Abn logo
Nov 13 2020 @ 00:16AM

బిహార్‌ విశేషాలు

బిహార్‌ ఎన్నికలు రానూ వచ్చాయి, వెళ్ళనూ వెళ్ళాయి. ప్రచారపర్వంలో ఉన్న హడావుడి, వేడి అంతా ఫలితాల రోజునే చప్పపడిపోయింది. చివరిదశ పోలింగ్‌ రోజు నవంబర్‌ 7 వ తేదీన విడుదలయిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది అన్నట్టుగా కలకలం సృష్టించాయి. ఆ మూడు రోజులు ఆర్‌జెడి యువనాయకుడు తేజస్వి యాదవ్‌తో పాటు, దేశ రాజకీయాలలో మార్పు రావాలని కోరుకునేవారంతా ఉత్సాహంగా ఉన్నారు. కానీ, అంతిమ ఫలితం అనుకున్నట్టుగా రాలేదు. అట్లాగని, అధికారపక్షం అట్టహాసంగా గెలిచిందీ లేదు, ప్రతిపక్షం నీరసంగా ఓడిందీ లేదు. హోరాహోరీ అన్నట్టుగా, మెజారిటీ దాటి మూడు సీట్లు అదనంగా తెచ్చుకునేదాకా ఎన్‌డిఎ కూటమి వెళ్లింది. అర్థరేఖకు పన్నెండు సీట్లకు ఈవల ఆర్‌జెడి నాయకత్వంలోని మహాగట్‌బంధన్‌ ఆగిపోయింది. తక్కినవి చిన్నపార్టీలకు, స్వతంత్రులకు వెళ్లాయి. 2015 ఎన్నికలలో రెండు కూటములకు ఎన్నెన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు కూడా సరిగ్గా అన్నే సీట్లు వచ్చాయి. ఒక్క ఎల్‌జెపికి మాత్రం గత అసెంబ్లీలో రెండు సీట్లు రాగా, ఇప్పుడు ఒకటే వచ్చింది. 


సంచలనాత్మకంగా ఏమీ జరగలేదన్న మాటే కానీ, విశేషం ఏమీ లేకుండా లేదు. 2015 ఎన్నికలలో లెక్కలకు ఇప్పటి లెక్కలకు చాలా సామీప్యం కనిపిస్తోంది నిజమే కానీ, మధ్యలో 2019 సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాలకు గాను, 39 సీట్లు ఎన్‌డిఎ, ఒక్క సీటు ఆర్‌జెడి గెలుచుకున్నాయి. ప్రతిపక్షం పరిస్థితి అప్పుడు అట్లా ఉన్నది. ఆ లెక్కన ఇప్పటి ఎన్నికలలో ఆర్‌జెడికి కానీ, ఆ కూటమికి కానీ ఓ ఆరేడు సీట్లు రావాలి. కానీ, 110 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు లభించింది. చిన్న విషయమేమీ కాదు. తండ్రి నుంచి కలిగే అప్రదిష్ఠను నిరోధించి, అనుభవరాహిత్యం అన్న పరిమితిని అధిగమించి, తన మీద ఓటర్లకు, భాగస్వామ్య పక్షాలకు విశ్వాసం కలిగించి తేజస్వి యాదవ్‌ ఈ మేరకు విజయం సాధించడం పెద్ద విశేషం. 


కూటముల లెక్క యథాతథంగా ఉన్నది కానీ, భాగస్వాముల వాటాలు మారాయి. నాటి కూటమిలో జెడియు 71 స్థానాలు, బిజెపి 53 స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు పరిస్థితి తారుమారయ్యింది. బిజెపి 74 స్థానాలు, జెడియు 43 స్థానాలు తెచ్చుకున్నాయి. జెడియుకు చెందిన నితీశ్‌ కుమారే ముఖ్యమంత్రి కానున్నారు. కానీ, ఆయనకు సొంత బలం తగ్గిపోయింది. కూటమిలో హోదా కూడా తగ్గిపోతుంది. నిజానికి ఆయనేమీ లొంగి ఉండనక్కరలేదు. శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ ఒక ప్రకటనలో నర్మగర్భంగా సూచించినట్టుగా, పరిస్థితి విషమిస్తే మహారాష్ట్ర మార్గాన్ని నితీశ్‌ అనుసరించవచ్చు. 2015తో పోలిస్తే ఆర్‌జెడి సీట్లు, కాంగ్రెస్‌ సీట్లు కూడా తగ్గాయి. గట్‌బంధన్‌లో కొత్తగా చేరిన వామపక్షాలు, ముఖ్యంగా సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ గట్టి విజయాలు సాధించాయి. 


