అద్దంకిలో బిగ్‌ ఫైట్‌

ABN , First Publish Date - 2021-02-25T06:53:12+05:30 IST

రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న అద్దంకి..

అద్దంకిలో బిగ్‌ ఫైట్‌
అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు 

తొలి ఎన్నికల్లో టీడీపీకి భారీ ఆధిక్యత 

నేడు హోరాహోరీ పోరుకి సిద్ధం 

కిందిస్థాయిలో పెరిగిన ఫిరాయింపులు 

నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌, వైసీపీ ఇన్‌చార్జి కృష్ణచైతన్య


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న అద్దంకి నగరపంచాయతీలో ప్రధాన పార్టీల మధ్య హోరీహోరీ పోటీకి రంగం సిద్ధమైంది. టీడీపీ తరపున శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌, వైసీపీ తరపున ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ బాచిన కృష్ణచైతన్యలు ఈ పోరుకి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఇంకా కోర్టు తీర్పు వెల్లడికాకపోవటం, నామినేషన్ల ఉపసంహరణకు వారం రోజులు గడువున్న నేపథ్యంలోనే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికారపార్టీలోకి ఫిరాయింపుల పర్వం ప్రారంభంకావటం, వాటికి కొంతమేరకు రవికుమార్‌ బ్రేక్‌ వేయటం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గాల్లో అద్దంకి  ఒకటి. అనేక సంచలన మార్పులకు వేదికైంది. ప్రస్తుత పరిస్థితుల్లో నగరపంచాయతీ ఎన్నికలు ఇటు టీడీపీ అటు వైసీపీలకు అలాగే ఆపార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ అనూహ్య విజయాలను సాధించింది. అందులో కృష్ణచైతన్య కీలకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే రవికుమార్‌ టీడీపీ మద్దతుదారులకు అవసరమైన మేరకే సహకారాన్నిచ్చారు. ఏకగ్రీవ పంచాయతీల ఎంపికలో అద్దంకి అగ్రస్థానంలో ఉండటం కృష్ణచైతన్య రాజకీయ విలువను పెంచింది.


దీంతో నగర పంచాయతీని కూడా కైవసం చేసుకుని తన పట్టు పెంచుకోవాలని కృష్ణ చైతన్య భావించారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో అంటీముట్టనట్లు వ్యవహరించిన ఎమ్మెల్యే అద్దంకి ఎన్నికల విషయంపై నేరుగా రంగంలోకి రావటంతో వాతావరణం వేడెక్కింది. అద్దంకి నగర పంచాయతీగా 2011లో అప్‌గ్రేడ్‌ అయింది. ఈ పంచాయతీకి 2014లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో టీడీపీ బాధ్యతలను కరణం బలరాం చూస్తుండగా అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్న రవికుమార్‌ వైసీపీ బాధ్యతలు చూశారు. మొత్తం 20 వార్డుల్లో 15 వార్డులు టీడీపీ అభ్యర్థులు గెలుచుకోగా ఐదు వార్డులు మాత్రమే వైసీపీకి దక్కాయి. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బలరాం కుమారుడు వెంకటేష్‌పై  రవికుమార్‌ గెలుపొందారు. నగరపంచాయతీ ఎన్నికల్లో వచ్చిన టీడీపీ ఆధిక్యతలో 80శాతంకు సాధారణ ఎన్నికల్లో గండిపడింది. 


కీలక నేతలపై గాలం

ఈ నగర పంచాయతీలో సుమారు 29వేల ఓట్లు ఉన్నాయి. ప్రధాన రాజకీయ పెత్తనం కమ్మ సామాజికవర్గానికి చెందిన వారి చేతుల్లో ఉంది. తదనంతరం అగ్రవర్ణాలకు చెందిన వారిలో ఆర్యవైశ్యులు, కాపు సామాజికవర్గం వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎస్సీ, బీసీల ఓట్లు కూడా గణనీయంగా ఉన్నప్పటికీ బీసీలలో అధికంగా వడ్డెర్లు ఉన్నారు. వీరి మధ్యలో వివిధ తెగలకు చెందిన మైనారిటీలందరినీ కలిపితే 3500మంది ఓటర్లు ఉన్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య విజయాలతో ఉత్సాహంగా ఉన్న కృష్ణచైతన్య కమ్మ సామాజికవర్గంలోని టీడీపీ నేతలకు గాలం వేశారు. వెంటనే రవికుమార్‌ అప్రమత్తం కావటంతో ఆ విషయంలో సఫలీకృతులు కాలేకపోయారు.


నిశిరాత్రి వైసీపీ కండువా వేయించుకున్న అద్దంకి మాజీ సర్పంచ్‌, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు ఉదయానికే మనసు మార్చుకుని టీడీపీ పక్షాన నిలబడ్డారు. ఆయన సోదరుడు రమేష్‌, మాజీ ఎంపీపీ భర్త పరిటాల రామచంద్రరావుతో పాటు కిందిస్థాయిలో మరికొందరు వైసీపీలో చేరటం విశేషం. దీనికి తోడు ఆర్యవైశ్యుల్లో మద్దతు పెంచుకునేందుకు ముందు నుంచి కృష్ణచైతన్య వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ సామాజికవర్గంలో పట్టున్న కొందరు నేతలను అక్కున చేర్చుకున్నారు. ఆయన ఎత్తుగడ ఫలించి సందిరెడ్డితో పాటు మిగిలిన నాలుగు వార్డుల టీడీపీ అభ్యర్థులు కూడా వైసీపీలో చేరి ఉంటే ఏకగ్రీవ ఎంపికలతోనే వైసీపీ నగర పంచాయతీని కైవసం చేసుకునే పరిస్థితి ఉండేది. అందుకు బ్రేక్‌ పడటం, టీడీపీ పక్షాన ఎమ్మెల్యే అనుక్షణం అద్దంకిలో ఉండి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుండటంతో పోటీవాతావరణం పెరిగిపోయింది. 


ఎత్తుకు పైఎత్తులు

20 వార్డుల్లోను రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఇరువురు నాయకులు ఎవరికి వారు ప్రత్యర్థి ఓట్లని చీల్చే ఎత్తుగడను ప్రారంభించారు. ఉదాహరణకు టీడీపీకి పట్టుకొమ్మ లాంటి 3వవార్డులో ఆ పార్టీ నేత, అభ్యర్థి భర్త వైసీపీలో చేరిపోయారు. అక్కడ పెరిగిన వైసీపీ బలాన్ని దెబ్బకొట్టే విధంగా ఎమ్మెల్యే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. 7, 8 వార్డుల్లో పట్టున్న టీడీపీ నేత రామచంద్రరావుని పార్టీలో చేర్చుకోవటం ద్వారా కృష్ణచైతన్య మరో ముందడుగు వేశారు. ఇలా ఎత్తులు, పై ఎత్తులతో ఇటు రవికుమార్‌, అటు కృష్ణచైతన్యలు వ్యవహరించటమేగాక ఎన్నికల్లో సామదాన దండోపాయాల వినియోగానికి సిద్ధమయ్యారు. దీంతో ఓటు రేటు కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తుది ఫలితం ఏ పార్టీని వరిస్తుంది, ఏ నాయకుని రాజకీయ ప్రతిష్ట పెరుగుతుందనేది చూడాల్సిందే.


Updated Date - 2021-02-25T06:53:12+05:30 IST