బిహార్‌ వ్యూహాలు

ABN , First Publish Date - 2020-10-06T05:57:06+05:30 IST

ఈ నెల 28 నుంచి నాలుగు విడతలుగా జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాల దృష్ట్యా కూడా కీలకమైనవి. బిజెపి ...

బిహార్‌ వ్యూహాలు

ఈ నెల 28 నుంచి నాలుగు విడతలుగా జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాల దృష్ట్యా కూడా కీలకమైనవి. బిజెపి నాయకత్వంలో ఉన్న ఎన్‌డిఎ రెండవ హయాం కేంద్రంలో కొనసాగుతున్నది. దీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీపై లేదా కూటమిపై ఓటర్లలో గూడుకట్టుకునే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో బిహార్‌ ఎన్నికలు సూచించవచ్చు. హాథ్రాస్‌ సంఘటన అనంతరం వాతావరణంలో వచ్చిన మార్పు, తాత్కాలికమేనా, ప్రతిపక్షాలలో క్రియాశీలత దీర్ఘకాలికమా– అన్నదానికి కూడా బిహార్‌ ఎన్నికలు పరీక్ష వంటివి. బిహార్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్నది జనతాదళ్‌–యు నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మూడు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. నితీశ్‌ నాయకత్వాన తాము ఎన్నికలకు వెడుతున్నామని ఎన్‌డిఎ ప్రకటించింది కాబట్టి, ఒకవేళ గెలిస్తే నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అవుతారు. 


కూటములు పైకి చూడడానికి బాగానే ఉంటాయి కానీ, వాటి లోలోపల కుట్రలూ కుతంత్రాలూ కూడా నడుస్తూ ఉంటాయి. నితీశ్‌దే నాయకత్వం అని చెప్పినప్పటికీ, బిజెపి నాయకత్వం ఆయన బలహీనపడాలని కోరుకుంటున్నది. నితీశ్‌ ఉండాలి, ఆయనకు ఇప్పుడున్నంత బలం ఉండకూడదు. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ నాయకత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) తాజాగా ఎన్‌డిఎ కూటమి నుంచి పాక్షికంగా వైదొలగింది. పాక్షికంగా అని ఎందుకు అనాలంటే, దానికి బిజెపితో సమస్య లేదు, జెడి (యు)తోనే పేచీ. వచ్చే ఎన్నికలలో సొంతంగా పోటీ చేస్తామని, బిజెపి అభ్యర్థులపై పోటీ పెట్టము కానీ, జెడి(యు)తో పోటీ పడతామని ఎల్‌జెపి నాయకుడు, పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రకటించారు. నలభైకి పైగా స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులను నిలుపుతుందట. ఎన్నికల తరువాత, తాము, బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చిరాగ్‌ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని కూడా ఎల్‌జెపి ప్రకటించింది. ఎన్నికల అనంతరం బిజెపి తనమీద ఆధారపడే పరిస్థితి ఏర్పడితే, ముఖ్యమంత్రి పదవిని ఆశించవచ్చని, కనీసం ఉపముఖ్యమంత్రి పదవి అయినా వస్తుందని చిరాగ్‌ భావిస్తున్నారు. అంతే కాదు, ఏదైనా తేడా వస్తే, తేజస్వి యాదవ్‌ నాయకత్వంలోని మహాగటబంధన్‌లో భాగస్వామి కావడానికి కూడా ప్రస్తుత నిర్ణయం ఉపయోగపడుతుందన్నది చిరాగ్‌ వ్యూహం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.


