బీమా.. కరువైన ధీమా!

ABN , First Publish Date - 2022-07-22T04:00:41+05:30 IST

జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి అన్ని రకాల పంటలు కలుపుకొని 4.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాగుకు సంబంధించి రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువుల లభ్యత ఎంత ముఖ్యమో పంటల బీమా కూడా అంతే ముఖ్యం. కానీ మూడేళ్లుగా భిన్నమైన పరిస్థితులు అలుముకున్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసిన పంటల బీమా పథకంలో వానాకాలంలో సాగు చేసిన ఆహార, నూనెగింజలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు పంటలవారీగా, ప్రాంతాల వారీగా ప్రీమియం నిర్దేశించారు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుఫాను, అనావృష్టి, వరదలు, నీటమునిగి పోవడం, తెగుళ్లు, ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడికి నష్టం వాటిల్లితే నష్టపరిహారం చెల్లించేవారు.

బీమా.. కరువైన ధీమా!

  - పంటల బీమాను పట్టించుకోని ప్రభుత్వాలు

  - ప్రైవేటు కంపెనీల్లో భారంగా మారిన ప్రీమియం

  - ఆసక్తిచూపని రైతాంగం

  - నష్టాలు సంభవిస్తే దేవుడే దిక్కు

  - ఆందోళనలో రైతాంగం

 ‘పంటల బీమా’పై ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులకు ప్రైవేటు కంపెనీలే దిక్కుగా మారాయి. ప్రీమియం ఎక్కువగా ఉండడంతో రైతులకు భారంగా మారింది. గతంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ఫసల్‌ బీమాకు మూడేళ్లుగా మంగళం పాడటంతో ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా ప్రకృతి వైపరిత్యాలతో పంటనష్టం సంభవిస్తే దేవుడే దిక్కు అన్న చందంగా మారింది. దీంతో రైతులు ఏటా నష్టపోవడం సహజంగా మారుతోంది.  - బెజ్జూరు

జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి అన్ని రకాల పంటలు కలుపుకొని 4.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాగుకు సంబంధించి రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువుల లభ్యత ఎంత ముఖ్యమో పంటల బీమా కూడా అంతే ముఖ్యం. కానీ మూడేళ్లుగా భిన్నమైన పరిస్థితులు అలుముకున్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసిన పంటల బీమా పథకంలో వానాకాలంలో సాగు చేసిన ఆహార, నూనెగింజలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు పంటలవారీగా, ప్రాంతాల వారీగా ప్రీమియం నిర్దేశించారు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుఫాను, అనావృష్టి, వరదలు, నీటమునిగి పోవడం, తెగుళ్లు, ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడికి నష్టం వాటిల్లితే నష్టపరిహారం చెల్లించేవారు.

ఏటా తప్పని నష్టాలు

అప్పట్లో మొక్కజొన్నను గ్రామ యూనిట్‌గా అమలు చేస్తుండగా, మిగితా పంటలు మాత్రం మండల యూనిట్‌గా అమలు చేసే వారు. అప్పటి నిబంధనల ప్రకారం మొక్కజొన్న ఎకరాకు రూ.500, వరికి రూ.680, కందికి రూ.280, పెసర్లకు రూ.900, పత్తికిరూ. 1750ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. మూడేళ్లుగా ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది. ఫలితంగా ప్రకృతి వైపరిత్యాల కారణంగా పంటనష్టానికి గురయ్యే రైతులకు ఏటా భారీ నష్టాలు తప్పడం లేదు. బీమా లేకపోవడం వల్ల పంట నష్టానికి గురవుతున్న రైతాంగానికి ఇక దేవుడే దిక్కు అనే చందంగా పరిస్థితి తయారైంది.

భారంగా ప్రైవేటు ప్రీమియం

ప్రభుత్వపరంగా బీమా లేకపోవడంతో రైతులు ప్రైవేటులో బీమా చేయించేందుకు వెనుకాడుతున్నారు. ప్రైవేటులో ఇన్సూరెన్స్‌ ఎక్కువగా ఉండటమే కారణం. అది కూడా పంటలు నష్టపోయిన సమయంలో బీమా వస్తదో రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి పథకం అమలుకు నోచుకోక, సొంతంగా ప్రైవేటు కంపెనీలు ప్రీమియం చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో వ్యవసాయ శాఖ పంటకోత ప్రయోగాలు చేపట్టి దాని ఫలితాల ఆధారంగా ఇన్సూరెన్స్‌ను చెల్లింపునకు సిఫార్సు చేసేవారు. కానీ ప్రస్తుత ప్రైవేటు కంపెనీల పథకాల్లో వ్యవసాయశాఖ ప్రమేయంతో పనిలేకుండా పూర్తిగా వాతావరణ అథారిత విధానంలో భాగంగా రాడార్‌ పద్ధతిలో బీమా అమలు చేయడం క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. దీనివల్ల కూడా రైతులు ప్రైవేటు బీమాను విశ్వసించడం లేదు.

పంటల బీమాపై మార్గదర్శకాలు లేవు

  - రాజులనాయుడు, ఏడీఈ

ప్రస్తుత సీజన్‌లో ఫసల్‌ బీమా అమలుకు సంబంధించి ఇప్పటివరకు మార్గదర్శకాలు విడుదల కాలేదు. పంటల బీమా కోసం రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాం. ప్రైవేటు బీమాపై తమ వద్ద ఎలాంటి సమాచారం ఉండదు. పంటలు నష్టపోయినా ప్రైవేటు కంపెనీలు మా దృష్టికి తీసుకురావు. ఈ విషయాన్ని రైతులు గమనించాలి.

Updated Date - 2022-07-22T04:00:41+05:30 IST