ఉక్రెయిన్‌లో బిక్కు బిక్కు

ABN , First Publish Date - 2022-02-26T05:05:16+05:30 IST

రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసించడానికి వెళ్లిన పాలమూరు విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు.

ఉక్రెయిన్‌లో బిక్కు బిక్కు
జప్రోజియాలో ఎంబీబీఎస్‌ చదువుతున్న కూతురు అక్షతతో ఫోన్‌లో మాట్లాడుతున్న మక్తల్‌కు చెందిన తల్లిదండ్రులు

అక్కడి యూనివర్సిటీల్లో పాలమూరు విద్యార్థులు

మెడిసిన్‌ చదువుతున్న 25 మంది 

ఉక్రెయిన్‌ రాజధానికి 600 కిలో మీటర్ల దూరంలో ఆ వర్సిటీలు

ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనట్లే

కానీ ఏటీఎంలలో డబ్బులు నిల్‌

కరెంట్‌ కట్‌ చేస్తామని హెచ్చరికలు

నిత్యావసర సరకుల నిల్వలు

ఆందోళనలో తల్లిదండ్రులు

సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వాలకు వినతి


రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసించడానికి వెళ్లిన పాలమూరు విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన చాలామంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో వైద్య విద్యకు ఖర్చు తక్కువగా ఉండడం, ఆ డిగ్రీలకు మనదేశంతో పాటు యూరప్‌ దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియాల్లోని మెడికల్‌ కౌన్సిల్స్‌ నుంచి అనుమతి ఉండడంతో అక్కడ చదివేందుకు విద్యార్థులు వెళ్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారు. బయటకు రావాలంటే విమాన సర్వీసులు కూడా రద్దు చేశారని, ప్రభుత్వం కలుగజేసుకొని తమ పిల్లల్ని వెనక్కి తీసుకరావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతిప్రతినిధి


 మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. దానిపై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో తమ పిల్లలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వాళ్ల ఫోన్లు కలవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉక్రెయిన్‌లోని జప్రోజియా, ఒడెస్సా నేషనల్‌ మెడికల్‌ కాలేజీల్లో, డెనిఫ్రో యూనివర్సిటీల్లో విద్యార్థులు ఎంబీబీఎస్‌ చదువు తున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు వేముల అక్షయ్‌ కుమార్‌రెడ్డి ఒడె స్సా నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీ బీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అక్కడే గద్వాల జిల్లా జెల్లాపురా నికి చెందిన వనపర్తి కోర్టులో ఉద్యోగిగా పనిచేసే వీర వసంత్‌ కుమారుడు ఉదయ్‌ కుమార్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. వీరితో పాటు జడ్చర్లకు చెందిన కొమ్ము శ్రీనివాస్‌యాదవ్‌ కుమార్తె యోజిత ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు ఈ ఒడెస్సా నగరం 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదం కనిపించడం లేదు. అయితే ఇప్పటికే నిత్యావసర వస్తువులు, డబ్బులు, తాగునీరు నిల్వ చేశారని, తామంతా హాస్టళ్లలోనే ఉంటున్నామని, ఏటీఎంలలో డబ్బు అయిపోయిందని, కరెంటు కూడా కట్‌ చేస్తారని అంటున్నారని తమ పిల్లలు చెప్పారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ పిల్లల్ని ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తేవాలని కోరారు.

ఉక్రెయిన్‌లోని జిప్రోజియా యూనివర్సిటీలో మహబూబ్‌నగర్‌కు చెందిన సత్యనారాయణ కూమార్తె సాయిస్పందన ఎంబీబీఎస్‌ చదువుతోంది. అక్కడే మక్తల్‌ నియోజకవర్గం నేరేడ్‌గాంకు చెందిన శివరామ్‌ కుమార్తె అక్షిత ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం, నారాయణపేట మండలం కోటకొండకు చెందిన చుక్క రమేష్‌బాబు తనయుడు చుక్క సాయివికాస్‌ ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. జడ్చర్ల మండలం ఈర్లపల్లికి చెందిన రెడ్డి వెంకట కృష్ణారెడ్డి తనయుడు స్పుత్నిక్‌రెడ్డి డినిఫ్రో యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ప్రస్తుతం స్పుత్నిక్‌రెడ్డి తల్లిదండ్రులు సౌత్‌ ఆఫ్రికాలో ఉంటున్నారు. తాత రాఘవరెడ్డి ఈర్లపల్లిలో ఉంటున్నారు. ఈ విద్యార్థి బయటకు రావాలంటే ప్లైట్‌ టిక్కెట్లకు రూ.2.50 లక్షలు అడిగారని, అయినా టిక్కెట్‌ కన్‌ఫర్మ్‌ కావడం లేదని తాత తెలిపారు. వీరితో పాటు గద్వాల జిల్లాకు చెందిన మరో నలుగురు విద్యార్ధులు, నారాయణపేట జిల్లాకు చెందిన నలుగురు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. వారిని తక్షణం వెనక్కి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 


క్షేమంగానే ఉన్నాం

మక్తల్‌/నాగర్‌కర్నూల్‌ టౌన్‌: వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్‌ దేశానికి వెళ్లిన నారాయణపేట, నాగర్‌క ర్నూల్‌ జిల్లాలకు చెందిన విద్యార్థులు క్షేమంగా ఉన్నట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. మాగనూరు మండలం నేరడ్‌ గామ్‌ గ్రామానికి చెందిన అక్షత తల్లిదండ్రులు ప్రియాంక, శివరాంలతో ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం మాట్లాడింది. తమ కూతురు అక్షత ఉక్రెయిన్‌ దేశం లోని జప్రోజియా నగరంలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతుందని, రోజూ ఫోన్‌లో మాట్లాడుతున్నామని చెప్పారు. తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపిందని, పక్షం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు నిల్వ ఉన్నాయని చెప్పిందన్నారు. కేంద్రం భారతీయులం దరినీ సురక్షితంగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తుందని వివరించిందని అన్నారు. 


300 కిలో మీటర్ల దూరంలో...

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చెం దిన వెంకట సాయి రాంరెడ్డి ఉక్రేయిన్‌ లోని ఎంబీబీఎస్‌ మూడో సంవ త్సరం చదువుతున్నట్లు అత ని తండ్రి రమేష్‌ రెడ్డి తెలిపారు. అతనికి ఫోన్‌ చేయగా సురక్షి తంగానే ఉన్నట్లు చెప్పారన్నారు. అతను ఉంటు న్న విన్నిస్టా నగరం యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి 300 కిలో మీటర్ల దూరంలో ఉందని తెలిపారు.

Updated Date - 2022-02-26T05:05:16+05:30 IST