ఈ గ్రహశకలంతో భూమి గుట్టు వీడనుందా?

ABN , First Publish Date - 2021-05-14T00:10:48+05:30 IST

అంతరిక్షం మనకు ఎప్పటికీ అద్భుతమే. తలపైకెత్తి ఆకాశంవైపు చూసే ప్రతిసారి ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు

ఈ గ్రహశకలంతో భూమి గుట్టు వీడనుందా?

న్యూఢిల్లీ: అంతరిక్షం మనకు ఎప్పటికీ అద్భుతమే. తలపైకెత్తి ఆకాశంవైపు చూసే ప్రతిసారి ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు మెదళ్లను తొలుస్తుంటాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 4.5 బిలియన్ సంవత్సరాల నాటి గ్రహశకలం బెన్నూ ఫొటోను పోస్టు చేసి ఆసక్తి రేకెత్తించింది. దీనిపై బోల్డన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటూ కొన్ని వివరాలను కూడా పంచుకుంది.    


‘‘ఆగండి: 4.5 బిలియన్ సంవత్సరాల నాటి ఉల్క దాటుతోంది. నాసా సోలార్ సిస్టం ఓఎస్ఐఆర్ఐఎస్‌రెక్స్ అంతరిక్ష నౌక నుంచి తీసిన బెన్నూ వాస్తవ చిత్రాన్ని చూస్తున్నారు. దాదాపు ఐదేళ్లపాటు అంతరిక్షంలో ఉన్న ఓఎస్ఐఆర్ఐఎస్-రెక్స్ మిషన్ ఈ పురాతన గ్రహం రాళ్లు, ధూళి నమూనాలతో భూమిపైకి వస్తోంది. 2023లో ఈ నమూనాలు భూమిపైకి చేరుకుంటాయి. అక్కడి నుంచి అవి నాసా జాన్సన్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలలకు చేరుతాయి. వీటిని అధ్యయనం చేయడం ద్వారా సౌరవ్యవస్థ ఎలా ఏర్పడింది? భూమి నివాస యోగ్యంగా ఎలా మారిందన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు’’ అని నాసా ఆ పోస్టులో పేర్కొంది.  


ఇప్పటి వరకు ఆవిష్కరించని సాంకేతికతతో భవిష్యత్ తరాలు అధ్యయనం చేసేందుకు భూమికి చేరుకున్న నమూనాల్లో 75 శాతాన్ని పక్కనపెడతామని నాసా వివరించింది. నాసా నిన్న ఈ పోస్టు చేయగా 1.7 మిలియన్ లైకులు వచ్చాయి. అంతేకాదు, బోల్డన్ని స్పందనలు కూడా వచ్చాయి. ఈ గ్రహశకలాన్ని చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. మరికొందరు ప్రశ్నలతో హోరెత్తించారు.  


అసలు ఈ బెన్నూ అంటే ఏమిటి? అన్న ఓ యూజర్ ప్రశ్నకు నాసా ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. నార్త్ కరోలినాకు చెందిన 9 సంవత్సరాల బాలుడు 2013లో జరిగిన ఆస్ట్రాయిడ్ కాంపిటిషన్‌లో  బెన్నూ అని పేరు పెట్టాడని పేర్కొంది. అంతరిక్ష నౌక టచ్ అండ్ గో శాంపిల్ మెకానిజం (టీఏజీఎస్ఏఎం) చేయి, సౌర ఫలకాలు.. బెన్నూలా మెడ, రెక్కలను పోలి ఉండాలని సూచించడం ద్వారా  మైఖేల్ పుజియో ఈ పోటీలో విజయం సాధించాడు. బెన్నూ అనేది సూర్యుడితో సంబంధం ఉన్న పురాతన ఈజిప్టు దేవత అని నాసా ఇచ్చిన సమాధానం అందరినీ కట్టిపడేసింది.

Updated Date - 2021-05-14T00:10:48+05:30 IST