రేప‌టి నుంచి ఇంటింటికీ క‌రోనా వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం షురూ!

ABN , First Publish Date - 2021-06-13T11:36:54+05:30 IST

రాజస్థాన్‌లోని బికనీర్‌లో క‌రోనా వ్యాక్సినేష‌న్ మమ్మ‌రంగా జ‌రుగుతోంది.

రేప‌టి నుంచి ఇంటింటికీ క‌రోనా వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం షురూ!

బిక‌నీర్‌: రాజస్థాన్‌లోని బికనీర్‌లో క‌రోనా వ్యాక్సినేష‌న్ మమ్మ‌రంగా జ‌రుగుతోంది. ఈ విష‌యంలో దేశానికే ఈ న‌గ‌రం స్ఫూర్తిగా నిల‌వ‌నుంది. న‌గ‌రంలోని 45 ఏళ్లు, అంత‌కు మించిన వ‌య‌సు క‌లిగిన వారంద‌రికీ ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసే కార్య‌క్ర‌మం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రజల ఇళ్లకు వ్యాక్సిన్‌లను అందించడానికి రెండు అంబులెన్స్‌లు, మూడు మొబైల్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. దీనికి అదనంగా జిల్లా యంత్రాంగం ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించేందుకు హెల్ప్‌లైన్‌గా వాట్సప్ నెంబరును జారీ చేసింది. దీనిలో న‌గ‌ర‌పౌరులు తమ పేరు, చిరునామా ఇవ్వడం ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిని పరిశీలించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. బికనీర్ న‌గ‌రం రాష్ట్ర రాజధాని జైపూర్‌కు 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్క‌డ 16 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 


ఈ కేంద్రాలలోని వైద్యులకు ఆయా ప్రాంతాల‌లో టీకాలు వేయించుకున్న‌వారి వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు అందుతాయి. త‌ద్వారా వారు ఎవ‌రికైనా ఎటువంటి దుష్ప్రభావాలు క‌నిపించినా త‌క్ష‌ణం వైద్య స‌హాయం అందిస్తారు. ఈ సంద‌ర్భంగా బికనీర్ కలెక్టర్ అమిత్ మెహతా మీడియాతో మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం నగరంలో ఏడు లక్షలకు పైగా జనాభా ఉందని, వీరిలో సుమారు 60 నుంచి 65 శాతం జ‌నాభాకు ఇప్పటికే టీకాలు వేసినట్లు తెలిపారు.  న‌గ‌రంలో సుమారు 3 లక్షల 69 వేల మంది టీకాలు వేయించుకున్నార‌న్నారు. బిక‌నీర్‌ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 40,118 క‌రోనా కేసులు నమోదు కాగా, మొత్తం 527 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 453 క‌రోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2021-06-13T11:36:54+05:30 IST