Abn logo
Aug 14 2021 @ 09:28AM

Bihar floods: పాట్నాను ముంచెత్తిన గంగానది

పాట్నా (బీహార్): బీహార్ రాష్ట్రంలో వరదలు వెల్లువెత్తాయి. గత 24 గంటల్లో కురిసిన భారీవర్షాలతో గంగానది నీటి మట్టం ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది. గంగానది వరదనీరు పాట్నాతోపాటు పలు గ్రామాలను ముంచెత్తడంతో 35వేల మందిని సురక్షితప్రాంతాలకు తరలించారు. సోనామా పంచాయితీ, ఖాస్‌పూర్, జెతులి, పునాది పంచాయితీలు వరదనీటిలో మునిగాయి.గంగా నది వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో పాట్నాలోని తూర్పుభాగంలోని దిదర్ గంజ్ ప్రాంతం ముంపునకు గురైంది. పలు గ్రామాల వరద బాధితులు పడవలపై వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. వరదనీరు గ్రామాన్ని ముంచెత్తడంతో తమకు నిత్యావసర సరుకులు కూడా దొరకడం లేదని, పశువులు, పెంపుడు జంతువులు ఆకలితో అలమటిస్తున్నాయని ఖాస్పూర్ గ్రామ నివాసి సరోజ్ కుమార్ చెప్పారు. 

పాట్నా సాహిబ్ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తమ గ్రామాన్ని సందర్శించినా తమకు ఆహారం అందించలేక పోయారని మరో గ్రామస్థుడు రాహుల్ శర్మ ఆరోపించారు.వరదల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచినీరు కూడా దొరక్క వరదబాధితులు అవస్థలు పడుతున్నారు. తూర్పు, పశ్చిమ చంపారన్, సుపాల్, అరారియా, మాధేపురా, షియోహర్, సహర్సా, కిషన్‌గంజ్, కటిహార్, పుర్నియా, వైశాలి, గోపాల్‌గంజ్, సివాన్, సరన్ లతో పాటు 28 జిల్లాలు వరదల వల్ల దెబ్బతిన్నాయని బీహార్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెప్పారు.