హెచ్4 వీసాలపై బైడెన్ కీలక నిర్ణయం.. భారతీయులకు మేలు

ABN , First Publish Date - 2021-01-27T20:57:56+05:30 IST

హెచ్1బీ వీసాదార్ల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్‌-4 వీసాల వర్క్‌ పర్మిట్ల విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

హెచ్4 వీసాలపై బైడెన్ కీలక నిర్ణయం.. భారతీయులకు మేలు

వాషింగ్టన్‌: హెచ్1బీ వీసాదార్ల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్‌-4 వీసాల వర్క్‌ పర్మిట్ల విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హెచ్-4 వీసా వర్క్ పర్మిట్లను రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ తొసిపుచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగేళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు పొందడానికి అవస్థలు పడుతున్న హెచ్1బీ వీసాదార్ల జీవిత భాగస్వాములకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇది భారతీయులకు చాలా మేలు చేయనుంది. కాగా, అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్​ సేవల శాఖ(యూఎస్​సీఐఎస్) హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, వారి 21 ఏళ్ల లోపు పిల్లలకు ఈ హెచ్‌-4వీసాలు జారీచేస్తుంది. 


ఇక హెచ్​-1బీ వీసాదారుల భాగస్వాములు యూఎస్‌లో ఉద్యోగావకాశాలు పొందేందుకు వీలుగా హెచ్​-4 వీసాలను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో హోం​శాఖ జారీ చేసింది. అయితే, 2016లో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్​ ట్రంప్​.. ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికన్ కోర్టుకు తెలిపారు. దీంతో హెచ్1బీ వీసాదార్ల జీవిత భాగస్వాములకు అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేసేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. గత నాలుగేళ్లు ఈ విషయమై హెచ్-4 వర్క్ వీసాదారులు ట్రంప్ నిర్ణయం సరియైంది కాదని తమ గళం వినిపించారు. అయినా ట్రంప్ పట్టించుకోలేదు.


ఈ క్రమంలో 2020, నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు. దాంతో గతేడాది డిసెంబర్‌లో హెచ్1బీ వీసాదార్ల జీవిత భాగస్వాముల ఉద్యోగ పర్మిట్లను పునరుద్ధరించాలని 60 మంది అమెరికా చట్టసభ సభ్యులు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు లేఖ రాశారు. ట్రంప్ అధికార యంత్రాంగం హెచ్-4 వర్క్ పర్మిట్లపై తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని వీరు తమ లేఖలో పేర్కొన్నారు. హెచ్4 వీసాలను పునరుద్ధరించాలని పేర్కొంటూ రాసిన లేఖపై ఇండో అమెరికన్ ఎంపీలు అయిన డాక్టర్ అమి బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ వంటి వారు కూడా సంతకం చేశారు. 


ఇక జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్.. తన ఏడోరోజు పాలనలో భాగంగా మంగళవారం ఈ హెచ్-4 వర్క్ వీసాదారుల సమస్యను పరిశీలించారు. ఈ విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ రద్దు చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై హెచ్​-1బీ వీసాదారుల భాగస్వాములు తీపి కబురు వినబోతున్నారని పలువురు ఇండో-అమెరికన్స్ ట్వీట్ చేశారు. 'గ్రేట్ న్యూస్! హెచ్4 ఈఏడీ కోసం ఎదురుచూస్తున్న హెచ్​-1బీ వీసాదారుల భాగస్వాముల నిరీక్షణకు త్వరలోనే తెర పడబోతుంది.' అని రాశి భట్నాంగర్ ట్వీట్ చేశారు. 'హెచ్4 ఈఏడీ హోల్డర్స్‌కు ఇవాళ ఇది పెద్ద విజయం. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హెచ్4 వీసాదారుల వర్క్ పర్మిట్లను నిలిపివేస్తూ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పోటస్ ఉపసంహరించింది. నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడింది. త్వరలోనే హెచ్​-1బీ వీసాదారుల భాగస్వాముల వర్క్ పర్మిట్లకు మార్గం సుగమమం అవుతుందని ఆశిద్దాం.' అని షర్మిస్థ మోహపాత్ర ట్వీట్ చేశారు.   

Updated Date - 2021-01-27T20:57:56+05:30 IST