బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో పది పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2020-06-07T02:09:26+05:30 IST

తెలంగాణా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి.

బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో పది పరీక్షలు వాయిదా

హైదరాబాద్ : తెలంగాణా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. శనివారం సాయంత్రం పది పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం విదితమే. జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగిలిన అన్ని చోట్లా తగు జాగ్రత్తలతో  నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పు కాపీ వచ్చాక కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది.


సీఎం ఏం తేల్చబోతున్నారు..!?

రేపు అనగా ఆదివారం నాడు పరీక్షలు నిర్వహణపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే పబ్లిక్ పరీక్షలు లేకుండా.. ప్రీ ఫైనల్‌ పరీక్షల ప్రాతిపదికగా అప్‌గ్రేడ్‌ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా గత కొన్నిరోజులుగా పది పరీక్షల నిర్వహణ సందిగ్ధత కొనసాగుతూనే వస్తోంది. సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సబితా స్పందన..

ఇదిలా ఉంటే పరీక్షల వ్యవహారంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పును అనుసరించి రాష్ట్రంలో జరిగే పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించామన్నారు. పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారా..? అనేదానిపై పరీక్షల రాయడానికి సిద్ధమైన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-06-07T02:09:26+05:30 IST