు అమెరికాలో 20కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్ సర్కార్ విఫలమవ్వడంతో.. మూడింట రెండొంతుల మంది అమెరికన్లు మృత్యువాతపడ్డారని పేర్కొన్నారు.


అయితే..  అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ప్రచారంలో జో బైడెన్.. 2లక్షల మందికి బదులుగా 20కోట్ల మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డట్టు వివరించారు. ఇదిలా ఉంటే.. మాజీ ఉపాధ్యక్షుడు ఇలా తప్పులో కాలేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఇదే విషయంలో ఆయన రెండుసార్లు పొరపడ్డారు. అగ్రరాజ్యంలో 1.20లక్షల కరోనా మరణాలు నమోదైన సమయంలో.. 120 మిలియన్ల మంది కరోనా కారణంగా మరణించినట్లు తప్పుగా పేర్కొన్నారు. మిచిగాన్ రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కూడా.. ఆ రాష్ట్రంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య గురించి చెప్పబోయి.. మహమ్మారి 6వేల మంది అమెరికన్ ఆర్మీని పొట్టనబెట్టుకున్నట్టు తెలిపారు. 


Updated Date - 2020-09-21T20:42:50+05:30 IST