మహిళల్లో చైతన్యం కోసం బైక్‌ మీద దేశం చుట్టి...

ABN , First Publish Date - 2021-12-06T05:30:00+05:30 IST

టూ వీలర్‌ నడపడం కూడా ఒక లైఫ్‌ స్కిల్‌. స్వతంత్రంగా ప్రయాణించడంతో పాటు స్వయంస్వావలంబన సాధించవచ్చు. ....

మహిళల్లో చైతన్యం కోసం బైక్‌ మీద దేశం చుట్టి...

టూ వీలర్‌ నడపడం కూడా ఒక లైఫ్‌ స్కిల్‌. స్వతంత్రంగా ప్రయాణించడంతో పాటు స్వయంస్వావలంబన సాధించవచ్చు. అవసరమైతే దాన్నే భృతిగానూ మార్చుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవచ్చు. కాబట్టే ఈ దిశగా మహిళల్లో అవగాహనను పెంచడం కోసం హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌, రైడర్‌ అద్దేపల్లి జై భారతి  మోటర్‌సైకిల్‌ మీద ‘మూవింగ్‌ బౌండరీస్‌’ పేరుతో 11,111 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఆ ప్రయాణ అనుభవాలు ఆమె మాటల్లోనే...


మెన్‌ బైకర్స్‌ క్లబ్‌(2013) పెట్టినప్పటి నుంచీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా. 2019లో మూవింగ్‌ విమెన్‌ సోషల్‌ ఇనీషియేటివ్స్‌ (మోవో) స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచీ దాని ద్వారా హైదరాబాద్‌ మహిళలకు టూ వీలర్‌, త్రీ వీలర్‌ డ్రైవింగ్‌ నేర్పిస్తున్నా. అయితే డ్రైవింగ్‌తో మహిళలకు దక్కే ప్రయోజనాల గురించి, జీవితాలను మెరుగు పరుచుకోగలిగే అవకాశాల గురించి దేశవ్యాప్త అవగాహన కల్పించడం కోసం మూవింగ్‌ బౌండరీస్‌ పేరుతో సోలో జర్నీ మొదలుపెట్టాను. అలా అక్టోబరు 11న హైదరాబాద్‌లో బయల్దేరి దేశవ్యాప్తంగా ఉన్న 22 ప్రదేశాలను చుడుతూ, నవంబరు 26న తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాను. ఈ ప్రయాణంలో ఎన్‌జీవోలలో వర్క్‌షాపులను నిర్వహించి, డ్రైవింగ్‌ పట్ల మహిళల్లో ఉన్న భయాలను పోగొట్టే ప్రయత్నం చేశాను. మహిళలు డ్రైవింగ్‌ నేర్చుకోవడంతో పాటు, దాన్నొక జీవనభృతిగా కూడా చేసుకోవాలనేది నా ప్రచారం ఉద్దేశం. డ్రైవింగ్‌తో ఉండే ఉద్యోగావకాశాలు, కెరీర్‌గా స్థిరపడగలిగే అవకాశాల పట్ల ఈ ప్రయాణంలో అవగాహన కల్పించాను. 


జావా మీద జాలీగా... సోలో జర్నీ

ఈ జర్నీలో నేను మోటర్‌ సైకిల్‌ నడుపుతూ ఉంటే, ప్రొడక్షన్‌ హౌస్‌ బృందం స్కార్పియో వాహనంలో నన్ను వెంబడిస్తూ, ఈ ప్రయాణాన్నంతటినీ డాక్యుమెంటరీగా రూపొందించింది. 46 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణంలో విడతల వారీగా విరామం తీసుకుంటూ డ్రైవ్‌ చేశాను. ఒకసారి ఒక్క రోజులో ఏకంగా 563 కిలోమీటర్లు డ్రైవ్‌ చేశాను. ఈ ప్రయాణాన్నంటినీ షెల్‌ ఫౌండేషన్‌ స్పాన్సర్‌ చేసింది. నేను నడిపిన టూ వీలర్‌ను జావా కంపెనీ స్పాన్సర్‌ చేసింది. కొత్త వెహికల్‌ ఏదైనా 20 వేల కిలోమీటర్ల వరకూ ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతుంది. కాబట్టి ప్రతి ప్రయాణానికీ కొత్త టు వీలర్‌ను ఎంచుకుంటూ ఉంటాను. అయితే సాధారణంగా 500 సిసి మోటార్‌సైకిల్‌కు ప్రాధాన్యం ఇచ్చే నేను మూవింగ్‌ బౌండరీస్‌ ప్రచారం కోసం జావా 42 టు వీలర్‌ను ఎంచుకోవడం వెనక ఒక కారణం ఉంది. జావా టు వీలర్‌ పురుషులతో పాటు మహిళలను ఉద్దేశించి తయారుచేసినది. ఇతర రాష్ట్రాల్లో జావా షోరూమ్‌లన్నీ శక్తి, సీమా... ఇలా మహిళల పేర్లతోనే ఉన్నాయి. పైగా ఆ స్టోర్‌ మేనేజర్లు కూడా మహిళలే! కాబట్టి మహిళలను డ్రైవింగ్‌ వైపు తేలికగా ఆకర్షించవచ్చనే ఆలోచనతోనే జావాను ఎంచుకున్నాను. ఇప్పుడిప్పుడే మహిళలకు ఇలాంటి గేర్‌ వెహికల్స్‌ మీద ఆసక్తి ఏర్పడుతోంది. ఇది స్వాగతించవలసిన విషయం. 


