బిగ్‌ ఐటీ టవర్‌ కథ సమాప్తం!

ABN , First Publish Date - 2021-08-24T05:49:01+05:30 IST

బిగ్‌ ఐటీ టవర్‌ కథ సమాప్తం!

బిగ్‌ ఐటీ టవర్‌ కథ సమాప్తం!

నిర్మాణ పనులు ఆపేసిన ఏస్‌ అర్బన్‌ 

వయబిలిటీ కాదని భావించే నిర్ణయం

70శాతం పూర్తయిన భవన నిర్మాణానికి బ్రేక్‌

ఐటీ కంపెనీలకు అందని రాయితీలు 

ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్న కంపెనీలు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కేసరపల్లిలోని ఏస్‌ అర్బన్‌-ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలో రెండో పెద్ద ఐటీ టవర్‌ నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది. ఈ టవర్‌ పనులను ఏస్‌ అర్బన్‌ సంస్థ ఆపేసింది. ఎట్టి పరిస్థితుల్లో దీనిని కొనసాగించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఏపీఐఐసీ అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీనిపై తమకు సమాచారం అందినట్టు చెబుతున్నారు. దాదాపు 70 శాతం మేర పనులు పూర్తయిన భవనాన్ని ఉన్నట్టుండి ఎందుకు ఆపివేయాల్సి వచ్చిందన్న దానిపై అధికారికంగా స్పష్టత లేనప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే ఈ పనులను కొనసాగించే పరిస్థితి లేనట్టుగా తెలుస్తోంది. దీంతో నిర్మాణ పనుల నుంచి కంపెనీ అర్థంతరంగా తప్పుకొన్నట్టు సమాచారం. 


టీడీపీ హయాంలో మొదలు

కేసరపల్లి ఐటీ సెజ్‌లో మేధ ఐటీ టవర్‌ తర్వాత రెండో బిగ్‌ ఐటీ టవర్‌ పనులు టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలయ్యాయి. అప్పటి ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ పనులకు భూమిపూజ చేశారు. అప్పట్లోనే దాదాపు 70శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అంగుళం కూడా పురోగతి లేదు. కరోనా మొదటి దశ అనంతర పరిస్థితుల్లో టవర్‌ పనులు పూర్తిచేసే విషయంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత పనులు పునరుద్ధరించాలని ఏస్‌ అర్బన్‌ కూడా భావించింది. తాము తిరిగి పనులు చేపడతామని ఏపీఐఐసీ బోర్డుకు కూడా తెలిపింది. ఈలోగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ఐటీ రంగం అభివృద్ధి చెందటం కోసం టీడీపీ ప్రభుత్వం పలు పరిశ్రమలకు అనేక రాయితీలను ప్రకటించింది. ఉద్యోగుల సగం జీతాలను ప్రభుత్వమే భరించేది. ఇలా మరెన్నో ఇన్సెంటివ్‌లను ఇచ్చేది. దీంతో అప్పట్లో ఐటీ పరిశ్రమలు అనేకం ఆవిర్భవించాయి. 


వైసీపీ వచ్చాక ప్రోత్సాహకాలు రద్దు

ప్రస్తుత ప్రభుత్వం ఐటీ కంపెనీలకు ఇచ్చే రాయితీలను, ప్రోత్సాహకాలను రద్దు చేసింది. దీంతో స్టార్టప్స్‌, ఇక్కడ బ్రాంచిలను ఏర్పాటుచేసిన ఐటీ సంస్థలకు వాటి నిర్వహణ ఇబ్బందికరంగా మారటంతో రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైటెక్‌ సిటీలో మొదటిదైన ‘మేధ’ టవర్‌లో చాలావరకు ఐటీ కంపెనీలు వెళ్లిపోయాయి. ఈ పరిణామాలను చూసిన ‘ఏస్‌ అర్బన్‌’ సంస్థ నిర్మాణ పనులు కొనసాగించలేమని భావించినట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన ఏస్‌ అర్బన్‌ సంస్థకు కూడా ఇలా అసంపూర్ణంగా భవనం ఉండటం నష్టదాయకమే అవుతుంది. ఈ రెండో ఐటీ టవర్‌ అందుబాటులోకి వస్తే 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభించేవి. భవనం నిర్మిస్తే ఐటీ కాకపోతే సెజ్‌ నుంచి తప్పుకొని ఇంకో ర కంగా అయినా భవనానికి ఆక్యుపెన్సీ తెచ్చుకోవచ్చు. అయితే, బిల్డింగ్‌ పనులు చేపడితే ఆర్థిక  కష్టాల్లో మరింతగా కూరుకుపోతామని   ఏస్‌ అర్బన్‌ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Updated Date - 2021-08-24T05:49:01+05:30 IST