నితీశ్‌ హోదాను తలకిందులు చేయడంలో బిజెపికి సహకరించిన పాశ్వాన్‌ పార్టీ ఎల్‌జెపికి ఒకే ఒక్క స్థానం లభించింది. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ పార్టీకి సీమాంచల్‌లో ఐదు స్థానాల్లో విజయం లభించింది. కేవలం జెడియు స్థానాల్లోనే పోటీపెట్టి, నితీశ్‌ను ఎల్‌జెపి బలహీనపరిచినట్టుగానే, మజ్లిస్‌ కూడా గట్‌బంధన్‌కు గడ్డుపరిస్థితి కల్పించిందన్న విమర్శలు ఉన్నాయి. 20 స్థానాల్లో పోటీచేసిన తాము ఐదింటిలో గెలిచామని, వాటిలో నాలుగు స్థానాల్లో ఎన్‌డిఎనే రెండో స్థానంలో ఉన్నదని, తక్కిన పదిహేను స్థానాల్లో తమకు నామమాత్రపు ఓట్లే వచ్చాయని మజ్లిస్‌ వాదిస్తున్నది. గట్‌బంధన్‌ గెలిచే అవకాశం ఉన్న చోట్ల తాము దెబ్బతీయలేదని చెప్పడం ఆ వాదన సారాంశం. అయితే, మజ్లిస్‌ రంగంలో ఉండడం వల్ల ఆయా నియోజకవర్గాలలో తటస్థ హిందూ ఓటర్లు ఎన్‌డిఎ వైపు మొగ్గుచూపారని, ఆ రకంగా పరోక్ష ప్రభావం పడిందని గట్‌బంధన్‌ ప్రతినిధులు అంటున్నారు. తేజస్వి యాదవ్‌ ముఖ్యమంత్రి కాకుండా మజ్లిస్‌ అడ్డుకున్నదా అన్న ప్రశ్న పక్కనపెడితే, బిహార్‌లో ఐదుస్థానాలలో గెలవడం ఆ పార్టీకి గొప్ప విస్తరణ. ఆ బలాన్ని ఆ పార్టీ ఎట్లా వినియోగించుకుంటుందో చూడాలి. 


కరోనా కట్టడి, వలసకార్మికుల సంక్షేమం వంటి అంశాలలో విఫలమైనప్పటికీ, చైనాతో సరిహద్దు వివాదం కారణంగా ఇబ్బంది పడినప్పటికీ బిహార్‌ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావాలూ పడలేదు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ ఆత్మహత్యను కూడా ఎన్‌డిఎ ఉపయోగించుకున్నప్పటికీ, దాని వల్ల అదనంగా ఏ ప్రయోజనమూ చేకూరలేదు. ఈ మొత్తం ప్రక్రియలో లబ్ధి పొందినవారిలో మొదట చెప్పుకోవలసినది బిజెపి. కూటమిలో దాని వాటా పెరిగింది. రెండో లబ్ధిదారు– తేజస్వి యాదవ్‌. అధికారం లభించకపోయినా, అతి పెద్ద పార్టీగా ఆర్‌జెడి అవతరించింది. జనాదరణ తగ్గిపోతున్న నేతగా నితీశ్‌ నిరూపితం అయ్యారు. బిజెపి నుంచి పెద్ద నాయకత్వం లేదు. కాబట్టి, బిహార్‌ అంటే తేజస్వి పేరే గుర్తుకు వస్తుంది. ఆ ప్రఖ్యాతి అతని భవిష్యత్తుకు పూచీగా ఉంటుంది. మూడో లబ్ధిదారు– వామపక్షాలు. కేరళ మినహా, తక్కిన దేశంలో చట్టసభల్లో ఉనికి విషయంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న వామపక్షాలకు బిహార్‌ ఇప్పుడు ఒక కొత్త ప్రేరణ. నాలుగో లబ్ధిదారు–మజ్లిస్‌. 


మూడున్నరేళ్ల దాకా సాధారణ ఎన్నికలు లేవు, ఐదేళ్ల దాకా అసెంబ్లీ ఎన్నికలు రావు. కానీ, బిహార్‌ కొత్త అసెంబ్లీకి సమకూరిన మార్పుచేర్పులు అనేక పరిణామాలకు కారణం కావచ్చు. వాటిలో కొన్ని అనూహ్యమైనవి కూడా ఉండవచ్చును.