ప్రయాణం సాగిందిలా....

ఇప్పటివరకూ వేర్వేరు ప్రయాణాలతో 7 దేశాలు చుట్టి వచ్చాను. ఇప్పటివరకూ మొత్తం లక్షకు పైగా కిలోమీటర్లు డ్రైవ్‌ చేశాను. మూవింగ్‌ బౌండరీస్‌ కోసం బెంగళూరు నుంచి చెన్నై, కొచ్చి, ఉడిపి, గోవా, ముంబయి, అహ్మదాబాద్‌, ఉదయ్‌పూర్‌, జైపూర్‌, అమృత్‌సర్‌, శ్రీనగర్‌, చండీఘడ్‌, న్యూఢిల్లీ, లక్నో, అలహాబాద్‌, పాట్నా, గౌహటి, కోల్‌కతా, రాంచి, భువనేశ్వర్‌ల మీదుగా తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాను. 


డ్రైవింగ్‌తో స్వయంస్వావలంబన సాధ్యమే!

ఎలాంటి మెకానికల్‌ వాహనాన్ని నడిపించినా ఆత్మస్థైర్యం దానంతట అదే పెరుగుతుంది. వాహనం నడపడం వస్తే, అది కచ్చితంగా అదనపు అర్హతగా మారుతుంది. ఉద్యోగాలకు సొంత వాహనం నడుపుకుంటూ వెళ్లడంతో పాటు, పిల్లలను స్కూళ్ల దగ్గర దింపడం, సొంత పనులు చేసుకోవడం ద్వారా మహిళలు తమ పనుల కోసం ఇతరుల మీద ఆధారపడే అవసరం తప్పుతుంది. ఉన్నత విద్యలు చదవని మహిళలకు డ్రైవింగ్‌ భృతిగానూ తోడ్పడుతుంది. ఇతర మహిళలకు డ్రైవింగ్‌ నేర్పించడానికి కూడా బైక్‌ డ్రైవింగ్‌ మహిళలకు ఉపయోగపడుతుంది. 




మర్చిపోలేని అనుభవం

బైక్‌ డ్రైవింగ్‌ గేర్‌ ధరించినప్పుడు నడిపే వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టడం కష్టం. సూరత్‌లో డ్రైవ్‌ చేస్తున్నప్పుడు, పోలీసులు నన్ను ఆపారు. నేను నడుపుతున్నది ఫ్యాక్టరీ బైక్‌. దానికి ఎర్ర రంగు నంబర్‌ ప్లేట్‌ ఉంది కాబట్టి, డాక్యుమెంట్లను పరీక్షించడం కోసం ఆపారని అనుకున్నాను. అయితే ఆపిన పోలీసు నా భుజం మీద చేయి వేసి, వెనక కూర్చుంటూ... ‘తమ్ముడూ, కొద్దిగా ముందుకు తీసుకెళ్లి దింపు’ అన్నాడు. నేను మహిళనని అతను గ్రహించలేదని నాకు అర్థమైంది. అప్పుడు నేను హెల్మెట్‌ అద్దం పైకెత్తి ‘అలాగే సార్‌’ అన్నాను. దాంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురై, క్షమాపణ చెబుతూ వెహికల్‌ మీద నుంచి కిందకు దూకినంత పని చేశాడు. దానికి నేను ‘ఫర్వాలేదు, కూర్చోండి, దింపేస్తాను’ అని చెప్పి, అతను అడిగిన చోట డ్రాప్‌ చేశాను. ప్రయాణ బడలికను దూరం చేసే ఇలాంటి వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. 

                                                                                                 గోగుమళ్ల కవిత

Updated Date - 2021-12-06T05:30:00+05:30 IST