బయో మందులతో రైతు దగా..

ABN , First Publish Date - 2021-10-09T05:37:29+05:30 IST

బయో మందులతో రైతు దగా..

బయో మందులతో రైతు దగా..

గుంటూరు, హైదరాబాద్‌ నుంచి జిల్లాకు చేరుతున్న నాసిరకం పురుగుల మందులు 

ఆరోగ్యానికి పొంచివున్న ప్రమాదం.. దెబ్బతింటున్న భూసారం  

కలెక్టర్‌కు నాయకులు, రైతుల ఫిర్యాదు


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, అక్టోబరు 8 : జిల్లాలో పలువురు రైతులు నాసిరకం బయో పురుగుల మందులను విక్రయిస్తూ అమాయక, నిరక్షరాస్యులైన రైతులను దగా చేస్తున్నారు. వ్యవసాయశాఖ నుంచి అనుమతి లేని బయో పురుగుల మందులను జిల్లాకు తీసుకువచ్చి విక్రయిస్తున్నా.. జిల్లా వ్యవసాయాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తకుండ ఉన్నారు. గుంటూరు, హైదరాబాద్‌ నుంచి నాసిరకం బయో పురుగుల మందులను తీసుకువచ్చి రైతులకు అంటగడుతూ... రెండు చేతుల సంపాదిస్తున్నారు. బయో పురుగుల మందుల వాడకంతో ఓ వైపు భూసారం దెబ్బతింటున్నప్పటికి మరోవైపు ఈ బయో పురుగుమందుల వాడకంతో ఉత్పత్తి అయినా పంటలు తిని ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలో బయో పురుగుమందులను విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు చేపట్టాలని పలు సంఘాల నాయకులు, రైతులు ఇటీవల కలెక్టర్‌ శశాంకను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. 


జిల్లాలో విక్రయాలు ఇలా...

జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో కూడా బయో పురుగుల మందులను విక్రయిస్తున్నారు. మానుకోటలోని బస్టాండ్‌ సమీపంలో ఏకంగా గుంటూరు పేరుతోనే బయో పురుగుమందుల విక్రయాలు భారీ ఎత్తున కొనసాగాయి. కొన్నేళ్ల వరకు గుంటూరు ప్రాంతం నుంచి బయో పురుగుల మందుల ను తీసుకువచ్చి విక్రయించిన వ్యాపారులు గతేడాది నుంచి హైదరాబాద్‌ నుంచి కూడా నాసిరకం బయో పురుగు మందులను తీసు కువచ్చి విక్రయిస్తుండడం విశేషం. ప్రముఖ కంపెనీలకు చెందిన పురుగు మందులు విక్రయిస్తే అతితక్కువ కమిషన్‌ వ్యాపారులకు దక్కుతుంది. అదేబయో పురుగుమందులను విక్రయిస్తే 80 శాతం వరకు కమిషన్‌, పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తే విదేశీ టూర్లు కూడా ఆఫర్లు ప్రకటిస్తుండడంతో వ్యాపారులు నాసిరకం బయో పురుగు మందులను విక్రయిస్తూ రైతులను నట్టెట ముంచుతున్నారు. నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసినా.. అమ్మినా పీడీయాక్టు ప్రయోగిస్తాంటూ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించినప్పటికి జిల్లాలో ఈ దందా ఆగడం లేదు. 


ప్రజల ఆరోగ్యానికి హానికరమే..

ఈ ప్రధానంగా మిర్చి, పత్తి, పసుపు, వరి పొలాలకు, కూరగాయల పంటలకు ఈ బయో పురుగు మందులను రైతులు అధికంగా వాడుతున్నారు. ఈ బయోమందులు పిచికారి చేయడం వల్ల ఎక్కువ అనార్థం జరుగుతుంది. మొక్కలు ఏపుగా పెరిగి కనుకుల మధ్య దూరం ఎక్కువగా పెరుగుతుండడంతో పంట దిగుబడి బాగా తగ్గుతుంది. పంటలో నాణ్యత కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండ ఈ బయో మందులలో కొన్ని కెమికల్స్‌ ఉండడంతో ఈ మందుల వాడకంతో ఉత్పత్తి జరిగిన పంటలను ప్రజలు తింటే రోగాల భారీన పడే ప్రమాదముంది. దానికి తోడు భూసారం కూడా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.


