బిల్లులు లేక.. పనులు సాగక!

ABN , First Publish Date - 2021-10-11T04:17:21+05:30 IST

బిల్లులు లేక.. పనులు సాగక!

బిల్లులు లేక.. పనులు సాగక!
హిరమండలంలో ఫిన్సింగ్‌ పూర్తికాని పాఠశాల అదనపు భవన నిర్మాణాలు

- నత్తనడకన ‘నాడు-నేడు’ వసతులు

- రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో జాప్యం

- నిర్మాణాలు నిలిపేసిన కాంట్రాక్టర్లు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

- హిరమండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘నాడు-నేడు’ పేరిట నాబార్డు నిధులు రూ.1.73 కోట్ల అంచనాతో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టారు. దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం రూ.30 లక్షలు మాత్రమే అధికారులు బిల్లులు చెల్లించారు. 

- రేగిడి జడ్పీ హైస్కూల్‌లో రూ.94 లక్షల అంచనాతో పనులు చేపట్టారు. 8 గదులకు మరమ్మతులు చేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కాగా, రూ.15 లక్షలు మాత్రమే బిల్లులు విడుదలయ్యాయి. దీంతో మిగిలిన పనులు నిలిపేశారు. 

- మందస ఎస్‌ఆర్‌ఎస్‌ఎం హైస్కూల్‌లో రూ.1.60 కోట్లతో పనులు చేపడుతున్నారు. 8 గదులకు గాను 6 గదుల నిర్మాణ పనులు పూర్తి చేశారు.  సకాలంలో బిల్లులు విడుదల కాకపోవడంతో మిగిలిన పనులు నిలిపేశారు. 

... ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాల కోసం నేషనల్‌ బ్యాంక్‌ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డు) నిధులను  వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా జిల్లాలో ఏపీ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు, భవనాలకు మరమ్మతులు చేపట్టేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. నాబార్డు కింద 70శాతం నిధులు కేటాయించగా... రాష్ట్ర ప్రభుత్వం 30శాతం నిధులు మ్యాచింగ్‌ గ్రాంటు కింద విడుదల చేయాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల నెపం చూపుతూ.. రాష్ట్ర వాటా  విడుదల చేయడం లేదు. దీంతో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. 


నిధుల కోసం ఎదురుచూపు

జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డు) పథకం నిధులతో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. నాబార్డు పథకం కింద జిల్లాలో 31 మండలాల్లో రూ.42.77 కోట్ల అంచనాతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్మాణాలకు గత ఏడాది జనవరి 27న పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసింది. 27 మండలాల్లో నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. పోలాకి, సోంపేట, ఎచ్చెర్ల, కవిటి మండలాల్లోని ఉన్నత పాఠశాల భవననిర్మాణ పనులకు అంచనా వ్యయం రూ.కోటి దాటింది. దీంతో ఈ నాలుగు మండలాల్లో ఎవరూ టెండర్లలో పాల్గొనలేదు.  స్థానిక కమిటీలతోనే నిర్మాణ పనులు చేపడుతున్నారు. కాంట్రాక్టర్లు దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. కానీ,  ప్రభుత్వం 30 శాతం మ్యాచింగ్‌ గ్రాంటు నిధులు విడుదల చేయలేదు. కేవలం రూ.11 కోట్లు మాత్రమే విడుదల చేసింది. పే అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో కాంట్రాక్టర్లకు రూ.31 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో పనులు అర్థాంతరంగా నిలిపేశారు. బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తుండగా.. మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిధులు విడుదల చేసి నిర్మాణ పనులు పూర్తిచేయాలని  పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-10-11T04:17:21+05:30 IST