Krishna జిల్లాలో వైసీపీ ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా..

ABN , First Publish Date - 2021-11-26T21:51:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు..

Krishna జిల్లాలో వైసీపీ ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా..

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత వైసీపీలోకి పెద్ద ఎత్తున నేతలు జంప్ అయ్యారు. ఇప్పుడు కూడా ఆ జంపింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ గత కొన్ని రోజులుగా సీన్ రివర్స్ అయ్యింది. ఈ మధ్య కొందరు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి ప్రతిపక్ష పార్టీల్లోకి చేరిపోతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో కీలక నేత, మండల అధ్యక్షుడిగా ఉన్న పామర్తి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేసేశారు. అంతేకాదు.. ప్రభుత్వం తనకు ఇచ్చిన ఏఎంసీ చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు.


ఇద్దరి మధ్య గొడవలు..!

ఇలా రెండు పదవులకు రాజీనామా చేసి.. లేఖను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు పామర్తి పంపారు. గత కొంతకాలంగా ఆయన పార్టీలో అసంతృప్తితోనే కొనసాగుతూ వస్తున్నారు. కొన్నేళ్లుగా వైసీపీలో ఉన్న ఈయన్ను పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పట్టించుకోవట్లేదని పామర్తి అనుచరులు చెబుతున్నారు. మరోవైపు.. దీనికి తోడు మైలవరం పార్టీ ఇంచార్జి నారాయణకు, పామర్తికి మధ్య గొడవలు వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న సమస్యలను అధిష్టానం పరిష్కరించకపోవడం గమనార్హం.


కారణాలేంటి..!?

ఇవన్నీ ఒక ఎత్తయితే ఇటీవల జరిగిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక పామర్తి రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఎన్నికలో అధికార వైసీపీ ఓటమిపాలవ్వడంతో సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అంతేకాదు.. ఎమ్మెల్యేలు జోగి రమేష్- వసంత కృష్ణ ప్రసాద్‌ల మధ్య ఒక్కసారిగా దూరం పెరిగింది. దీంతో జోగి రమేష్ వర్గంగా పేరున్న పామర్తి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. అనూహ్యంగా ఈయన రాజీనామా చేయడంతో నియోజకవర్గంలోనే కాదు.. జిల్లాలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఇద్దరూ ఆయన్ను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. కాగా.. బీసీ నాయకుడిగా పామర్తికి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా మంచి పేరు, పట్టు ఉంది. అయితే.. రాజీనామా చేసిన శ్రీను.. అధిష్టానం బుజ్జగిస్తే మిన్నకుండిపోతారా..? లేకుంటే ఏ పార్టీలో చేరుతారు..? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-11-26T21:51:17+05:30 IST