ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-08-28T04:14:34+05:30 IST

కరోనా కారణంగా మూడేళ్ల పాటు నిలిచిపోయిన బయోమెట్రిక్‌( హాజరు విధానాన్ని మళ్లీ పునరుద్దరించబోతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి

-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

-సోమవారం నుంచి అన్ని పాఠశాలల్లో అమల్లోకి

-ఈసారి కొత్తగా లీవ్‌లెటర్‌ ఆన్‌లైన్‌లోనే

-రెండో దశలో విద్యార్థులకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

కరోనా కారణంగా మూడేళ్ల పాటు నిలిచిపోయిన బయోమెట్రిక్‌( హాజరు విధానాన్ని మళ్లీ పునరుద్దరించబోతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని 647పాఠశాలకు చెందిన బయోమెట్రిక్‌ పరికరాలసర్వీసింగ్‌ను పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి పీఏసీఎస్‌ సంస్థ ద్వారా నూతన అబాస్‌ ఐడీ(గుర్తింపు సంఖ్య) అందజేసేందుకు సిద్ధం చేశారు. దాంతో సోమవారం నుంచి బయోమెట్రిక్‌ ఆధారిత హాజరు నమోదు ప్రారంభం అవుతుందని జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి ఎం భరత్‌ కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. 

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో

ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలు, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ నమోదు చేయనున్నారు. సోమవారం ఐడీలు అందగానే ఈ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ నమోదు ప్రారంభమవుతుంది. మొదటి దశలో ఉపాధ్యాయులకు బయెమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదు చేస్తుండగా రెండో దశలో విద్యార్థులకు కూడా బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను అమలు చేయనున్నారు. తద్వారా మధ్యాహ్న భోజనం మొదలుకొని ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతం నమోదు వరకు అంతా పారదర్శకంగా ఉంటుం దని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విధానం జిల్లాతోపాటు రాష్ట్రంలో మరో 14జిల్లాలో అమలవుతోంది. 

ఈసారి అబాస్‌లోనే సెలవుల నిర్వహణ

సోమవారం నుంచి ప్రారంభించనున్న బయెమెట్రిక్‌ విధానంలో భాగంగా ఈసారి ఏబీఎఎస్‌(అబాస్‌)లోనే సెలవుల నిర్వహణను కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో సెలవులకు దరఖాస్తులు చేయడం, ఓడి దరఖాస్తు, పండుగ సెలవుల సృష్టి అనే మూడు ఆప్షన్‌లు బయెమెట్రిక్‌లోనే ప్రవేశపెడుతున్నారు. ఇందులో అప్లై లీవ్‌ ఆప్షన్‌ ఉపాధ్యాయుడు/ప్రధానోపాధ్యాయుడు సెలవుపై వెళ్లిన పక్షంలో వివరాలు నమోదు చేసే వెసులు బాటు ఉంటుంది. ఈ తరహాలో సీఎల్‌, ఓసీఎల్‌, ఎస్‌ఎల్‌ అనే మూడు రకాల సెలవులను నమోదు చేసేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు. అలాగే అప్లయ్‌ ఓడీకింద ప్రధానోపాధ్యాయుడు/ఉపాధ్యాయుడు ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆన్‌డ్యూటీపై శిక్షణ కార్యక్రమాలు ఇతర సమావేశాలకు వెళ్లిన సందర్భాల్లో ఆన్‌డ్యూటీ(ఓడీని) నమోదు చేసేందుకు ఏర్పా ట్లు చేశారు. ఏదైనా పాఠశాలల్లో పొలాల అమవాస్య, గంగాపూర్‌ జాతర, టోంకిని జాతర లాంటి స్థానిక సెలవులను ప్రకటించిన సందర్భంలో పాఠశాలకు స్థానికసెలవులను(లోకల్‌ సెలవు) ఎల్‌హెచ్‌ అనే ఆప్షన్‌పై నమోదు చేసేందుకు సాఫ్ట్‌వేర్‌లో ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-28T04:14:34+05:30 IST