Abn logo
Oct 25 2021 @ 00:31AM

పోతవరంలో వెలుగులోకి మరో భారీ చోరీ

చోరీ జరిగిన ఇంట్లో చిందరవందరగా పడి వున్న వస్తువులను చూస్తున్న డీఎస్పీ

  • 70 కాసుల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలు అపహరణ 
  • సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి

పి.గన్నవరం, అక్టోబరు 24: మండలంలోని పోతవరంలో విశ్రాంత వీఆర్వో నందెపు శ్యామలరావు ఇంట్లో మరోభారీ చోరీ వెలుగులోకి వచ్చింది. అదే గ్రామంలో ఖండవల్లి వెంకటసత్యనారాయణచార్యులు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన పాఠకులకు విదితమే. ఈ ఇంటికి కూతవేటు దూరంలో మరో ఇంట్లో చోరీ వెలుగు చూడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు,  భాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... విశ్రాంత వీఆర్వో శ్యామలరావు తన భార్యతో కలిసి వైద్యం కోసం ఈ నెల 14న హైదరాబాదు వెళ్లాడు. శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటం గమనించిన స్థానికులు శ్యామలరావుకు ఫోను చేసి సమచారం అందించారు. దీంతో వారు ఆదివారం ఉదయానికి ఇంటికి చేరుకున్నారు. 70 కాసుల బంగారం, రెండున్నర కిలోల వెండి అభరణాలు దోచుకుపోయినట్టు గుర్తించారు. బ్యాంకు లోనులో పెట్టిన ఆభరణాలను ఇటీవలే తీసు కొచ్చి ఇంట్లో ఉంచుకున్నామని, ఇంతలో దొంగలు పడ్డారని శ్యామలరావు భార్య పద్మావతి రోదిస్తూ చెప్పింది. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అమలా పురం డీఎస్పీ వై.మాధవరెడ్డి, సీఐ వి.కృష్ణ, క్రైం సీఐ రజనీకుమార్‌,  ఎస్‌ఐ జి.సురేంద్ర పరిశీలించారు. డీఎస్పీమాట్లాడుతూ దొంగలు ఇల్లంతా కారం చల్లారని కాకినాడ, అమలాపురం నుంచి వచ్చిన క్లూస్‌ టీమ్‌ వేలిముద్రలు సేకరించిందని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సిస్టమ్‌ను వినియోగించుకోవాలని, ముందుగా తమకు సమాచారం అందిస్తే రక్షణ కల్పిస్తామని డీఎస్పీ చెప్పారు.