కట్టడి

ABN , First Publish Date - 2021-05-14T05:23:25+05:30 IST

కట్టడి

కట్టడి
అమనగల్లులో నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి

  • కొనసాగుతున్న  లాక్‌డౌన్‌
  • ఎక్కడికక్కడ పోలీసు తనిఖీలు 

ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు/యాచారం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ గురువారం రెండో రోజూ రంగారెడ్డి జిల్లా అంతటా ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6 నుంచి పది గంటలలోపే సాధారణ కార్యకలాపాలు సాగాయి. అటు తరువాత దుకాణాలు, రవాణ బంద్‌ చేశారు. హైవేలు, ఇతర రహదారులపై పోలీసులు కాపలా కాసి జనం తిరగకుండా కట్టడి చేశారు. ఇబ్రహీంపట్నంలో ఉదయం జనం పాలు, కూరగాయలు, కిరాణ సామాన్లు కొన్నారు. ఆర్టీసీ బస్సులు గ్రామీణ రూట్లలో తిరగలేదు. పల్లెలకు వెళ్లేవారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. నాగార్జునసాగర్‌ రహదారి ఇబ్రహీంపట్నం చౌరస్తా, ఓఆర్‌ఆర్‌ బొంగులూరు వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ సైదులు, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల్లో రెండో రోజు లాక్‌డౌన్‌ కొనసాగింది. తలకొండపల్లిలో సీఐ ఉపేందర్‌, ఎస్సైలు ధర్మేశ్‌, సుందరయ్య, వరప్రసాద్‌ పర్యవేక్షణలో రోడ్లపై తనిఖీలు చేశారు. శ్రీశైలం-హైదారాబాద్‌ హైవే బోసిపోయింది. ఆమనగల్లులోని పంక్షన్‌ హాళ్లలో నిబంధనల పాటించకుండా వందలాది మందితో పెళ్లిళ్లు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులంటున్నారు. వాహనదారులపై 50కేసులు నమోదు చేసినట్లు తలకొండపల్లి ఎస్సై వరప్రసాద్‌ తెలిపారు. యాచారంలో దుకాణాలు మూశారు. మాల్‌, యాచారంలలో వాహనాలు తనిఖీ చేశారు. అత్యవసర రవాణాను అనుతించారు.


  • చేవెళ్లలో రెండో రోజు లాక్‌డౌన్‌ ప్రశాంతం


చేవెళ్ల/కొత్తూర్‌/కందుకూరు/షాద్‌నగర్‌: చేవెళ్ల డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల్లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చేవెళ్లలోని హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారి వాహనాలు, జనాల్లేక బోసిపోయింది. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, మెడికల్‌ షాపులు, పెట్రోల్‌ బంక్‌లు తెరిచి ఉన్నాయి. చేవెళ్లలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ విజయ్‌భాస్కర్‌రెడ్డి పర్యవేక్షించారు. కొత్తూర్‌ మున్సిపాలిటీతో పాటు, గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింది. ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో చౌరస్తా వద్ద చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. కందుకూరులో ఉదయం 6గంటల నుంచి 10గంట ల వరకు దుకాణాలు తెరిచారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై పోలీసులు ప్రత్యేకంగా చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. షాద్‌నగర్‌లో లాక్‌డౌన్‌ను పోలీసులు సమర్థంగా అమలుచేస్తున్నారు. ఉదయం 6 నుంచి 10గంటల మధ్య రోడ్లు కిక్కిరిస్తున్నాయి. 


  • సడలింపు సమయంలో ఆర్టీసీ సేవలు


షాద్‌నగర్‌: లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు షాద్‌నగర్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ గురువారం తెలిపారు. షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు ఉదయం 4.30 నుంచి 8 గంటల వరకు ప్రతీ 20 నిమిషాలకో బస్సు బయలుదేరుతుందని, హైదరాబాద్‌ నుంచి షాద్‌నగర్‌కు ఉదయం 5.45 నుంచి ఉదయం 9గంటల వరకు 20 నిమిషాలకో సర్వీసు ఉంటుందని తెలిపారు. షాద్‌నగర్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు ఉదయం 6గంటల నుంచి 7గంటల వరకు బ స్సులు అందుబాటులో ఉంటాయని, షాద్‌నగర్‌ నుంచి ఆత్మకూరు వయా వడ్డెమాన్‌కు ఉదయం 6.40గంటలకు, 8.15గంటల వరకు రెండు బస్సులు, షాద్‌నగర్‌ నుంచి చేవెళ్లకు ఉదయం 6గంటల నుంచి 8.40గంటల మధ్య నాలుగు బస్సులు, షాద్‌నగర్‌ నుంచి ఆమనగల్లుకు ఉదయం 6గంటలకు, 6.30 గంటలకు రెండు బస్సులు నడుపుతున్నట్లు ఆయన వివరించారు.

Updated Date - 2021-05-14T05:23:25+05:30 IST