కేంద్రానికి వ్యతిరేకంగా ఒకే మాటపై బిహార్ అధికార, ప్రతిపక్షాలు

ABN , First Publish Date - 2021-07-22T23:58:07+05:30 IST

జనాభా లెక్కల సేకరణ విధానంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని

కేంద్రానికి వ్యతిరేకంగా ఒకే మాటపై బిహార్ అధికార, ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ : జనాభా లెక్కల సేకరణ విధానంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బిహార్ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కులాలవారీ జనాభా లెక్కల సేకరణ కోసం ఉద్యమిస్తామని అధికార పార్టీ జేడీయూ, ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ సంకేతాలు పంపించాయి. 2021 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డు తెగలు (ఎస్టీలు) మినహా మిగిలినవారి వివరాలను కులాలవారీగా సేకరించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 


కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ, 2021 జనాభా లెక్కల సేకరణలో ఎస్సీ, ఎస్టీలను మాత్రమే కులాలవారీగా నమోదు చేస్తామని, ఇతరుల కులాలను నమోదు చేయబోమని తెలిపారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తారు. ఈసారి కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. 


జేడీయూ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ త్యాగి స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తమను నిరాశపరిచిందన్నారు. ఇది చాలా బాధాకరమని చెప్పారు. కులాలవారీ జనగణన చాలా అవసరమని చెప్పారు. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, సాంఘికంగా బలహీనంగా ఉన్నవారిని, వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి, వారికి సంక్షేమ పథకాలను అందించాలంటే కులాలవారీ జనగణన అవసరమని చెప్పారు. తాము మౌనంగా కూర్చోబోమని, దీనికోసం గట్టిగా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ నెల 31న న్యూఢిల్లీలో జరిగే తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చించి, ఓ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశానికి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ హాజరవుతారన్నారు. బిహార్‌లో బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.


బిహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయం కాదన్నారు. కులాలవారీ జనగణన కోసం తాము చాలా కాలం నుంచి పోరాడుతున్నామన్నారు. వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేయడానికి ఇదొక సాధనమని చెప్పారు. వెనుకబడిన కులాలకు చెందినవారి సంఖ్య తెలియకపోతే, వారికి సంక్షేమ పథకాలను అందజేయడానికి నిధులను కేటాయించడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఆర్జేడీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఆ పార్టీ మరికొద్ది వారాల్లోనే కులాలవారీ జనగణన కోసం ఆందోళనను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-07-22T23:58:07+05:30 IST