బిగ్గెస్ట్‌ థ్రిల్లర్‌ హిట్‌ ఇచ్చారు

ABN , First Publish Date - 2021-01-17T05:51:56+05:30 IST

సంక్రాంతి పండక్కి విడుదలైన ‘రెడ్‌’ చిత్రం పూర్తిగా థ్రిల్లర్‌ మూవీ అని, కలెక్షన్ల రూపంలో ప్రేక్షకులు బిగ్గెస్ట్‌ థ్రిల్లర్‌ హిట్‌ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని హీరో రామ్‌ అన్నారు.

బిగ్గెస్ట్‌ థ్రిల్లర్‌ హిట్‌ ఇచ్చారు
విజయోత్సవంలో మాట్లాడుతున్న హీరో రామ్‌

మరిన్ని మంచి చిత్రాలతో మీ ప్రేమను పొందుతా..

‘రెడ్‌’ విజయోత్సవంలో హీరో రామ్‌

సిరిపురం, జనవరి 16: సంక్రాంతి పండక్కి విడుదలైన ‘రెడ్‌’ చిత్రం పూర్తిగా థ్రిల్లర్‌ మూవీ అని, కలెక్షన్ల రూపంలో ప్రేక్షకులు బిగ్గెస్ట్‌ థ్రిల్లర్‌ హిట్‌ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని హీరో రామ్‌ అన్నారు. శనివారం రాత్రి సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ‘రెడ్‌’ చిత్రం విజయోత్సవాన్ని శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ ఈ చిత్రంలోని రెండు పాత్రలు తాను చేయడం కొత్తగా ఉందని, ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.ఈ సినిమాలోని డైలాగ్స్‌కు మంచిపేరు వస్తోందన్నారు. తన 15 ఏళ్ల కెరీర్‌ ఒకవైపు.. ఇప్పటినుంచి కెరీర్‌ ఇంకోవైపు ఉంటుందని... భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలు చేసి మీ ప్రేమను గెలుస్తానన్నారు. అనంతరం ప్రేక్షకుల కోరిక మేరకు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంలోని డైలాగ్‌ చెప్పి ఆహూతులను ఆనందింపజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రేక్షకులు మల్టీస్టారర్‌ సినిమా ఎప్పుడు.. ఎవరితో చేస్తారు? మీ పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నలకు రామ్‌ నవ్వుతూ సమాధానాలిచ్చారు. హీరోయిన్‌ మాళవికశర్మ మాట్లాడుతూ ‘రెడ్‌’లో నటించినందుకు గర్వంగా ఫీలవుతున్నానన్నారు. రామ్‌ ఎనర్జీ ఎంతో బాగుంటుందని,  ఆయన నటనకు తాను పెద్ద ఫ్యాన్‌ అయిపోయానన్నారు. దర్శకుడు కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ వైజాగ్‌తో తనకు ప్రత్యేక బాండింగ్‌ ఉందని, ఇక్కడ చిత్రీకరణే కాదు స్ర్కిప్ట్‌ వర్క్స్‌ కూడా చేస్తానన్నారు. చిత్ర విజయానికి ముఖ్య కారణం హీరో రామే అని, రెండు షేడ్స్‌లో అద్భుతంగా నటించారన్నారు. ఈ సందర్భంగా రామ్‌ నటించిన చిత్రాల్లోని పాటలకు నృత్య కళాకారులు వేసిన డ్యాన్స్‌లు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీముఖి వ్యవహరించగా నిర్మాత కృష్ణ పోతినేని, శ్రేయాస్‌ మీడియా శ్రీనివాస్‌, దినకర్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.






Updated Date - 2021-01-17T05:51:56+05:30 IST