మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగినితో బిల్‌గేట్స్‌కు సంబంధం!

ABN , First Publish Date - 2021-05-18T05:55:35+05:30 IST

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తన భార్యతో విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో అతని వ్యక్తిగత వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్‌ నెరిపిన అక్రమ సంబంధం

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగినితో బిల్‌గేట్స్‌కు సంబంధం!

20 ఏళ్ల నాటి వ్యవహారం.. 

2019లో మైక్రోసాఫ్ట్‌ దృష్టికి  

దర్యాప్తు జరిపిన కంపెనీ.. 

విచారణ పూర్తికాక ముందే కంపెనీ బోర్డుకు గేట్స్‌ గుడ్‌బై 


న్యూయార్క్‌: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తన భార్యతో విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో అతని వ్యక్తిగత వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్‌ నెరిపిన అక్రమ సంబంధం తాజాగా చర్చనీయాం శమైంది. రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్‌ బోర్డు నుంచి బిల్‌గేట్స్‌ తప్పుకోవడం కొసమెరుపు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన ఈ తాజా కథనం వివరాల్లోకి వెళ్తే.. 2019 ద్వితీయార్ధంలో మైక్రోసాఫ్ట్‌ బోర్డుకు ఓ లేఖ అందింది. బిల్‌గేట్స్‌ కొన్నేళ్లపాటు తనతో శారీరక సంబంధం నెరిపారంటూ మైక్రోసాఫ్ట్‌ మహిళా ఇంజనీరు ఒకరు ఆ లేఖలో ఆరోపణలు చేశారు. దాంతో కంపెనీ బోర్డు ఓ న్యాయవాద సంస్థ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించారు. రాసలీలల ఆరోపణల నేపథ్యంలో బిల్‌గేట్స్‌ బోర్డులో కొనసాగడం తగదని కొందరు డైరెక్టర్లు భావించారు. అయితే దర్యాప్తు పూర్తి చేసి, తుది నిర్ణయం తీసుకునే లోపే గేట్స్‌ బోర్డు నుంచి తప్పుకున్నారు. 


మరోవైపు ఇరవై ఏళ్ల నాటి ఈ వ్యవహారం సామరస్యంగానే పరిష్కారమైందని.. బోర్డు నుంచి వైదొలగడానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి పేర్కొన్నారు. దర్యాప్తులో ఏం తేలిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. దాతృత్వ కార్యక్రమాల కోసం మరింత సమయం వెచ్చించేందుకు మైక్రోసాఫ్ట్‌ బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు 2020 మార్చిలో బిల్‌గేట్స్‌ ప్రకటించారు. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బిల్‌గేట్స్‌, మిలిండా గేట్స్‌ ఈనెల తొలినాళ్లలో ప్రకటించారు. ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే, వీరిద్దరూ కలిసి ‘మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థను నడుపుతున్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ ఫౌండేషన్‌ ప్రపంచంలోని అతిపెద్ద చారిటీ సంస్థల్లో ఒకటి. ఈ ఫౌండేషన్‌లో మాత్రం కలిసి పనిచేయనున్నట్లు వారు స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-18T05:55:35+05:30 IST