బిహార్‌లోని రెండు ముఖ్య దళిత రాజకీయశక్తులు, ఎల్‌జెపి, మాంఝి నాయకత్వంలోని హెచ్‌ఎఎమ్‌ (ఎస్‌) రెండూ ఎన్‌డిఎ వైపునే నిలబడడం గమనార్హం. ఈ రాష్ట్ర జనాభాలో 17 శాతం మంది దళితులే. ముస్లిములు, యాదవులు– ఈ రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఇప్పటికీ, రాష్ట్రీయ జనతాదళ్‌ వెనుకే ఉన్నాయి. అదే సమయంలో, లాలూ–రబ్డీ పాలన ఆ పార్టీకి అనేక శ్రేణులను వ్యతిరేకులను చేసింది. బిజెపి, జనతాదళ్‌–యు తమ ఎన్నికల ప్రచారాన్ని లాలూప్రసాద్‌ పాలనపై గురిపెట్టాయి. అది ఎంతవరకు పనిచేస్తుందన్నది ప్రశ్నార్థకమే. 2015లో నితీశ్‌కుమార్‌, ఆర్‌జెడితో కలసి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. తరువాత, కూటమి మార్చి తానే ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ ఎన్నికలలో లాలూప్రసాద్‌ పార్టీకి వచ్చిన ఓట్లు తక్కువేమీ కాదు. ఆ తరువాత ఆయన మీద కేసులన్నీ త్వరితగతిన ముగింపునకు వచ్చి, మూడేళ్లుగా జైలులో ఉన్నారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో ఆర్‌జెడి కూటమి ఒక్క స్థానం కూడా గెలవకుండా, ఘోరంగా ఓడిపోయింది. అప్పటి రాజకీయ వాతావరణం, ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలు వేరు. ఇప్పటి ఎజెండాలు వేరు. అయినా ఎంతమందికి, పదిహేనేళ్ల కిందటి ‘దుష్పరిపాలన’ గుర్తుంటుంది? బిహార్‌ ఓటర్లలో 24 శాతం ఓటర్లు 29 ఏళ్ల లోపు వయస్సు వారేనట. వారికి పదిహేనేళ్ల కిందటి ప్రభావాలు ఉంటాయని భావించలేము. అన్నిటికి మించి లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తండ్రి పేరు చెప్పుకోవడం మానేశారు. అతను ఎన్నికల ప్రచారం కోసం ప్రచురించిన పోస్టర్లలో లాలూ కానీ, రబ్డీ కానీ కనిపించడం లేదు. ఒక్కడే, తేజస్వి, నూతన యువ బిహార్‌ కోసం ప్రయత్నిస్తున్న నాయకుడిగా రంగంలోకి దిగుతున్నాడు. 


మొత్తం 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీకి జనతాదళ్‌ (యు), బిజెపి చెరి 119 స్థానాలకు, మాంఝి పార్టీ ఐదు స్థానాలకు పోటీ చేస్తాయని భావిస్తున్నారు. జెడి(యు), బిజెపిలకు ప్రస్తుతం 71, 53 స్థానాలున్నాయి. మహాగట్‌బంధన్‌లో రాష్ట్రీయ జనతాదళ్‌ 144, కాంగ్రెస్‌, వామపక్షాలు 29 చొప్పున పోటీ చేయడానికి అంగీకారం కుదిరింది. 


చిరాగ్‌ పాశ్వాన్‌ నుంచి తేజస్వి యాదవ్‌ దాకా బిహార్‌లో పెరిగిపోయిన నిరుద్యోగాన్ని, కరోనా కట్టడిలో నితీశ్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సుపరిపాలన అన్న అంశానికి ఉన్న ఆకర్షణ తగ్గిపోయినట్లే కనిపిస్తున్నది. ఒక వేళ ఆర్జేడీ గెలిస్తే మళ్లీ కిడ్నాపుల రాజ్యం, హింసారాజ్యం వస్తుందని ఎంతగా భయపెట్టినా, అది కలసి వస్తుందో రాదో తెలియదు. అందుకే నితీశ్‌ను గెలిపించడానికి ఉద్వేగాల సహాయం కూడా అందించాలని బిజెపి ప్రయత్నిస్తున్నది. గాల్వన్‌ సంఘటనలో ఉన్న భారతీయ దళం బిహార్‌ రెజిమెంట్‌ (అది రెజిమెంట్‌ పేరు మాత్రమే, ఆ వీర సైనికులు అనేక ప్రాంతాల వారు, బిహారీలు కారు) కావడాన్ని కూడా భావోద్వేగాల వైపు కొందరు మళ్లించారు. ఆ తరువాత దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న యువనటుడు సుశాంత్‌ బిహారీ అయినందువల్ల, ఆయనను బిహారీ చిహ్నంగా మలచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమయినా, పదిహేనేళ్ల పాలనపై ఏర్పడే సహజవ్యతిరేకతా, పదిహేనేళ్ల కిందటి దుష్పరిపాలన గురించిన భయమా– ‌ఏది విజేత అన్నదే బిహార్‌ ఎన్నికలలోని ప్రహేళిక.

Updated Date - 2020-10-06T05:57:06+05:30 IST