పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండానే కాంగ్రెస్ మేనిఫెస్టో

ABN , First Publish Date - 2020-10-21T21:55:15+05:30 IST

ఎమ్మెల్యీ ఎన్నికల్లో మదన్ మోహన్ ఝా పోటీ చేస్తుండటంతో ఆయన మేనిఫెస్టో కార్యక్రమానికి...

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండానే కాంగ్రెస్ మేనిఫెస్టో

పాట్నా: బద్లావ్ పత్ర (మార్పు పత్రం) పేరుతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. అయితే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, రాజ్‌బబ్బర్, శక్తి సింగ్ గోహిల్ తదుతరులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఎమ్మెల్యీ ఎన్నికల్లో మదన్ మోహన్ ఝా పోటీ చేస్తుండటంతో ఆయన మేనిఫెస్టో కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు తెలియజేస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తుండటం, సీనియర్ నేతలు అందుబాటులోనే ఉండటంతో మేనిఫెస్టో రిలీజ్‌కు దూరంగా ఉన్నానని, ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికాగానే తిరిగి పార్టీ ప్రచారం కొనసాగిస్తానని చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించాలని మదన్ మోహన్‌కు పార్టీ సూచించినట్టు కాంగ్రెస్ బీహార్ ఇన్‌చార్జి శక్తి సింగ్ గోహిల్ తెలిపారు.


మదన్ మోహన్ ఝా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దర్బంగా టీచర్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్‌డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి సురేష్ ప్రసాద్ రాయ్‌ ఆయనతో తలబడుతున్నారు. మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ నియోజవర్గాల్లో ఈనెల 22న ఓటింగ్ జరగనుంది. పాట్నా, తిర్హుట్, దర్బంగా, కోసి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలతో పాటు, పాట్నా, తిర్హుట్, దర్బంగా, శరన్ టీచర్స్ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10 ప్రకటించనుండగా, దానికి రెండు రోజుల తర్వాత (నవంబర్ 12) ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2020-10-21T21:55:15+05:30 IST