బిల్లులు ఇవ్వరు.. ప్రోగ్రెస్‌ కావాలంటారు..!?

ABN , First Publish Date - 2021-09-19T05:45:14+05:30 IST

ప్రభుత్వం జిల్లాలో పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో ప్రధానమైనది జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు.

బిల్లులు ఇవ్వరు..  ప్రోగ్రెస్‌ కావాలంటారు..!?
మనుబోలు : జగనన్న లే అవుట్‌లో బేస్‌మట్టం వరకే జరిగిన ఇంటి నిర్మాణం

క్షేత్రస్థాయి అధికారులపై ఉన్నతాధికారుల ఒత్తిళ్లు

హౌసింగ్‌, సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్‌లు.. అన్నీ అరకొరే

బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు

డబ్బుల్లేక ఇళ్లు కట్టుకోలేకపోతోన్న పేదలు

నిర్మాణాలు పూర్తి చేయించాలంటూ సిబ్బందిపై ఒత్తిడి

బయటకు చెప్పుకోలేక మానసికంగా నలిగిపోతోన్న వైనం


‘జిల్లాలో ఏర్పాటు చేసిన జగనన్న ఇళ్ల లేఅవుట్లలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకొని ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతంగా చేపట్టాలి. స్టీల్‌, సిమెంటు, ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేస్తున్నాం. ఎక్కడైనా ఆలస్యమైతే లబ్ధిదారులు అధైర్య పడకుండా చూడాలి. తప్పకుండా మంజూరవుతాయని చెప్పండి. ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులంతా అవగాహన కల్పించాలి.’ ఓ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఇటీవల జిల్లాలో అధికారుల సమీక్షలో మాట్లాడిన మాటలివి. 


‘ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబరు 15వ తేదీలోపు బేస్‌మెంట్‌లెవల్‌కు తీసుకురావాలి. ఇందుకు సంబంధించి మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదు. అన్ని జిల్లాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో మాత్రం వేగం పుంజుకోవడం లేదు. వచ్చే వారంలో మెగా గ్రౌండింగ్‌ మేళా నిర్వహించి లబ్ధిదారుల చేత పనులు మొదలుపెట్టించాలి. తహసీల్దార్లు, ఎంపీడీవోలను సమన్వయం చేసుకుంటూ ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులపై దృష్టి సారించాలి’.. రెండు వారాల క్రితం అధికారుల సమీక్షలో  జిల్లా ఉన్నతాధికారి మాటలివి.


జిల్లాలో క్షేత్రస్థాయి అధికారుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది. అభివృద్ధి పనులు, భవన, ఇళ్ల నిర్మాణాల విషయంలో వారు తీవ్ర ఒత్తిళ్లు  ఎదుర్కొంటున్నారు. అన్ని వసతులు కల్పిస్తే పనులు చేయించడం కష్టమేమీ కాదని, అలా కాకుండా వసతులు కల్పించకుండా పనులు చేయించాలని ఒత్తిడి తేవడం ఎంతవరకు సబబని క్షేత్రస్థాయి అధికారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఎదురుచెప్పలేక, ఒకవేళ ధైర్యం చేసి చెబుతున్నా వారి నుంచి ఎదురుదాడులు వస్తుండడంతో లోలోపల మధనపడుతున్నారు. ఓ వైపు ఉన్నతాధికారులకు మరోవైపు పనులు చేసే కాంట్రాక్టర్లు, ఇళ్లు నిర్మించుకునే ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.


నెల్లూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం జిల్లాలో పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో ప్రధానమైనది జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు. వీటితోపాటు సచివాలయాలు, అంగన్‌వాడీలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు వంటి ఇతరత్రా నిర్మాణాలు ఉన్నాయి. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లలో మూడో ఆప్షన్‌  ప్రభుత్వమే లబ్ధిదారునికి ఇంటిని నిర్మించి ఇవ్వడం. ఎక్కువ మంది లబ్ధిదారులు దీనినే ఎంచుకున్నారు. అయితే నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఎక్కువ మందిని ఆప్షన్‌ మార్చుకునేలా.. మెటీరియల్‌ అందిస్తే లబ్ధిదారుడే ఇంటిని నిర్మించుకునేలా ఒప్పించారు. మొదట కొందరికి మెటీరియల్‌ అందజేసిన అధికారులు ఆ తర్వాత  మెటీరియల్‌, బిల్లులు ఇవ్వలేదు. దీంతో చాలా మంది నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. ఈ పరిస్థితిని చూసిన మిగిలిన లబ్ధిదారులు కూడా ఇంటి నిర్మాణానికి పూనుకోలేదు. వర్షాకాలం వస్తోందని, ఈలోపు ఇంటిని పూర్తి చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, త్వరగా మెటీరియల్‌, బిల్లులు ఇప్పించండంటూ లబ్ధిదారులు అధికారులను వేడుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఉన్నతాధికారులు చెబుతున్నంత సులభంగా వారు బిల్లులొస్తాయి.. ధైర్యంగా  పనులు చేయండని పేదలకు చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారులకు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసు. కానీ ప్రభుత్వ పెద్దల మెప్పుకోసమో లేదా వారి ఒత్తిళ్లతోనే గానీ జిల్లాలోని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరగాలంటూ టాస్క్‌లు పెడుతున్నారు. డెడ్‌లైన్‌లు పెడుతుండడంతో క్షేత్రస్థాయి అధికారులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇదే పరిస్థితి సచివాలయాలు, అంగన్‌వాడీలు, హెల్త్‌క్లినిక్‌ల నిర్మాణాల్లోనూ కనిపిస్తోంది. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తర్వాత పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సాహసించడం లేదు. కొన్ని భవనాల నిర్మాణాలకు పదేపదే టెండర్లు పిలుస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితి ఇలా ఉంటే ఉన్నతాధికారులు మాత్రం నిర్మాణాలు పలానా తేదీలోపు పూర్తి కావాలంటూ ఆదేశిస్తున్నారు. అలా చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుండడంతో ఆయా శాఖలు, క్షేత్రస్థాయి అధికారులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. ‘ఇంత మానసిక ఒత్తిడిని నా ఇరవై ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ అనుభవించలేదు. ఉన్నతాధికారులేమో నిర్మాణాలు పూర్తి చేయించాల్సిన బాధ్యత కేవలం మా ఒక్కరిది మాత్రమే అన్నట్లు, అలా చేయకపోతే మేము బాధ్యత వహించాలన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజలకు, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు, మెటీరియల్‌ అందిస్తే నిర్మాణాలు పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. కానీ వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు చెబుతుంటే వేరొకలా స్వీకరిస్తున్నారు. ఈ మానసిక ఒత్తిడిలో మిగిలిన పనులను సక్రమంగా చేయలేకపోతున్నాం. ఆఖరుకు ఇంటికి వెళ్లాక కూడా ప్రశాంతంగా ఉండలేకున్నాం’ అని ఓ మండల స్థాయి అధికారి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. దాదాపు అధికారులందరిలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఎవరూ బయటపడలేకపోతున్నారు.  

 

Updated Date - 2021-09-19T05:45:14+05:30 IST