బయో ఏషియాలో మెప్పించిన మనోళ్లు

ABN , First Publish Date - 2020-02-22T07:07:56+05:30 IST

హైదరాబాద్‌లో జరిగిన బయో ఏషియా సదస్సు-2020 వేదికగా ‘బెస్ట్‌ స్టార్టప్‌’ పోటీలో ఐఐటీ హైదరాబాద్‌ ఐదో స్థానంలో నిలిచింది. భారత్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే దేశాలకు చెందిన 350కిపైగా స్టార్ట్‌పల...

బయో ఏషియాలో మెప్పించిన మనోళ్లు

ఐఐటీహెచ్‌ స్టార్టప్‌కు 5వ స్థానం

శిశువుల్లో కామెర్ల చికిత్సకు ఫొటోథెరపీ పరికరం ఆవిష్కరణ


కంది, ఫిబ్రవరి 21 : హైదరాబాద్‌లో జరిగిన బయో ఏషియా సదస్సు-2020 వేదికగా ‘బెస్ట్‌ స్టార్టప్‌’ పోటీలో ఐఐటీ హైదరాబాద్‌ ఐదో స్థానంలో నిలిచింది. భారత్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే దేశాలకు చెందిన 350కిపైగా స్టార్ట్‌పల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తగా, వాటి నుంచి 75 స్టార్ట్‌పలను సదస్సుకు ఆహ్వానించారు. ఆవిష్కరణల ఆమోదయోగ్యతే ప్రామాణికంగా స్టార్టప్‌ ప్రాజెక్టుల వివరాలను నిపుణులు నిశితంగా పరిశీలించగా, టాప్‌-5 జాబితాలో ఐఐటీహెచ్‌కు చోటు దక్కింది. రాష్ట్ర ఐటీ మంత్రి  కేటీఆర్‌ చేతులమీదుగా ఐఐటీహెచ్‌- హీమ్యాక్‌ హెల్త్‌కేర్‌ ప్రతినిధులు అవార్డును అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు తక్కువ ఖర్చుతో పరిష్కారాలను ఆవిష్కరించినందుకుగానూ స్టార్టప్‌ వ్యవస్థాపకులు ప్రసాద్‌ ముద్దం, అఖిత కొల్లోజులను కేటీఆర్‌ అభినందించారు. హీమ్యాక్‌ హెల్త్‌కేర్‌ అనేది ఐఐటీహెచ్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంటెర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీ స్టార్టప్‌. నవజాత శిశువుల్లో పచ్చకామెర్ల నియంత్రణకు ‘ఎన్‌లైట్‌360’ అనే ఫొటోథెరపీ పరికరాన్ని హీమ్యాక్‌ అభివృద్ధిచేసింది. దీన్ని వినియోగించి చిన్నపాటి పట్టణాల్లోని వైద్యులు కూడా అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లను 70 శాతం దాకా తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న పరికరాలతో పోల్చుకుంటే ‘ఎన్‌లైట్‌360’తో కామెర్ల చికిత్సకు 35 శాతం తక్కువ సమయం పడుతుంది.  

Updated Date - 2020-02-22T07:07:56+05:30 IST