‘బిగ్‌ బాస్‌’... జర పైలం... మిల్కురి గంగవ్విక్కడ!

ABN , First Publish Date - 2020-09-09T05:30:00+05:30 IST

పల్లెటూరి అమాయకత్వం... తెలంగాణ యాసలోని వైవిధ్యం... గంగవ్వ ప్రత్యేకం. లోకాన్ని వడపోసిన అనుభవం...

‘బిగ్‌ బాస్‌’... జర పైలం... మిల్కురి గంగవ్విక్కడ!

పల్లెటూరి అమాయకత్వం... తెలంగాణ యాసలోని వైవిధ్యం... గంగవ్వ ప్రత్యేకం. లోకాన్ని వడపోసిన అనుభవం... కట్టె విరిచినట్టు మాట్లాడే తత్వం... నటనలో సహజత్వం... అన్నీ కలిపితే ఆమె! యూట్యూబ్‌లో ‘మై విలేజ్‌ షో’తో మొదలై... ఇప్పుడు ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌లో ఎంట్రీ వరకు... అరవయ్యేళ్ల వయసులో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న ‘సెలబ్రిటీ’ గంగవ్వ జర్నీ ఇది. 


‘మై విలేజ్‌ షో’ సూపర్‌ హిట్‌ అయింది. గంగవ్వకు చెప్పలేనంత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గంగవ్వ అభిమానపాత్రురాలయ్యారు.


పల్లెటూరి నుంచి ప్రపంచ స్థాయికి పరిచయమైన సామాన్య గ్రామీణ మహిళ మిల్కూరి గంగవ్వ. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లాంబాడిపల్లి ఆమె సొంతూరు. చిన్న వయసు నుంచే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఏడేళ్ల వయసులోనే అదే గ్రామానికి చెందిన గంగయ్యతో పెళ్లయింది. నాటి నుంచి ఆమె పడని కష్టం లేదు. భర్త ఏ పనీ చేసేవాడు కాదు. తాగుడుకు బానిసై నిత్యం వేధించేవాడు. దానికితోడు ముగ్గురు సంతానం. కుటుంబ భారమంతా గంగవ్వపైనే పడింది. పిల్లల ఆకలి తీర్చే దారి లేక వ్యవసాయ కూలీగా మారింది. భర్త దుబాయ్‌ వెళతానంటే... కూలి డబ్బులకు మరికొంత అప్పు తీసుకుని మరీ పంపించింది. తమ బతుకులు బాగుపడతాయని భావించింది. కానీ అదే జీవితం. 


బిడ్డల పెళ్లి కోసం... 

పదేళ్ల తరువాత తిరిగొచ్చిన గంగవ్వ భర్త మద్యం మత్తులో మరణించాడు. ఆమె కష్టాలు రెట్టింపయ్యాయి. ముగ్గురు సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు. వారి పెళ్లి చేయడానికి ఉన్న వ్యవసాయ భూమిని అమ్మాల్సి వచ్చింది. మరికొంత అప్పు తెస్తే కానీ పెళ్లి తంతు పూర్తవ్వలేదు. ఆ అప్పు తీర్చేందుకు పొద్దంతా ఆమె వ్యవసాయ పనులు చేసేవారు. పొద్దు పోయాక మొదలెట్టి అర్ధరాత్ని వరకు బీడీలు చుట్టేవారు. పూట గడవడానికి విరామం లేకుండా శ్రమించాల్సిన పరిస్థితి. 


మలుపు తిప్పిన ‘మై విలేజ్‌ షో’... 

కుటుంబాన్ని నెట్టుకురావడానికి అష్టకష్టాలూ పడుతున్న సమయంలో గంగవ్వ జీవితం అనుకోని మలుపు తిరిగింది. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ ‘మై విలేజ్‌ షో’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు. పల్లెటూరి ఊసులు, అక్కడి జనజీవన చిత్రాలను డిజిటల్‌ తెరపైకి తెస్తూ... గ్రామీణ నేపథ్యం, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచం ముందుంచుతున్నారు. వాటికి మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే తన ఇంటి సమీపంలోనే ఉండే బంధువు గంగవ్వ... శ్రీకాంత్‌ కంట్లో పడ్డారు. అచ్చమైన తెలంగాణ భాష, చలాకీగా మాట్లాడడం చూసి, ఆమెతో ‘మై విలేజ్‌ షో’లో ఒక వీడియో చేశాడు. అది సూపర్‌ హిట్‌ అయింది. గంగవ్వకు చెప్పలేనంత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గంగవ్వ అభిమానపాత్రురాలయ్యారు. 


