15రోజులు.. రూ.30లక్షలు హెల్మెట్‌పై స్పెషల్‌ డ్రైవ్‌లో జరిమానా

ABN , First Publish Date - 2021-01-17T05:16:05+05:30 IST

రోడ్డుభద్రతను పెంచేందుకు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేయాలని ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశించారు. ఈ నెల ప్రారంభం నుంచి 15వ తేదీ వరకు హెల్మెట్‌ నిబంధనలు పాటించని 17,362 మంది వాహనదారులకు రూ.29.66 లక్షలు జరిమానా విధించామని సీపీ తెలిపారు.

15రోజులు.. రూ.30లక్షలు హెల్మెట్‌పై స్పెషల్‌ డ్రైవ్‌లో జరిమానా
హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తున్న ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ (ఫైల్‌)

ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలి

రోడ్డు ప్రమాదాలపై ఖమ్మ సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ టెలీకాన్ఫరెన్స్‌

ఖమ్మం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రోడ్డుభద్రతను పెంచేందుకు  ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేయాలని ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశించారు. ఈ నెల ప్రారంభం నుంచి 15వ తేదీ వరకు హెల్మెట్‌ నిబంధనలు పాటించని 17,362 మంది వాహనదారులకు రూ.29.66 లక్షలు జరిమానా విధించామని సీపీ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరుతెన్నులపై ఆయన శనివారం పోలీసు అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15రోజుల్లో 47రోడ్డు ప్రమదాలు జరిగాయాని ఆయా ప్రమాదాల్లో 15 మంది  మృతి చెందగా 47 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇది దురదృష్టకరమైన పరిణామమన్నారు. ముఖ్యంగా బైక్‌ ప్రమాదాలతో తలకు తగిలిన చిన్న గాయాలతో ఎక్కువశాతం మృత్యువాత పడుతున్నారన్నారు. గాయాలపాలైనవారు కోలుకోవడానికి ఆస్తులు అమ్ముకుని అప్పులపాలు కావడంతోపాటు తమపై ఆధారపడిన కుటుంబాలను కష్టాల సుడిగుండాల్లోకి నెడుతున్నారని తెలిపారు. ఈ నెల 10నుంచి 15 వరకు హెల్మెట్‌ నిబంధనలు పాటించని 1,034 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించి అవగాహన కల్పించినట్టు తెలిపారు. హెల్మెట్‌ ధరించని వాహనాలపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ కొందరిలో మార్పులు రావడంలేదన్నారు. అందుకోసమే వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి హెల్మెట్‌ ధరించే అవసరాలపై స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా పోలీసు అధికారులు ప్రాచారం నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారన్నారు. 2020లో జిల్లాలో 732 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 274 మంది మృతిచెందారనీ, 667 మంది గాయపడినట్టు తెలిపారు. 2,46,708 వాహనాలపై రూ.3.85కోట్ల జరిమానా విధించినట్టు తెలిపారు. ప్రమాదాల్లో చనిపోయిన వారిలో కేవలం హెల్మెట్‌ లేని కారణంగా 96మంది మృతిచెందగా.. 179 మంది గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు. అత్యధికశాతం ప్రమాదాలు మోటారుసైకిళ్ల ప్రమదాలే ఉండటంతో అధికారులు మోటారుసైకిళ్ల ప్రమదాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రాష్ట్ర పోలీసు శాఖ ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల రక్షణ అనే రెండు అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు వీలుగా జిల్లాలో హెల్మెట్‌ ధారణ ఖచ్చితంగా అమలు చేసేందుకు ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనదారులందరూ తప్పకుండా హెల్మెట్‌ ధరించి రోడ్లపైకి రావాలని, తద్వారా ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-01-17T05:16:05+05:30 IST