నేటి నుంచి షష్ఠి ఉత్సవాల ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-08T05:22:49+05:30 IST

కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు కొలుస్తారు. ప్రతిఏటా బిక్కవోలులో స్వామి వారి షష్ఠి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

నేటి నుంచి షష్ఠి ఉత్సవాల ప్రారంభం
బిక్కవోలులోని ప్రాచీన ఆలయాల సముదాయం

  బిక్కవోలు, డిసెంబరు 7: కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు కొలుస్తారు. ప్రతిఏటా బిక్కవోలులో స్వామి వారి షష్ఠి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 8 నుంచి 15 వరకూ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 9న షష్ఠి ఉత్సవం జరుపుతామన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా విద్యుత్‌ దీపాలతో అలంకరించగా, చలువ పందిరి వేసి ఆకట్టుకునే విధంగా విభిన్న ఆకృతులతో తీర్చిదిద్దారు. గ్రామంలోని ప్రధాన రహదారికిరువైపులా విద్యుత్‌ దీపాలంకరణతో పాటు ప్రధాన కూడళ్లలో భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. 9వ తేదీ రాత్రి పది గంటల నుంచి తెల్లవారేవరకూ స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో బాణసంచా పోటీలు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకూ షష్ఠి కళా వేదికపై ప్రతి రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
భారీ వాహనాల రాకపోకలు బంద్‌
షష్ఠి సందర్భంగా ఈనెల 8 నుంచి 11 వరకూ బిక్కవోలులోని ప్రధాన రహదారి మీదుగా వెళ్లే భారీ వాహనాల రాకపోకలను బంద్‌ చేసినట్టు ఎస్‌ఐ పి.వాసు తెలిపారు. బిక్కవోలు నుంచి జి. మామిడాడ వెళ్లే వాహనాలను బలభద్రపురం మీదుగా తొస్సిపూడి, పందలపాక, ఊలపల్లి మీదుగా వెళ్లాలని, అలాగే జి.మామిడాడ నుంచి బిక్కవోలు మీదుగా రాజమహేంద్రవరం వెళ్లే వాహనాలు ఊలపల్లి, పందలపాక, తొస్సిపూడి, బలభద్రపురం మీదుగా వెళ్లాలన్నారు.

Updated Date - 2021-12-08T05:22:49+05:30 IST