Abn logo
Nov 24 2021 @ 00:00AM

బిగ్‌బుల్‌... మళ్లీ జాక్‌పాట్‌...

ముంబై : ఏస్ఇన్వెస్టర్, బిగ్‌‌బుల్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా చేతి రేఖల్లో ఏముందోగానీ, ఆయన ఏది పట్టుకుంటే అది పసిడిగా మారుతోంది. స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్పూరెన్స్ కంపెనీ ఐపీఓ ద్వారా, భారీగా డబ్బును  తన పాకెట్‌లో వేసుకోబోతున్నారు ఝున్‌ఝున్‌వాలా. ఈ కంపెనీలో దాదాపు 8.23 కోట్ల షేర్లు, లేదా 14.98 శాతం వాటా ఈయనకు ఉంది.  రూ. 7,249 కోట్ల విలువైన ఈ ఐపీఓ ప్రైస్‌ బ్యాండ్‌ను రూ. 870-900 గా నిర్ణయించిన నేపధ్యంలో... ఈ వెటరన్‌ ప్లేయర్‌ పెట్టుబడి దాదాపు ఆరు రెట్లు పెరిగే అవకాశముంది. కాగా... 2019 మార్చి- 2021 నవంబరు  మధ్య తొమ్మిది లావాదేవీల్లో సగటున రూ. 155.28 చొప్పున ఈ బీమా కంపెనీ షేర్లను రాకేష్‌ కొనుగోలు చేశారు. దాదాపు 32 నెలల క్రితం ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఈ పెట్టుబడి విలువ 5.79 రెట్లు పెరిగింది.


ఝున్‌ఝున్‌వాలా గత ఏడాదిలో సగటున ఒక్కోటి రూ. 256.44 చొప్పున 9,324,087 స్టార్ హెల్త్ షేర్లను కొనుగోలు చేయగా, ఆయన భార్య రేఖకు 3.23 శాతం వాటాతో 17,870,977 షేర్లు ఉన్నాయి. ఈ ఏడాది... పేటీఎం, జొమాటో తర్వాత... స్టార్ హెల్త్ మూడో అతి పెద్ద ఐపీఓ. ఈ నెల 30 న ఆఫర్‌ ప్రారంభమైన డిసెంబరు 2 న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. రెండు వేల కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లు, 58,324,225 షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో అమ్మకానికొస్తున్నాయి. క్యూఐబీ కోటా 75 శాతం, ఎన్‌ఐఐ 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లది మిగిలిన 10 శాతం. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ ప్రకారం, ఈ కంపెనీ విలువ రూ. 51 వేల కోట్లు, లేదా ఏడు బిలియన్ డాలర్లుగా ఉంటుంది. షేర్ల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బును కంపెనీ క్యాపిటల్‌ బేస్‌ పెంచడానికి వినియోగిస్తారు. 


ప్రమోటర్లైన సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్, కోణార్క్ ట్రస్ట్, ఎంఎంపీఎల్‌ ట్రస్ట్; నాన్ ప్రమోటర్లైన ఏపీస్‌ గ్రోత్, యూనివర్శిటీ ఆఫ్‌ నోట్రే డామ్, మియో స్టార్ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా  వాటాలను తగ్గించుకుంటాయి. ప్రస్తుతం, కంపెనీలో ప్రమోటర్లకు 62.80 శాతం వాటాను కలిగి ఉండగా, మిగిలింది పబ్లిక్ షేర్‌హోల్డర్ల దగ్గరుంది. ఇందులో... సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా 45.32 శాతం వాటాను, ఝున్‌ఝున్‌వాలా దంపతులు 17.26 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ... పెట్టుబడి పెట్టేముందు మార్కెట్‌ నిపుణుల సలహా తీసుకుని ముందడుగు వేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.