తూట్ల పైంటు... డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌... 

అనుకోకుండా ఒక్క వీడియోతో మొదలైన గంగవ్వ ప్రయాణం... ‘విశ్రాంతి’ లేకుండా సాగుతూనే ఉంది. చివరకు తనను పరిచయం చేసిన ‘మై విలేజ్‌ షో’కు ఆమే ముఖచిత్రమయ్యారు. ‘తూట్ల పైంటు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ తదితర 70కి పైగా లఘుచిత్రాల్లో గంగవ్వ తనదైన శైలిలో మెప్పించారు. ఇక ‘విజయ్‌ దేవరకొండ పెళ్లి గోస, సమంత అక్కినేని వర్సెస్‌ గంగవ్వ’ తదితర వీడియోలతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఆరు పదుల వయసులో సెలబ్రిటీగా ఎదిగిన గంగవ్వ యూట్యూబ్‌ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. గంగవ్వతో సెల్ఫీ అంటే ఇప్పుడు జనంలో క్రేజ్‌! 


సినీ స్టార్లూ అభిమానులే... 

మహేష్‌బాబు, విజయ్‌ దేవరకొండ, సమంత, కాజల్‌ తదితర కోట్ల మంది అభిమానులున్న స్టార్లు... గంగవ్వ అభిమానులు. ఈ జాబితాల్లో చాలామంది రాజకీయ నాయకులూ ఉన్నారు. అయినా ఆమెలో కించిత్‌ గర్వం కనిపించదు. అదే చిరునవ్వు. అదే పల్లెటూరి అమాయకత్వం... ఆప్యాయంగా పలుకరించే స్వభావం. తెలుగు దర్శకులెందరో మెచ్చే గంగవ్వకు ‘ఇస్మార్ట్‌ శంకర్‌, మల్లేశం’ సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. అంతేకాదు... ఇటీవల తెలంగాణ గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా ‘గ్రామీణ మీడియా యూట్యూబ్‌ కళాకారిణి’గా పురస్కారం కూడా ఆమె అందుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అరవై వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 


‘బిగ్‌’ ఎంట్రీ... 

ఎక్కడో మారుమూల ప్రాంతం, ఓ పాతకాలపు ఇంట్లో సంసారాన్ని నెట్టుకొస్తున్న గంగవ్వ తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ ఒడిసిపట్టుకొంటున్నారు. నటనలో ఏ అనుభవం లేకపోయినా... భయమూ, బెరుకూ లేకుండా కెమెరా ముందు అల్లుకుపోతారు. చదవడం, రాయడం రాని గంగవ్వకు కాన్సెప్ట్‌ చెబితే చాలు... స్ర్కిప్ట్‌తో పనిలేదు. టేకులపై టేకులు అక్కర్లేదు. చెప్పింది చెప్పినట్టు చేసుకుపోతారు. తన నటన, పంచ్‌ డైలాగ్‌లతో అభిమానులనే కాదు, ప్రపంచ మీడియానూ ఆకర్షించారు. బీబీసీ, సీఎన్‌ఎన్‌ వంటి ఛానల్స్‌లో ఆమెపై ప్రత్యేక కథనాలు వచ్చాయి. బహుశా ఇవే గంగవ్వకు ‘బిగ్‌ బాస్‌’ సీజన్‌-4లో ఎంట్రీకి దారులు వేసి ఉంటాయి. 


ఆశ్చర్యం... ఆనందం... 

హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వస్తున్న ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల పేర్లు ప్రకటించగానే అందరిలో తొలుత ఆశ్చర్యం! ఎందుకంటే అందులో గంగవ్వ పేరు ఉంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లలో పల్లె నుంచి వచ్చిన ఆమె ప్రత్యేకంగా నిలిచారు. ఈ సందర్భంగా తన కష్టాలు చెప్పుకుని అందరినీ ఏడిపించేశారు. అరవై ఏళ్లున్న గంగవ్వను హౌస్‌లోకి తేవడం సాహసమనే చెప్పాలి. 60 ఏళ్ల అవ్వ 105 రోజులపాటు హౌస్‌లో ఎలా నెట్టుకువస్తారనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడైతే ఆమె పేరు ప్రకటించారో అప్పటి నుంచి గంగవ్వ వైరల్‌ అవుతోంది. 


అప్పుడే ఆర్మీ రచ్చ... 

గంగవ్వను ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌లో చూడగానే ఆమె అభిమానులు రచ్చ మొదలెట్టేశారు. షో మొదలవ్వడమే ఆలస్యం... ‘గంగవ్వ, బిగ్‌బాస్‌ తెలుగు 4’ హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నారు. గంగవ్వ ఆర్మీ వచ్చేసిందంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. హౌస్‌లోకి వెళ్లే ముందు ‘కొంచెం భయంగా ఉంది’ అని గంగవ్వ పేరుతో వచ్చిన ట్వీట్‌కు వేల మంది స్పందించారు. ‘అవ్వా... అస్సలు భయపడొద్దు. ఇరగ్గొట్టేయ్‌. నీకు మేమున్నాం’ అంటూ ధైర్యం చెబుతున్నారు. 

మరి లక్షలాదిమంది అభిమానులున్న గంగవ్వ బిగ్‌ బాస్‌ ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేస్తారా? హౌస్‌లో తన ముచ్చట్లతో ఆకట్టుకొంటారా? మాటల గారడీతో అందర్నీ బోల్తా కొట్టించి విజేతగా నిలుస్తారా? బుల్లి తెరపైనే చూద్దాం! 


ఆమెది స్పెషల్‌ ట్యాలెంట్‌... 

మా యూట్యూబ్‌ ఛానల్‌ ‘మై విలేజ్‌ షో’ కోసం వీడియోలు తీస్తున్నప్పుడు గంగవ్వ చూస్తుండేది. ఆమె నాకు బంధువు కూడా! ఆమె మాటతీరు, హావభావాలు ఆకట్టుకొంటాయి. దీంతో ఆమెతో ఒక షార్ట్‌ ఫిలిమ్‌ తీద్దామనుకున్నా. అడిగితే గంగవ్వ సరేనంది. కెమెరా ముందుకు రావాలంటే అందరూ భయపడతారు. కానీ ఆమెలో ఆ భయం కానీ, బెరుకు కానీ లేవు. అది ఆమె ప్రత్యేకత. 2012లో ఆమెతో మొదటి లఘుచిత్రం ‘మరుగుదొడ్డి మల్లన్న’ తీశాం. దానికి మంచి ఆదరణ లభించింది. తరువాత 2017లో తీసిన ‘విలేజ్‌లో ఇంటర్‌నెట్‌ కష్టాలు’తో గంగవ్వ బాగా వైరల్‌ అయింది. కొంత కాలానికి కొన్ని టీవీ ఛానల్స్‌లో కార్యక్రమాలు చేసింది. సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడామెకు ‘బిగ్‌ బాస్‌’లో అవకాశం రావడం నిజంగా మాకెంతో సంతోషంగా ఉంది. ‘మంచి ఇల్లు కట్టుకోవాలన్నది నా కల. షో ద్వారా వచ్చే డబ్బులతో ఆ కల నెరవేరుతుందని ఆశిస్తున్నా’ అంటూ ‘బిగ్‌ బాస్‌’కు వెళ్లేముందు గంగవ్వ చెప్పింది. ఆ హౌస్‌లో కూడా ఆమె నవ్వులు పూయించి, అందరి మనసులూ గెలుస్తుందని ఆశిస్తున్నా.

 శ్రీకాంత్‌, ‘మై విలేజ్‌ షో’ 



--కుర్మాచలం శ్రీనివాసు , జగిత్యాల

ఫొటోలు: ముల్క శ్రీమాన్‌ 


Updated Date - 2020-09-09T05:30:00+05:30 IST