వ్యవసాయశాఖ అజమాయిషీ కరువు..

బయో పురుగుమందుల విక్రయంపై రాష్ట్ర వ్యవసాయశాఖ అనుమతులు లేనప్పటికి కోర్టు అనుమతులు ఉన్నాయంటూ బయో పురుగుమందులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీంతో వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. గతేడాది బేతోలు, మహబూబాబాద్‌ కేంద్రాల్లోని బయో మందులు విక్రయిస్తున్న షాపులను వ్యవసాయశాఖాధికారులు సీజ్‌ చేసి లైసెన్స్‌ కూడా రద్దు చేసినప్పటికి ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇటీవల వివిధ గ్రామాల రైతులతో పాటు ఎస్‌జేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్‌ భాస్కర్‌నాయక్‌, ఎన్‌టీవీఎ్‌స రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంగోతు చందూలాల్‌, పీవైఎల్‌ జిల్లా కార్యదర్శి పైండ్ల యాకయ్య, తెలంగాణ ఉద్యమకారుడు చిత్తారి సోమన్నలు ప్రభుత్వ అనుమతి లేకుండ నకిలీ బయోమందులు విక్రయిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని, అలాగే బస్టాండ్‌ సమీపంలో తెలంగాణ ఆగ్రో్‌స–2లో నకిలీ వరి విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేసిన ఆ షాపు యాజమాని మూడ్‌ మోహన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్‌ శశాంకను కలిసి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఆ ఆగ్రో్‌స–2లోనే మరో ఫర్టిలైజర్‌ షాపును నడిపిస్తున్నారని కలెక్టర్‌ వ్యవసాయాధికారులను ఆదేశించడం తో జిల్లాలోని పలు మండలాల్లో తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. 


బయో మందులు అంటే..?

రసాయనాలు ఉపయోగించకుండా మొక్కలు, సముద్రపు నాచు నుంచి సహజ సిద్ధంగా తయారు చేసేవే బయో మందులు. ఇందులో కలుపు నివారణ మినహాయిస్తే క్రిమిసంహరణ, పంట ఎదుగుదలకు ఉపయోగపడే మందులు ఉన్నాయి. సాధారణంగా రసాయన మందులపై దాని ఫార్ములా ముద్రించి ఉంటుంది. అదే బయోమందులపై ఎలాంటి రసాయనిక ఫార్ములా, రసాయనం పేరు అంటూ ఏదీ ఉండదు. దీనిపై కేవలం ‘సముద్రపు నాచు నుంచి తయారు చేసినది’ అని మాత్రమే ముద్రించి ఉంటుంది. ఈ కారణంగానే సులువుగా నకిలీవి తయారు చేసేందుకు ఆస్కారం కలుగుతోంది.


బయోమందులు వాడొద్దు : ఎన్‌.తిరుపతిరెడ్డి మండల వ్యవసాయాధికారి, మహబూబాబాద్‌

బయో పురుగుమందులకు వ్యవసాయశాఖ నుంచి అనుమతి లేదు. కోర్టు అనుమతి ఉండడంతో విక్రయాలు కొనసాగుతున్నప్పటికి సీజ్‌ చేసే అవకాశం, అధికారం వ్యవసాయశాఖకు లేదు. దీంతో పురుగుల మందు వాడకంతో పంటల దిగుబడి తగ్గడం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని గమనించి రైతులను బయో మందులు వాడోద్దంటూ గ్రామగ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. రైతులను చైతన్యం చేస్తున్నాం. గతేడాది రైతుల ఫిర్యాదుతో కొన్ని షాపులపై దాడులు నిర్వహించి రూ.5 లక్షల మందులను సీజ్‌ చేసి లైసెన్స్‌లు రద్దు చేశాం. అయినప్పటికి కొంతమంది రైతులు ఈ బయో మందులను వాడుతున్నారు.  





Updated Date - 2021-10-09T05:37:29+05:30 IST