Abn logo
Jul 5 2020 @ 06:16AM

బీహార్ శాసన మండలి ఛైర్మన్‌కు కరోనా

బీహార్ సీఎం నితీష్‌కుమార్‌, సీఎంవో అధికారులకు నెగిటివ్ 

పట్నా(బీహార్): బీహార్ శాసన మండలి యాక్టింగ్ ఛైర్మన్ అవధేశ్ నారాయణ్ సింగ్ కు కరోనా వైరస్ సోకడంతో అప్రమత్తమైన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్ తోపాటు అతని భార్య, ఇద్దరు కుమారులు, కోడలికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. అవధేష్ నారాయణ్ సింగ్, అతని కుటుంబసభ్యులు జ్వరంతో బాధపడుతుండటంతో వారికి పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కరోనా పరీక్షలు చేశారు. కౌన్సిల్ ఛైర్మన్ కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో ఛైర్మన్ వ్యక్తిగత సహాయకుడు రాహుల్ కుమార్ కు కూడా కరోనా వచ్చింది. కౌన్సిల్ ఛైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్ జులై 1వతేదీన కొత్తగా ఎన్నికైన 9 మంది ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలతోపాటు ఇతర పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దీంతో కరోనా భయంతో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తోపాటు 16 మంది ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కరోనా పరీక్ష చేయించుకున్నారు. సీఎంతోపాటు సీఎంవో అధికారులకు కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement