Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న GHMC కి భారీ ఊరట.. 350 ఎకరాలు.. రూ.3,500 కోట్లు!

  • రోడ్ల విస్తరణ, ఎస్‌ఆర్‌డీపీ కోసమే
  • రూ.1700 కోట్ల మేర జీహెచ్‌ఎంసీకి ఆదా
  • ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఉపశమనంగా టీడీఆర్‌
  • 864 సర్టిఫికెట్ల జారీ

హైదరాబాద్‌ సిటీ : ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీకి అభివృద్ధి బదలాయింపు హక్కు (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌) భారీ ఉపశమనంగా మారింది. వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి ప్రాజెక్టులకు ఆస్తుల సేకరణ సులువైంది. ఇప్పటి వరకు రూ.3500 కోట్ల విలువైన 864 టీడీఆర్‌ సర్టిఫికెట్లను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. భవనాలు, ఖాళీ స్థలాలు కలిపి 350 ఎకరాల మేర స్థలాలను ఈ విధానం ద్వారా సేకరించినట్టు సంస్థ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల సంస్థకు రూ.1700 కోట్ల మేర ఆదా అయింది. కొత్త చట్టం ప్రకారం ఆస్తుల సేకరణ తలకు మించిన భారంలా మారింది. సబ్‌ రిజిస్ర్టార్‌ విలువకు రెండు, మూడు రెట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉండడం.. భవన నిర్మాణ విలువ తదితరాలతో కలిసి చెల్లించాల్సిన ఆర్ధిక భారం తడిసి మోపెడవుతోంది.

ఆదాయం పెంచుకునే క్రమంలో ప్రభుత్వాలు.. సబ్‌ రిజిస్ర్టార్‌ విలువనూ పెంచుతు న్నాయి. దీంతో ఆస్తుల సేకరణ ఆర్థిక  భారం మరింత భారంగా మారుతోంది. కొన్ని ప్రాజెక్టుల వద్ద నిర్మాణ వ్యయంతో పోలిస్తే ఆస్తుల సేకర ణకు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో టీడీఆర్‌లను తెరపైకి తీసుకొచ్చిన జీహెచ్‌ఎంసీ.. అత్యధిక సర్టిఫికెట్లు జారీ చేసింది. స్థలాలను బట్టి రెండు నుంచి నాలుగు రెట్ల వరకు అభివృద్ధి బదలాయింపు హక్కు కల్పిస్తోంది. ఈ సర్టిఫికెట్లను నిర్మాణ దారులకు విక్రయించి ఆస్తులు కోల్పోయిన వారు ఆదాయం పొందవచ్చు. సొంత నిర్మాణాల రుసుము చెల్లింపు కోసం వినియోగించుకోవచ్చు.


పరస్పర ప్రయోజనంగా..

ఆస్తుల సేకరణలో భాగంగా టీడీఆర్‌ సర్టిఫికెట్లు ఇస్తోన్న జీహెచ్‌ఎంసీ.. బాధితులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టింది. సర్టిఫికెట్లకు డిమాండ్‌ కల్పించేందుకు ఆన్‌లైన్‌ బ్యాంకును అందుబాటులోకి తీసుకువచ్చింది. టీడీఆర్‌ ఉన్న వారికి సెట్‌ బ్యాక్‌ల మినహాయింపుతోపాటు, అదనపు అంతస్తు నిర్మించుకునే వెసులుబాటు ఉంది. ఎక్కువ నిర్మాణ విస్తీర్ణం కలిసి వస్తుందన్న ఉద్దేశంతో బడా నిర్మాణ సంస్థలు టీడీఆర్‌ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. నిర్మాణదారులు, టీడీఆర్‌ సర్టిఫికెట్‌ ఉన్న వారికి ప్రయోజనం కలిగేలా ఆన్‌లైన్‌ బ్యాంకులో వివరాలు పొందుపర్చారు.

1805 ఆస్తుల సేకరణ..

నగరంలో రహదారులు, నాలాల విస్తరణ, వంతెనలు, మిస్సింగ్‌/లింక్‌ రోడ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఆస్తులు సేకరించాల్సి వస్తోంది. గత ఐదేళ్లలో 89 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ (ఎస్‌ఆర్‌డీపీ, ఇతర పనుల  కోసం) పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో 55 చోట్ల పనులు పూర్తయ్యాయి. ఆయా మార్గాల్లో 1805 ఆస్తులు సేకరించారు. ఇందులో ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కోసం చేపట్టిన ఆస్తులు 1100, మిస్సింగ్‌/లింక్‌ రోడ్ల కోసం 192, రహదారుల విస్తరణ కోసం 511 ఆస్తులు సేకరించారు.


ప్రధాన మార్గాలు/ప్రాజెక్టుల వివరాలు...

- బయో డైవర్సిటీ వంతెన, శిల్పారామం ఆర్‌యూబీ, రాజీవ్‌గాంధీ వంతెన (జేఎన్‌టీయూ)

- రోడ్‌ నెంబర్‌ -45 ఫ్లై ఓవర్‌, కేబుల్‌ వంతెన

- ఆర్‌యూబీ హైటెక్‌ సిటీ

- బైరామల్‌గూడ అండర్‌పాస్‌ - చింతల్‌కుంట చెక్‌ పోస్ట్‌

- ఎల్‌బీనగర్‌ ఫ్లై ఓవర్‌ అండర్‌పాస్‌

- కామినేని జంక్షన్‌ ఫ్లై ఓవర్‌

- నాగోల్‌ ఫ్లై ఓవర్‌ 

- అంబర్‌పేట ఫ్లై ఓవర్‌

- ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌.


కేటగిరీల వారీగా టీడీఆర్‌.. 

రహదారుల విస్తరణకు-553

ఎస్‌ఆర్‌డీపీ కోసం రోడ్ల విస్తరణకు- 128

మిస్సింగ్‌/లింక్‌ రోడ్ల కోసం- 49

నాలా విస్తరణ పనులు- 41

చెరువుల సుందరీకరణ- 77

ఇతరత్రా-03

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement