ఆన్‌రోడ్‌పై జీవితరచన

ABN , First Publish Date - 2021-06-09T05:30:00+05:30 IST

ఉదయం పాలు అమ్మడం.. ఆ తర్వాత కిరాణాకొట్టులో పనిచేయడం.. మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు వినడం.. సాయంత్రం ఐదు గంటలయితే చాలు ఫుడ్‌ డెలివరీ చేయటం..

ఆన్‌రోడ్‌పై  జీవితరచన

ఉదయం పాలు అమ్మడం..

ఆ తర్వాత కిరాణాకొట్టులో పనిచేయడం..

మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు వినడం..

సాయంత్రం ఐదు గంటలయితే చాలు ఫుడ్‌ డెలివరీ చేయటం..

ఈ పనులన్నీ ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి ఒంటి చేత్తో రోజూ చేస్తోంది.

పేరు మామిడిపల్లి రచన. హైదరాబాద్‌ నగరంలో ‘తొలి ఫుడ్‌ డెలివరీ గర్ల్‌’ రచన ‘నవ్య’తో మాట్లాడిందిలా.. 


‘‘ఓ రోజు రోడ్డు దాటుతున్నా. 

ద్విచక్ర వాహనంపై ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ సిగ్నల్‌ పడితే చాలు వేగంగా వెళ్లిపోవాలనే ఆతృతలో ఉన్నాడు. తన పేరు అడిగా. ‘రాజు‘ అన్నాడు. జొమోటోలో ఆడపిల్లలు చేరొచ్చా అని అడిగా. ‘ఎవరైనా చేరొచ్చు’ అన్నారాయన. ఫోన్‌ నంబరిచ్చాడు. ఎలా చేరాలో చెప్పాడు. జొమోటో ఆఫీసు దగ్గరకి వెళ్లి రెండు వందల రూపాయలు చెల్లించి టీషర్టు, ఫుడ్‌ బ్యాగ్‌ కొన్నాను. ఫోనులో ఆ సంస్థ పంపిన ప్రశ్నలకు జవాబులిచ్చా. ఫోనులోనే శిక్షణ ఇచ్చారు. ఎన్నో మెలకువలు చెప్పారు. అలా రాజు అన్నయ్య పరిచయంతో జొమోటోలో మే 22, 2021లో చేరాను. 


అందుకే ఆశ్చర్యపోయాను 

నా దగ్గర బైక్‌ లేదు. దీంతో నేను పనిచేసే కిరాణాషాపు యజమానిని రిక్వెస్టు చేసి సాయంత్రం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు బైక్‌ ఇప్పించుకున్నా. ఏడో తరగతిలో మా బాబాయి నేర్పించిన బైక్‌ డ్రైవింగ్‌ నాకు ఈ విధంగా జొమోటో ఉద్యోగంలో ఉపయోగపడుతుందని అనుకోలేదెప్పుడూ. సికింద్రాబాద్‌ దగ్గర ఉండే తార్నాక ప్రాంతంలో నా పని ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో నేనే తొలి ఫుడ్‌ డెలివరీ గర్ల్‌ కావటంతో ఆశ్చర్యపడ్డాను. ఆ తర్వాత నాచారం, మల్లాపూర్‌, మల్కాజ్‌గిరి, హబ్సిగూడ, సీతాఫల్‌మండి ప్రాంతాల్లోని వినియోగదారులకు ఆహారం అందించేదాన్ని. ‘పొరబాటున కూడా అపార్ట్‌మెంట్‌లలోకి వెళ్లొదు. జాగ్రత్తగా ఉండు. క్యాష్‌ ఆన్‌ డెలివరీలు తీసుకోవద్ద’ని చెప్పారు నా తోటి ఉద్యోగులు. ఇప్పటివరకూ నాకెలాంటి ఇబ్బందులు రాలేదు. కొందరు టిప్పులు కూడా ఇచ్చేవారు. నేను ప్రతిరోజూ తొమ్మిది ఆర్డర్లు డెలివరీ చేస్తే 440 రూపాయలు వస్తాయి. అలా వారానికి నాలుగువేల జీతం అందుతుంది.  


ఉలుసు బ్రహ్మానందం, హైదరాబాద్‌

              ఫొటోలు: చిట్టిబాబు 


బల్కంపేటలోని చెన్నయ్స్‌ అమృత హోటల్‌మేనేజ్‌మెంట్‌ కాలేజీకి వెళ్లాను. మూడేళ్లకు రెండున్నర లక్ష రూపాయల ఫీజు ఉంటుందని చెప్పారు. నా కుటుంబ పరిస్థితి చెప్పాక మూడు దఫాల్లో కట్టమన్నారు. అప్పుచేసి ఇరవైవేలు కట్టాను. అమ్మానాన్నను చూసుకోవటంతో పాటు కాలేజీఫీజు కట్టడానికే తార్నాకలో ప్రతిరోజు తెల్లారుజామున నాలుగ్గంటలకు పాలు అమ్మేదాన్ని. ఆ తర్వాత షాపులో పనిచేసినందుకు ఆ యజమాని నెలకు తొమ్మిదివేల రూపాయలు జీతం ఇచ్చేవారు.


వరంగల్‌ జిల్లాలోని బాలసముద్రం అంబేద్కర్‌ నగర్‌ మాది. నాన్న మామిడిపల్లి రవి మేస్ర్తీ. అమ్మ పేరు సాంబ. తను కూలిపని చేస్తుంది. మా నాన్న అప్పులు చేసి మా అక్క రుచిత పెళ్లి చేశారు. నేను ఇంటర్‌ పూర్తయ్యాక హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో చేరాలనుకున్నా. హైదరాబాద్‌కు వెళ్లి చదువుతానంటే ‘అంత డబ్బులు లేవు’ అన్నారు మానాన్న. దీంతో గతేడాది నవంబర్‌లో హైదరాబాద్‌ వచ్చి తార్నాకలో పండ్లవ్యాపారం చేసే మా మామయ్య అయిన గుర్రం యాదగిరి దగ్గరికి వెళ్లి కొన్నాళ్లు అక్కడున్నా. ఆ తర్వాత ఓ స్నేహితురాలితో కలిసి అద్దెకు రూమ్‌ తీసుకున్నా.


రోడ్డు మీదే మరో అదృష్టం

ఉద్యోగంలోకి చేరాక సీతాఫల్‌మండి చౌరస్తా క్రాస్‌ చేస్తున్నా ఆ సమయంలో ఒకాయన నా బండి ఆపాడు. భయపడ్డా. జొమోటో బాయ్స్‌ దగ్గరకి వెళ్లి ఆగాను. నా దగ్గరి అతను వచ్చాడు. ‘నా పేరు ఇమ్రాన్‌ ఖాన్‌. స్విగ్గీ బాయ్స్‌కి సాయం చేశా‘ అన్నారు. నాతో మాట్లాడుతూ నా కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. తర్వాత రోజు పదివేల రూపాయలు డబ్బులు సాయం చేశారు. తర్వాత రెండు రోజులకు బైక్‌ తీసుకొచ్చి ఇచ్చారాయన. ఎవరో తెలీని ఆయన ఇలా ప్రోత్సహించటం గొప్పగా ఫీలయ్యా. నేను ఒకరోజు రోడ్డు మీద రాజు భాయ్‌ను అడిగి ఉద్యోగం చేరినట్లే.. నాకు ఇలా మరోసారి రోడ్డుమీదనే మంచి జరగటం అదృష్టం. ఇప్పటికైతే పాలు అమ్మటం, కిరాణా షాపులో పని, ఫుడ్‌ డెలివరీ గర్ల్‌ ఉద్యోగాలతో నా చదువుకే కాకుండా లాక్‌ డౌన్‌ సమయంలో మా తల్లిదండ్రులకూ డబ్బులు పంపించగలుగుతున్నా. నా చదువుకు డబ్బు కట్టుకోగలుగుతున్నా. చదువు మీద ప్రేమనే చిన్న వయసులో కష్టపడేట్లు చేసింది. ఏదేమైనా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివాక మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్నదే నా కోరిక.’’

Updated Date - 2021-06-09T05:30:00+05:30 IST