రైతులకు పరిహారం ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులా?

ABN , First Publish Date - 2021-08-03T06:34:49+05:30 IST

రైతులకు పరిహారం ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

రైతులకు పరిహారం ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులా?
బస్వాపురం పనులను పరిశీలిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

బస్వాపురం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన నాయకులు

భువనగిరి రూరల్‌, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం), ఆగస్టు 2: రైతులకు పరిహారం ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బస్వాపురం రిజర్వాయర్‌, తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువు, ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న బునాదిగాని కాల్వను పార్టీ నాయకులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం ఎత్తిపోతల్లో భా గంగా భూములు కోల్పోయిన బస్వాపూర్‌, బీఎన్‌.తిమ్మాపూర్‌, లప్పానాయక్‌తండా రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. భూసేకరణ పేరుతో రైతుల అసైన్డ్‌, పట్టా భూములను బలవంతంగా లాక్కొని ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టడం సరికాదన్నారు. నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించాకే పనులను ప్రారంభించాలని, రైతులను ఇబ్బందిపెడితే సహించేదిలేదని హెచ్చరించారు. బస్వాపూర్‌ ను రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఐదేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకే కాలయాపన చేస్తోందని, ఇలాగైతే పదేళ్లయినా ప్రాజెక్టు పూర్తికాదన్నారు. ఇది మాటల ప్రభుత్వమేకాని చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. బునాదిగాని కాల్వ పనులు ప్రారంభించి 23ఏళ్లు గడిచినా నేటికీ పూర్తికాలేదన్నారు. మొత్తం 98కిలోమీటర్ల పొడవు కాల్వలో ఇంకా 43కిలోమీటర్ల మేర అసంపూర్తిగానే ఉందన్నారు. నెల రోజుల్లోగా నిధులు కేటాయించి పాత అలైన్‌మెంట్‌ ప్రకారం కాల్వ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. లేదంటే పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం నీటి పారుదలశాఖ ఈఈ వేణుగోపాల్‌, డీఈఈ సునీల్‌ ప్రసాద్‌ను కలిసి కాల్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న 7651 మంది ఫీల్డు అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయనకు ఆత్మకూరు(ఎం)లో మండల ఫీల్డు అసిస్టెంట్లు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాల్లో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కె.శ్రీనివా్‌సరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, నాయకులు దామోదర్‌రెడ్డి, బోలగాని సత్యనారాయణ ఏశాల అశోక్‌, ఎండి.ఇమ్రాన్‌, ముదిగొండ రాములు, శోభన్‌బాబు, తుర్కపల్లి పార్టీ మండల కార్యదర్శులు సిలివేరు దుర్గయ్య, అన్నెమైన వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:34:49+05:30 IST