బిగ్‌ డాడీ టు గుడివాడ..!. కేసినో సూత్రధారి చీకోటి ప్రవీణ్‌...

ABN , First Publish Date - 2022-01-20T07:52:00+05:30 IST

బిగ్‌ డాడీ టు గుడివాడ..!. కేసినో సూత్రధారి చీకోటి ప్రవీణ్‌...

బిగ్‌ డాడీ టు గుడివాడ..!. కేసినో సూత్రధారి చీకోటి ప్రవీణ్‌...

 గోవా బిగ్‌ డాడీ కేసినోలో ఓ టేబుల్‌ నిర్వాహకుడు

జూదప్రియులకు ఏజెంటు కూడా..

తర్వాత దక్షిణాదిన ముఖ్య నగరాల్లో కేసినో తరహా జూదక్రీడల నిర్వహణ

మంత్రి కొడాలి నాని, వంశీతో సన్నిహిత పరిచయాలు!

దానివల్లే కేసినో బాధ్యతలు


(విజయవాడ-ఆంధ్రజ్యోతి): పోకర్‌.. అమెరికన్‌ రౌలెట్‌.. తీన్‌పత్తి.. బకారత్‌.. బ్లాక్‌ జాక్‌.. 7అప్‌ 7 డౌన్‌.. అందర్‌ బాహర్‌.. గోవా కేసినోల్లో మాత్రమే కనిపించే జూదక్రీడలివి. వీటన్నిటినీ గుడివాడ కే కన్వెన్షన్‌లో ఏర్పాటుచేసిన కేసినోలో దించేశారు. వీటి నిర్వహణ సాధారణ జూద గృహ నిర్వాహకులకు సాధ్యంకాదు. సామగ్రి ప్రత్యేకంగా ఉంటుంది. సుశిక్షితులైన సిబ్బందికి మాత్ర మే సాధ్యం. మరి గుడివాడ కే కన్వెన్షన్‌లో పక్కాగా కేసినోను తలపించేలా ఏర్పాట్లు.. జూద క్రీడలు నిర్వహించారంటే..దాని వెనుక మంచి అనుభజ్ఞుడే ఉండాలి. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీయగా చీకోటి ప్రవీణ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ మారియట్‌ హోటల్లో 2017లో జూదక్రీడలు నిర్వహించి పట్టుబడిన ప్రవీణ్‌.. ఇన్నేళ్లకు గుడివాడలో ప్రత్యక్షం కావడం విశేషం. మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో మంచి పరిచయాల కారణంగా గుడివాడ కేసినో బాధ్యతలు అతను తీసుకున్నట్లు తెలిసింది.


అంచెలంచెలుగా..!

హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ గోవాలోని బిగ్‌ డాడీ కేసినోలో అందర్‌ బాహర్‌ టేబుల్‌ను అద్దెకు తీసుకుని నిర్వహించుకునేవాడు. జూదక్రీడల నిర్వహణలో ఇతడికి మంచి పేరే ఉంది. దీనితోపాటు గోవాకు వచ్చే జూద ప్రియులను కేసినోలకు తీసుకొచ్చే ఏజెంటుగానూ పనిచేసేవాడు. ఆ పరిచయాలతో  హైదరాబాద్‌తోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో కేసినో తరహా జూద క్రీడలు నిర్వహించేవాడు. 2017 అక్టోబరు 20న హైదరాబాద్‌లోని మారియట్‌ హోట ల్లో వీటిని నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయా డు. ఆ తర్వాత అతడి పేరు పెద్దగా వినపడలేదు. తాజాగా గుడివాడ కేసినోతో మళ్లీ ప్రవీణ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ కే కన్వెన్షన్‌ మంత్రి కొడాలి నానీది. ఆయన అనుచరులు మెరుగుమాల కాళీ, పాలడుగు రాంప్రసాద్‌, మరో వ్యక్తి పేరుతో లీజుకు ఇచ్చినట్లు చూపుతున్నారు. కేవలం ఫంక్షన్ల నిర్వహణకు మాత్రమే దీనికి అనుమతులున్నాయి. జూద క్రీడల నిర్వహణకు ఎలాంటి అనుమతుల్లేవు. ప్రవీణ్‌కు గన్నవరం ఎమ్మెల్యే వంశీ, మంత్రి నానితో పరిచయాలతోపాటు కేసినో తరహా జూదక్రీడల నిర్వహణలో అనుభవం ఉండడంతో అతడిని రంగంలోకి దింపా రు.


ప్రవీణ్‌ గోవా నుంచి పోకర్‌, రౌలెట్‌ వంటి కేసినో గేమ్స్‌ నిర్వహణలో అనుభవమున్న సిబ్బందిని, సామగ్రిని తీసుకొచ్చి గుడివాడలో కేసినో సంస్కృతికి శ్రీకారం చుట్టాడు.  గోవాలో కేసినో ఎంట్రీ ఫీజు రూ.3వేల వరకు ఉంటు ంది. అందులో రూ.1,500 విలువైన కాయిన్స్‌ను గేమ్స్‌ ఆడేందుకు ఇస్తారు. గుడివాడ కేసినోలో ఎంట్రీ ఫీజు రూ.10 వేలు. ఇందులో రూ.4 వేల విలువైన కాయిన్స్‌ను గేమ్స్‌ ఆడేందుకు ఇచ్చారు. పోకర్‌ రూం.. రౌలట్‌ టేబుల్‌ వంటి వాటి వద్ద సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేశారు. గోవా కేసినోల్లో నృత్యాలు చేసే చీర్‌ గర్ల్స్‌ను తీసుకొచ్చి జూద ప్రియులకు ఆహ్లాదం పంచారు.

Updated Date - 2022-01-20T07:52:00+05:30 IST