బిహార్‌లో రైలు దహనం

ABN , First Publish Date - 2022-01-27T08:04:29+05:30 IST

రైల్వేలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న ఆర్‌ఆర్‌బీ పరీక్ష విషయంలో గందరగోళం ఏర్పడటంతో అభ్యర్థుల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. బిహార్‌లో ఒక రైలును దహనం చేశారు. అనేక రైళ్లపై రాళ్లతో దాడి చేశారు..

బిహార్‌లో రైలు దహనం

మరికొన్ని రైళ్లపై రాళ్ల దాడి

‘ఆర్‌ఆర్‌బీ’ ఆందోళన హింసాత్మకం

నియామక పరీక్షలో గందరగోళంతోనే 

యూపీలోనూ హింసాత్మక ఘటనలు

పరీక్షను నిలిపివేసిన రైల్వేశాఖ

పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ

పట్నా, న్యూఢిల్లీ, జనవరి 26: రైల్వేలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న ఆర్‌ఆర్‌బీ పరీక్ష విషయంలో గందరగోళం ఏర్పడటంతో అభ్యర్థుల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. బిహార్‌లో ఒక రైలును దహనం చేశారు. అనేక రైళ్లపై రాళ్లతో దాడి చేశారు. యూపీలోనూ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో రైల్వేశాఖ అనేక రైళ్లను రద్దు చేసింది. పరీక్షను నిలిపివేయాలని నిర్ణయం తీసుకొంది. సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. అలాగే, రైల్వే ఆస్తుల విధ్వంసానికి పాల్పడినవారిని జీవితాంతం రైల్వే ఉద్యోగాలకు అనర్హులను చేస్తామని హెచ్చరించింది. ఎన్‌టీపీసీ(నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌) పరీక్ష-2021కి ఆర్‌ఆర్‌బీ(రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) 2019లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


లెవల్‌-2 నుంచి లెవల్‌-6 వరకు మొత్తం 35 వేల పోస్టులను ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, పరీక్ష ఫలితాలను ఈ నెల 15న విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపికకు మరో పరీక్ష నిర్వహిస్తామని రైల్వే శాఖ ప్రకటించడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నోటిఫికేషన్‌లో ఒక పరీక్ష అనే పేర్కొన్నారని అభ్యర్థులు అంటుండగా, రెండు పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లోనే తెలిపామని రైల్వే శాఖ చెబుతోంది. అభ్యర్థుల ఆందోళనలు బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల్లో హింసాత్మకంగా మారాయి. బిహార్‌లోని గయ పట్టణంలో భభువా-పట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రె్‌సను అభ్యర్థులు దహనం చేశారు. అయితే, ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని రైల్వేశాఖ తెలిపింది. జెహనాబాద్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను రైలు పట్టాలపై దహనం చేశారు. సీతామర్హిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. పట్నాలో నలుగురిని అరెస్టు చేశారు. కాగా, అభ్యర్థులు మూడు వారాల్లోగా తమ సందేహాలు, సమస్యలు, సలహాలను ఈ కమిటీకి పంపాలని రైల్వేశాఖ సూచించింది. ఫిబ్రవరి 23న నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్టు ప్రకటించింది. అలాగే, అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.


ఇక.. ఆర్‌ఆర్‌బీ అభ్యర్థులకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. ‘బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేనూ మీ వెంట ఉన్నాను. అయితే, హింస మన మార్గం కాదు. అహింస ద్వారానే స్వాతంత్ర్యాన్ని సాధించాం. హక్కులను అహింస ద్వారా ఎందుకు సాధించలేం?’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. కాగా, అభ్యర్థులపై ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. అభ్యర్థులు శాంతియుతంగా ‘సత్యాగ్రహ’ మార్గాన్ని అనుసరించాలని ఆమె పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-27T08:04:29+05:30 IST